గ్రేటర్‌లో 3 వేల కరోనా కేసులు మిస్సింగ్‌! | Hyderabad Over 3000 Covid Cases Untraceable Private Labs Ignore Test Rules | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ల్యాబ్‌ల నిర్వాకం.. అధికారులకు టెన్షన్‌

Published Sat, Jul 4 2020 1:34 PM | Last Updated on Sat, Jul 4 2020 4:10 PM

Hyderabad Over 3000 Covid Cases Untraceable Private Labs Ignore Test Rules - Sakshi

హైదరాబాద్‌: రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో తీవ్ర ఆందోళనలో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి మరో షాక్‌ తగిలింది. ప్రస్తుతం కోవిడ్‌ పరీక్షల కోసం ప్రైవేట్‌ ల్యాబ్‌లకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత పది రోజులుగా కరోనా పాజిటివ్‌ వచ్చిన 3 వేల మంది రోగుల వివరాలను ప్రైవేట్‌ ల్యాబ్‌లు ప్రభుత్వానికి నివేదించలేదని తెలిసింది. మరింత ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ప్రస్తుతం వీరికి సంబంధించిన 6వేల ప్రైమరీ కాంటక్ట్‌ల గురించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం వీరిని ఎలా గుర్తించాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు.

వివరాలు.. ప్రైవేట్‌ ల్యాబ్‌లలో పరీక్షలకు అనుమతిచ్చిన నాటి నుంచి తెలంగాణలో కేసుల సంఖ్య బాగా పెరుగుతోంది. దాంతో అధికారులు ప్రైవేట్‌ ల్యాబ్‌ల మీద పరిశోధన చేయడంతో ఈ షాకింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి. దాదాపు 3వేలకు పైగా పాజిటివ్‌ కేసుల గురించి ప్రైవేట్‌ ల్యాబ్‌లు రాష్ట్ర ఆరోగ్య శాఖకు కానీ ఐసీఎంఆర్‌కు కానీ నివేదించలేదని తెలిసింది. కరోనా రోగులను టెస్ట్‌ చేయడం, గుర్తించడం, చికిత్స చేయడం వంటి అంశాల గురించి ప్రైవేట్‌ ఆస్పత్రులకు సరిగా తెలియకపోవడం వల్లే ఈ తప్పిదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా ప్రతి రోజు జరిపే కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన అతడు / ఆమె వివరాలను పరీక్షాకేంద్రాలు ప్రభుత్వానికి, కోవిడ్‌-19 పోర్టల్‌కు నివేదిస్తారు. అలా ఆ వ్యక్తికి ఒక యూనిక్‌ ఐడీ నంబర్‌ కేటాయిస్తారు. ఈ ఐడీ ద్వారా ప్రభుత్వ ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్‌ సదరు పేషెంట్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌ను ట్రేస్‌ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఉద్యోగుల బృందం పని చేస్తోంది. (తెలంగాణలో 1892 కరోనా పాజిటివ్‌ కేసులు)

అయితే ప్రైవేట్‌ ల్యాబ్‌లు కరోనా టెస్ట్‌లు చేయడం కోసం వచ్చిన వారి దగ్గర నుంచి 3-6వేల రూపాయలు వసూలు చేశాయి. రిపోర్టులు ఇచ్చిన తర్వాత రోగులను గాలికి వదిలేసారు. ఆ వివరాలను ప్రభుత్వానికి తెలపలేదు. దాంతో పాజిటివ్‌ పేషంట్లు సామాన్య జనాల్లో కలిసిపోయారు. ప్రైవేట్‌ ల్యాబ్‌ల దగ్గర బిల్‌ నంబర్లు ఉన్నాయి కానీ యూనిక్‌ ఐడీలు లేవన్నారు అధికారులు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం పడుతుండటంతో ప్రజలు ప్రైవేట్‌ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. అధికారులు దీనిపై స్పందిస్తూ.. బాధ్యతారహితంగా ప్రవర్తించిన ప్రైవేట్‌ ల్యాబ్‌ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే సదరు ప్రైవేట్‌ ల్యాబ్‌లకు నోటీసులు పంపినట్లు వెల్లడించారు. కానీ ప్రస్తుతం ఈ పాజిటివ్‌ పేషంట్లను.. వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించడం తమ ముందున్న అతి పెద్ద సవాలంటున్నారు అధికారులు. (జ్వరమా.. నో అడ్మిషన్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement