Private Lab
-
దోపిడి దోమ
రాయదుర్గంలోని నేసేపేటకు చెందిన సిద్ధన్న అనారోగ్యానికి గురై ఓ ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. అతడి సలహా మేరకు ఓ సీనియర్ వైద్యుడి దగ్గరకు వెళితే.... రోగి చెబుతున్నది వినకుండానే రక్తపరీక్షలు చేయించుకుని రమ్మంటూ ఓ చీటి రాసి చేతిలో పెట్టాడు. దీంతో సిద్ధన్న ఓ ప్రైవేట్ ల్యాబ్‌కు వెళితే.. రోగ నిర్ధారణ పరీక్షకు అక్షరాల రూ.950 బిల్లు అయింది. ల్యాబ్ నిర్వాహకుడు ఇచ్చిన రిపోర్టు తీసుకుని తిరిగి సదరు డాక్టర్ వద్దకు వెళితే... సాధారణ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపి మందులు రాసిచ్చాడు. ఈ తరహా దోపిడీతో వైద్యులు, ల్యాబ్ నిర్వాహకులు కలిసి రోగుల జేబులు గుల్ల చేస్తున్నారు. రాయదుర్గం: జిల్లాల్లో సీజనల్ వ్యాధులు మొదలయ్యాయి. దోమ కాటుతో మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి జ్వరాలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. దీనికి తోడు రోగ నిర్ధారణకు సంబంధించి ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకుల వైఖరి మరీ దారుణంగా మారింది. రక్తాన్ని పీల్చే దోమ కాటుతో కోలుకోవచ్చు కానీ, నగదు కొల్లగొడుతున్న దోపిడీ దోమల దెబ్బకు రోగులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. భయాన్ని సొమ్ము చేసుకుంటూ.. సాధారణ జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతూ వైద్యుడి దగ్గరకు వెళ్లినా.. రోగ నిర్ధారణ పరీక్ష తప్పనిసరి అంటున్నారు. రోగ నిర్ధారణ పరీక్షకు సంబంధించి రిపోర్టులు లేకుంటే వైద్యం చేయలేని అసహాయ స్థితికి వైద్యులు చేరుకున్నారంటే పొరబడినట్లే. కన్సల్టెంట్ ఫీజు రూపంలో కొంత దండుకునే వైద్యుడు... రోగ నిర్ధారణ పరీక్షలకు రెఫర్ చేయడం ద్వారా మరికొంత కమీషన్ దక్కుతుండడమే ఇందుకు కారణం. విష జ్వరాలపై ప్రజల్లో ఉన్న భయాన్ని తెలివిగా దోపిడీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనుమతి పొందిన ల్యాబ్‌లు 79 ఉండగా... అనధికారికంగా నిర్వహిస్తున్నవి దీనికి రెట్టింపుగానే ఉన్నాయి. ఉచితంగా అందుబాటులో ఉన్నా.. మలేరియా, టైఫాయిడ్‌తో పాటు గర్భిణులకు బ్లడ్ గ్రూపింగ్, హెచ్ఐవీ, బ్లడ్ షుగర్, హైపటైటిస్–బీ, యూరిన్, టీబీ పరీక్షలతో పాటు డెంగీ, ప్లేట్లేట్ కౌంట్, కిడ్నీ, లివర్ ఫంక్షన్ లాంటి ఇతర కీలక వ్యాధుల నిర్ధారణకు అవసరమైన పరీక్షలు ప్రాథమిక, అర్బన్ ప్రైమరీ ఆరోగ్య కేంద్రాల్లోనే నిర్వహిస్తుంటారు. డెంగీ పరీక్ష కోసం పీహెచ్‌సీల్లోనే రక్త నమూనాలు సేకరించి ‘ఎలిసా’ పరీక్ష కోసం జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రికి పంపిస్తారు. 24 గంటల్లోపు పరీక్ష చేసి రోగికి సమాచారం అందేలా చర్యలూ తీసుకున్నారు. ఇష్టారీతిన ఫీజుల వసూళ్లు.. ఉమ్మడి జిల్లాలో గడిచిన ఆరేళ్లు పరిశీలిస్తే 1,538 డెంగీ, 816 మలేరియా, 670 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. 2017–19 మధ్య డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌కు సంబంధించి 80 శాతం కేసులు నమోదు కావడం విశేషం. ప్రాణాంతకమైన ఈ రోగాలకు సంబంధించి విధిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇది కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి బిల్లు వసూలు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ధరల పట్టికను సంబంధిత ప్రైవేట్ ల్యాబ్‌ల్లో తప్పనిసరిగా ప్రదర్శనకు ఉంచాలి. అయితే అధికారిక పర్యవేక్షణ కొరవడడంతో ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదు. పైగా ప్రశ్నించిన రోగుల పట్ల దురుసుగా వ్యవహరించడం, గంటల తరబడి వేచి ఉండేలా చేసి ఇబ్బందులు గురి చేస్తుంటారు. టైఫాయిడ్, మలేరియా లాంటి పరీక్షలకు రూ.180 నుంచి రూ.200ల వరకు వసూలు చేస్తారు. అయితే ఈ పరీక్షలకు రూ.500 నుంచి రూ.600 వరకూ తీసుకుంటూ రోగుల జేబులు కొల్లగొట్టడం విమర్శలకు దారి తీస్తోంది. అనుమతి లేని ల్యాబ్‌లపై చర్యలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ల్యాబ్‌లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడినట్లు తేలితే అనుమతులున్నా ల్యాబ్‌లను సీజ్ చేస్తాం. – డాక్టర్ ఓబులు, జిల్లా మలేరియా అధికారి, అనంతపురం ఉచిత సేవలు సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ ఇతర విష జ్వరాల నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రైవేటు ల్యాబ్‌ల దోపిడీని ఉపేక్షించబోం. – డాక్టర్ విశ్వనాథయ్య, డీఎంహెచ్ఓ (చదవండి: ఇదే చివరి అవకాశం.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు ) -
Covid: కొద్దిపాటి జలుబు, జ్వరానికే పాజిటివ్.. వైరస్ ఏదో చెప్పేస్తామంటూ..
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ భయాందోళనలతో టెస్టుల కోసం వెళ్లే బాధితులను పరీక్ష కేంద్రాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. సకాలంలో వెలువడని ఫలితాలు బెంబేలెత్తిస్తున్నాయి. మూడు రోజులైనా ఫలితాలు రాకపోవడంతో చాలా మంది ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇదే అదనుగా డయాగ్నోస్టిక్ కేంద్రాలు కోవిడ్ పరీక్ష ఫీజులను అమాంతం పెంచి నిలువునా దోచుకుంటున్నాయి. వారం, పది రోజుల క్రితం వరకు రూ.500కే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసిన డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో ఇప్పుడు ఏకంగా రూ,750 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. మరికొన్ని కేంద్రాలు రూ.1500 వరకు తీసుకుంటున్నాయి. నగరంలో ప్రస్తుతం ఇదో దందాగా మారింది. కొద్దిపాటి జలుబు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నా కోవిడ్ టెస్టుల్లో పాజిటివ్ రావడంంతో జనం తప్పనిసరిగా పరీక్షలకు వెళ్లాల్సివస్తోంది. చదవండి: Corona: తగ్గేదేలే అంటున్న కోవిడ్.. ప్రతి 100 మందిలో 15 మంది.. అక్కడా పడిగాపులే... నగరంలోని సుమారు 200కుపైగా బస్తీ దవాఖానాలు, మరో 120 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అన్ని ఏరియా ఆస్పత్రులతో పాటు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి వంటి అన్ని ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లోనూ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. గ్రేటర్ పరి«ధిలో రోజుకు 50వేలకుపైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అంచనా. ఒక్కో ఆరోగ్య కేంద్రం వద్ద ప్రతిరోజూ వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఫలితాల వెల్లడిలో మాత్రం తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంటోంది. బాధితుల తాకిడి, డిమాండ్ మేరకు పరీక్షలు నిర్వహించే సదుపాయాలు లేకపోవడం, సిబ్బంది కొరత వంటి కారణాల దృష్ట్యా పరీక్షల నిర్వహణలో, ఫలితాల వెల్లడిలో ఆలస్యం అనివార్యంగా మారింది. కొన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఫలితాల కోసం 48 గంటల పాటు నిరీక్షించాల్సివస్తే మరికొన్ని చోట్ల మూడు రోజుల వరకు సమయం పడుతుంది. దీంతో బాధితులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. సాధారణ జలుబు, జ్వరమో, కోవిడ్ లక్షణాలో తేల్చుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు. ‘ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండాలో, వద్దో తెలియడం లేదు’ అని సికింద్రాబాద్ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి విస్మయం వ్యక్తం చేశారు. చదవండి: కోవాగ్జిన్, కోవిషీల్డ్ విక్రయానికి అనుమతి ‘తమకు తెలియకుండానే కుటుంబ సభ్యులను కూడా వైరస్‌కు గురి చేసినట్లవుతుంద’ని పద్మారావునగర్‌కు చెందిన మరొకరు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు సిబ్బంది కొరత కారణంగానే కొన్ని చోట్ల ఫలితాల వెల్లడిలో ఆలస్యమవుతోందని వైద్య ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు. ‘ప్రతి రోజూ వందలాది మంది నుంచి నమూనాలను సేకరించే క్రమంలో సిబ్బంది సైతం కోవిడ్ బా రిన పడుతున్నారు’అని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణులు ఒకరు తెలిపారు, రెండోసారి తప్పనిసరి కాదు.. కోవిడ్ పరీక్షల కోసం రూ.వేలల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. ‘సాధారణ జలుబు, జ్వరం వంటి లక్షణాలతో ఒమిక్రాన్ బారిన పడినవారు వారం పాటు ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడితే చాలు. ఆ తర్వాత ఎలాంటి లక్షణాలు, ఇబ్బందులు లేకపోతే ఐసోలేషన్ నుంచి బయటకు రావచ్చు. మరోసారి పరీక్షలు అవసరం లేదు’ అని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శివరాజ్ తెలిపారు. వైరస్ ఏదో చెప్పేస్తామంటూ.. బాధితుల అవసరాన్ని, ఆపదను ప్రైవేట్ లాబ్‌లు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. కోవిడ్ రెండో ఉద్ధృతి సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు రోగులను నిలువునా దోచుకుంటే ఇప్పుడు డయాగ్నోస్టిక్ కేంద్రాలు పరీక్ష ఫీజులు పెంచేసి దోచుకుంటున్నాయి. ఈ నెల రెండో వారం వరకు కేవలం రూ.500కే ఆర్టీపీసీఆర్ నిర్వహించిన లాబ్‌లలో ఇప్పుడు రూ.750 నుంచి రూ.వెయ్యి వరకు పెంచారు. వైరస్ ఏ రకం వేరియంటో కూడా తమ పరీక్షల్లో తేలుతుందని, డెల్టా రకమా? ఒమిక్రానా? చెప్పేస్తామని మరికొన్ని డయాగ్నోస్టిక్ కేంద్రాలు రూ,1500 నుంచి రూ.2000 వరకు తీసుకుంటున్నాయి. ఇంటి వద్దకు వచ్చి నమూనాలు సేకరిస్తే అదనపు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ‘ఈ ఉద్ధృతి ఇలాగే కొనసాగితే మరో వారం, పది రోజుల్లో ఫీజులు మరింత పెరగవచ్చు’ అని సికింద్రాబాద్‌కు చెందిన ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడు తెలిపారు. మరోవైపు ఇలా వేల రూపాయల్లో ఖర్చు చేసినప్పటికీ కొన్ని ప్రైవేట్ పరీక్ష కేంద్రాల్లోనూ 24 గంటల తర్వాతే ఫలితాలు వెలువడడం గమనార్హం. -
భార్య నుంచి పారిపోవడానికి భర్త మాస్టర్ ప్లాన్!
భోపాల్: దేశంలో కరోనా సృష్టించిన విధ్వంసం మనందరికి తెలిసిందే. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం, కరోనా సోకిన వ్యక్తి, 14 రోజుల హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలి. ఈ సమయంలో వారితో ఎవరు కలవకుండా, సామాజిక దూరం పాటించాలన్న విషయం తెలిసిందే. అయితే, కొందరు ఈ నిబంధనను తమ వ్యక్తిగత విషయాల కోసం దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా, మధ్య ప్రదేశ్‌లో ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇండోర్‌లోని మోవ్ అనే ప్రాంతంలో 26 ఏళ్ల వ్యక్తికి గడిచిన ఫిబ్రవరిలో వివాహం జరిగింది. అతనికి భార్య, ఇంట్లోవారితో మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఎలాగైle ఇంట్లో నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకున్నాడు. కాగా, దీనికోసం ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఒక ప్రైవేటు ల్యాబ్ నుంచి కోవిడ్ సోకిన వ్యక్తి రిపోర్ట్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. దానిపై అతని పేరును మార్చి, తన పేరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత , ఆ రిపోర్ట్‌ను తన భార్య, తల్లిదండ్రులకు వాట్సప్ చేశాడు. అయితే, కుటుంబ సభ్యులు,ఈ వాట్సప్ చూసి షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే అతనికి ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. దీంతో, వారికి తమ కుమారుని ప్రవర్తనపై అనుమానం కలిగింది. వారు వెంటనే ఆ వాట్సప్‌లో ఉన్న ప్రైవేటు ల్యాబ్‌ను వెళ్లి సంప్రదించారు. అప్పుడు వారికి తమ కొడుకు చేసిన మోసం బయటపడింది. దీంతో, ఆశ్చర్యపోయి, వారు ఇంటికి వెళ్లిపోయారు. అయితే, ఆ ల్యాబ్ టెక్నిషియన్ మాత్రం, తమ ల్యాబ్ రిపోర్ట్‌ను ఫోర్జరీతో మార్పిడి చేసినందుకుగాను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో గ్వల్టోలి పోలీసులు నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసులను నమోదుచేశారు. -
ఆ ల్యాబ్‌లో నెగెటివ్.. ప్రభుత్వ టెస్ట్‌ల్లో పాజిటివ్
సాక్షి, తిరుపతి : నెలలు నిండిన గర్భిణి డెలివరీ కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. కరోనా టెస్ట్ చేయించుకొస్తేనే అడ్మిట్ చేసుకుంటామని వైద్యులు స్పష్టం చేశారు. ఆమె ఈ నెల 3న రుయాకు వెళ్లి స్వాబ్ ఇచ్చారు. అక్కడ ఆలస్యం అవుతుండడంతో 7న తిరుపతిలోని ప్రైవేటు ల్యాబ్‌కి వెళ్లి కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్‌లో నెగెటివ్ వచ్చింది. మరుసటి రోజు రుయా నుంచివచ్చిన రిపోర్ట్‌లో పాజిటివ్ అని తేలింది. ఇటీవల మరణించిన వీడియో జర్నలిస్ట్ సారథి జ్వరం రావడంతో తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి డాక్టర్ కరోనా టెస్ట్ చేసుకోమని సూచించారు. సారథి ప్రైవేటు ల్యాబ్‌ను ఆశ్రయించారు. అక్కడ నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది. కరోనా లేదని సాధారణ జ్వరమేనని చికిత్స చేసుకుని నిర్లక్ష్యంగా ఉండిపోయారు. నాలుగు రోజుల తరువాత ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే.. అనుమానం వచ్చి స్విమ్స్‌కు వెళ్లారు. అప్పటికే చేయి దాటిపోయే పరిస్థితి. స్విమ్స్‌లో చేరిన మరుసటి రోజే మృతిచెందారు. కరోనా నిర్ధారణ పరీక్షలను కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాకుండా ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అనుమతి పొందిన తిరుపతిలోని ఆ ల్యాబ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో జిల్లా ముందంజలో ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ల్యాబ్‌లపై ఒత్తిడి పెరిగింది. అక్కడ ఫలితాల నివేదిక ఆలస్యం అవుతోందనే కారణంతో చాలామంది ప్రైవేటు ల్యాబ్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రైవేటు ల్యాబ్ కరోనా నిర్ధారణ ఫలితాలపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ ల్యాబ్‌ల్లో స్వాబ్ ఇచ్చి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న పలువురు తిరిగి ప్రైవేటు ల్యాబ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఒకటి రెండు రోజుల వ్యవధిలో వచ్చే ఈ రెండు ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. కొందరికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నా.. ప్రైవేట్ ల్యాబ్‌లో నెగటివ్‌గా రిపోర్ట్ రావడంతో ధైర్యంగా విచ్చలవిడిగా తిరిగి ఇతరులకు వ్యాపింపచేయడమే కాకుండా వారి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇటీవల ఆ ప్రైవేటు ల్యాబ్‌పై ఫిర్యాదులు అధికమయ్యాయి. రోజుల వ్యవధిలోనే రెండు రకాలుగా రిపోర్టులు వస్తుండడంతో బాధితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కరోనా ఉందా? లేదా? అన్న అనుమానంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. విచారించి చర్యలు తీసుకుంటాం తిరుపతిలోని ఆ ల్యాబ్‌పై పలు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ల్యాబ్‌లో పొరబాట్లు జరుగుతున్నట్లు తేలితే అనుమతులు రద్దుచేస్తాం. – డాక్టర్ పెంచలయ్య,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి -
గ్రేటర్లో 3 వేల కరోనా కేసులు మిస్సింగ్!
హైదరాబాద్: రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో తీవ్ర ఆందోళనలో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ప్రస్తుతం కోవిడ్ పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత పది రోజులుగా కరోనా పాజిటివ్ వచ్చిన 3 వేల మంది రోగుల వివరాలను ప్రైవేట్ ల్యాబ్‌లు ప్రభుత్వానికి నివేదించలేదని తెలిసింది. మరింత ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ప్రస్తుతం వీరికి సంబంధించిన 6వేల ప్రైమరీ కాంటక్ట్‌ల గురించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం వీరిని ఎలా గుర్తించాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. వివరాలు.. ప్రైవేట్ ల్యాబ్‌లలో పరీక్షలకు అనుమతిచ్చిన నాటి నుంచి తెలంగాణలో కేసుల సంఖ్య బాగా పెరుగుతోంది. దాంతో అధికారులు ప్రైవేట్ ల్యాబ్‌ల మీద పరిశోధన చేయడంతో ఈ షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. దాదాపు 3వేలకు పైగా పాజిటివ్ కేసుల గురించి ప్రైవేట్ ల్యాబ్‌లు రాష్ట్ర ఆరోగ్య శాఖకు కానీ ఐసీఎంఆర్‌కు కానీ నివేదించలేదని తెలిసింది. కరోనా రోగులను టెస్ట్ చేయడం, గుర్తించడం, చికిత్స చేయడం వంటి అంశాల గురించి ప్రైవేట్ ఆస్పత్రులకు సరిగా తెలియకపోవడం వల్లే ఈ తప్పిదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా ప్రతి రోజు జరిపే కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన అతడు / ఆమె వివరాలను పరీక్షాకేంద్రాలు ప్రభుత్వానికి, కోవిడ్-19 పోర్టల్‌కు నివేదిస్తారు. అలా ఆ వ్యక్తికి ఒక యూనిక్ ఐడీ నంబర్ కేటాయిస్తారు. ఈ ఐడీ ద్వారా ప్రభుత్వ ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ సదరు పేషెంట్ కాంటాక్ట్ లిస్ట్‌ను ట్రేస్ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఉద్యోగుల బృందం పని చేస్తోంది. (తెలంగాణలో 1892 కరోనా పాజిటివ్ కేసులు) అయితే ప్రైవేట్ ల్యాబ్‌లు కరోనా టెస్ట్‌లు చేయడం కోసం వచ్చిన వారి దగ్గర నుంచి 3-6వేల రూపాయలు వసూలు చేశాయి. రిపోర్టులు ఇచ్చిన తర్వాత రోగులను గాలికి వదిలేసారు. ఆ వివరాలను ప్రభుత్వానికి తెలపలేదు. దాంతో పాజిటివ్ పేషంట్లు సామాన్య జనాల్లో కలిసిపోయారు. ప్రైవేట్ ల్యాబ్‌ల దగ్గర బిల్ నంబర్లు ఉన్నాయి కానీ యూనిక్ ఐడీలు లేవన్నారు అధికారులు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం పడుతుండటంతో ప్రజలు ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. అధికారులు దీనిపై స్పందిస్తూ.. బాధ్యతారహితంగా ప్రవర్తించిన ప్రైవేట్ ల్యాబ్‌ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే సదరు ప్రైవేట్ ల్యాబ్‌లకు నోటీసులు పంపినట్లు వెల్లడించారు. కానీ ప్రస్తుతం ఈ పాజిటివ్ పేషంట్లను.. వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించడం తమ ముందున్న అతి పెద్ద సవాలంటున్నారు అధికారులు. (జ్వరమా.. నో అడ్మిషన్!) -
ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా టెస్ట్‌లకు విరామం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ల్యాబొరేటరీల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిలిచిపోయాయి. గురువారం నుంచి ఈ నెల 5 వరకు పరీక్షలు చేయకూడదని ప్రైవేటు ల్యాబ్‌ల యాజమాన్యాలు నిర్ణయించాయి. వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు రాష్ట్రంలో 18 ల్యాబ్‌లకు ఐసీఎంఆర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చాయి. దీంతో గతనెల మూడో వారం నుంచి ప్రైవేటు ల్యాబ్‌లు ఈ పరీక్షల్ని ముమ్మరంగా చేపట్టాయి. అయితే ప్రభుత్వం నిర్దేశించిన పరిమితి కంటే అధిక మొత్తంలో శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేయించింది. ఈ క్రమంలో ప్రైవేట్ ల్యాబ్‌లు నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తేలింది. అవగాహన, నైపుణ్యం లేని వారితో పరీక్షలు నిర్వహిస్తున్నారని, అందువల్లే తప్పుడు ఫలితాలు వస్తున్నట్లు తేల్చారు. దీంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆయా ల్యాబ్‌ల యాజమాన్యాలకు నోటీసులు జారీచేస్తూ, లోపాలు దిద్దుకోవాలని ఆదేశించింది. లోపాలు సరిదిద్దుకునేందుకే.. ప్రభుత్వ నోటీసులకు వివరణ ఎలా ఇవ్వాలనే దానిపై ప్రైవేట్ ల్యాబ్‌లు తర్జనభర్జన పడుతున్నాయి. లోపాలు దిద్దుకుని ఈ నెల 5 వరకు నివేదిక ఇవ్వాలని భావిస్తున్నాయి. ఐసీఎంఆర్ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నాలుగు రోజుల పాటు కొత్తగా పరీక్షలు చేయరాదని నిర్ణయించాయి. అయితే ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వచ్చే శాంపిల్స్‌ను మాత్రం పరిశీలిస్తున్నట్లు ల్యాబ్ యాజమాన్యాలు చెబుతున్నాయి. అలాగే, ఇప్పటివరకు ప్రైవేటు ల్యాబ్‌ల్లో చేసిన పరీక్షల ఫలితాలను ఐసీఎంఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. ఓ ప్రైవేటు ల్యాబ్ ఏకంగా 12వేల పరీక్షలు నిర్వహించినా.. ఫలితాలను అప్లోడ్ చేయకపోవడం గమనార్హం. కాగా, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మాత్రం ప్రైవేటు ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయొద్దని తామెలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టంచేసింది. -
ప్రైవేట్ ల్యాబ్‌లకు పోండి!
►అవసరం లేకున్నా బయటకు రాస్తున్నారని రోగుల ఆవేదన ►కమీషన్ల రూపంలో వైద్యులకు కవర్లు ►దోపిడీకి గురవుతున్న పేద రోగులు ►జిల్లా ఆస్పత్రిపై నిర్లక్ష్యపు నీడలు ►చాపాడు మండలం అల్లాడుపల్లెకు చెందిన రమణమ్మ గర్భిణీ. పరీక్షలు చేయించుకోవడానికి తల్లితో కలిసి జిల్లా ఆస్పత్రికి వచ్చారు. పరిశీలించిన వైద్యులు స్కానింగ్ కోసం ప్రైవేట్ ల్యాబ్‌కు వెళ్లమని సూచించారు. ఆస్పత్రిలో స్కానింగ్ మిషన్ ఉన్నా ఎందుకు బయటకి పంపిస్తున్నారంటూ రమణమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ►సంజీవనగర్‌కు చెందిన 16ఏళ్ల బాలుడికి కడుపునొప్పి రావడంతో వారంరోజుల క్రితం తల్లిదండ్రులు జిల్లా ఆస్పత్రికి వెళ్లారు. పరిశీలించిన వైద్యుడు అపెండిక్స్ ఉన్నట్టుందని, స్కానింగ్ చేయించుకొని రమ్మని బయటకు పంపారు. దీంతో బాలుడికి గాంధీరోడ్డులోని సెంటర్లో స్కానింగ్ చేయించగా అపెండిక్స్ లేదని నిర్ధారణ అయింది. ►ఇటీవల ఈశ్వరరెడ్డినగర్కు చెందిన నాగరాజు మూత్రం సరిగా రాలేదని జిల్లా ఆస్పత్రికి వచ్చాడు. పరిశీలించిన వైద్యుడు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, బయట స్కానింగ్ చేసుకొని రమ్మని పంపించాడు. అయితే స్కానింగ్ తీస్తే రిపోర్టులో రాళ్లు లేవని తేలింది. వేడి వల్ల అలా జరిగిందని రేడియాలజిస్టు తెలిపాడు. ఇలాంటి సంఘటనలు తరచూ జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంటున్నాయి. ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు ధర్మాసుపత్రిలో కమీషన్లు, మామూళ్లు పనులను చక్కబెడుతున్నాయి. ఇక్కడికి వచ్చే గర్భిణీ కేసులు గంట తిరిగే సరికే ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉంటున్నాయి. సాధారణ జబ్బులకు అవసరం లేకున్నా కొందరు వైద్యులు స్కానింగ్, ఇతర పరీక్షల కోసం రోగులను బయటికి పంపిస్తున్నారు. ఆస్పత్రిలో తరచూ మందుల కొరత ఉండటంతో రోగులు ప్రైవేట్ మెడికల్ షాపులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆస్పత్రిలో కాన్పుకు రావాలంటే పేదలు భయపడే పరిస్థితి ఉంది. సుఖ ప్రసవానికి ఒక రేటు, సీజేరియన్ జరిగితే మరొక రేటు పెట్టుకొని కొందరు సిబ్బంది ఆస్పత్రిలో దోపిడీకి పాల్పడుతున్నారు. అవసరం లేకున్నా స్కానింగ్ పరీక్షలు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రక్త పరీక్షలతో పాటు సీటి స్కానింగ్ పరీక్షలు చేస్తారు. వైద్యులు సూచించిన కొన్ని ముఖ్యమైన వ్యాధులకు మాత్రమే స్కానింగ్ నిర్వహిస్తారు. ప్రతినెల 9వ తేదీన, అత్యవసరమైన సమయంలో గర్భిణులకు స్కానింగ్ చేస్తుంటారు. మిగతా సమయాల్లో గర్భిణీలను స్కానింగ్ పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. దీంతో పెద్దమొత్తంలో ఖర్చు అవుతోందని పేదలు వాపోతున్నారు. ఇంకా సర్జికల్ ఆపరేషన్లకు సంబంధించిన కొన్ని కేసుల్లో వైద్యులు ఎక్కువగా బయటి ల్యాబ్‌లకే బాధితులను పంపిస్తున్నట్లు ప్రజ లు చెబుతున్నారు. నెలనెలా జిల్లా ఆస్పత్రికి కవర్లు జిల్లా ఆస్పత్రిలోని ప్రతి వైద్యుడి టేబుల్ మీద ప్రైవేట్ ల్యాబ్‌లు, స్కానిం గ్ సెంటర్ల ప్రిస్కిప్షన్ ప్యాడ్లు ఉన్నాయి. వాటిపైనే రాసి వైద్యులు బయటికి పంపిస్తున్నారు. ఒక్కో స్కానింగ్‌పై 40శాతం వరకు కమీషన్ ఇస్తున్నట్లు స్కానింగ్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మొత్తాన్ని ప్రతి నెలా 4, 5 తేదీల్లో కవర్లలో పెట్టి వైద్యులకు అందజేస్తున్నారనే ప్రచారం ఉంది. దీంతో జిల్లా ఆస్పత్రి నుంచి ప్రైవేట్ సీటిస్కాన్, రక్త పరీక్షలను కూడా అవసరం లేకున్నా కొందరు వైద్యులు రాస్తున్నట్లు సమాచారం. -
సర్కారు ఆసుపత్రులకు సుస్తీ
సాక్షి, గుంటూరు : సర్కారు దవాఖానాలంటే జనం హడలెత్తిపోతున్నారు. వేళకు రాని వైద్యులు... నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బంది... అందుబాటులో లేని మందులు.. అరకొర సౌకర్యాలు వెరశి ప్రభుత్వ ఆస్పత్రులంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థికంగా స్థితిమంతులైతే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇక నిరుపేద ప్రజానీకానికి మాత్రం ఎన్ని కష్టాలైనా ప్రభుత్వ ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలబారినపడి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే క్షతగాత్రులకు కనీస వైద్య సేవలూ అందడంలేదు. ఎక్స్‌రే, రక్తపరీక్షల వంటివాటికోసం కూడా ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లాల్సి వస్తోంది. నరసరావుపేట, పల్నాడు, వినుకొండ వంటి ప్రాంతాల్లో రక్తమోడుతూ ఆసుపత్రులకు వస్తే గాయాలను శుభ్రం చేసి తెల్లగుడ్డతో చుట్టి గుంటూరు వంటి పెద్ద ఆసుపత్రులకు పంపించేసి చేతులు దులుపుకుంటున్నారు. అత్యవసర వైద్యం అందక మార్గమద్యంలోనే కొందరు తనువు చాలిస్తున్నారు. చాలినంతమంది సిబ్బంది లేక... జిల్లాలో 77 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 16 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా ఆసుపత్రులు, జిల్లా కేంద్రమైన గుంటూరులో సమగ్ర వైద్యశాల ఉన్నాయి. వీటిలో 60 ఏళ్ళ క్రితం మంజూరైన పోస్టులనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ రోగులు మాత్రం పది రెట్లు పెరిగారు. అందుకు అనుగుణంగా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో వైద్య సేవలందించడం కష్టతరంగా మారింది. పస్తుతం ఉన్న పోస్టులే చాలా వరకు ఖాళీగా ఉండటంతో కొత్త పోస్టులను పెంచే యోచనలో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు లేరని చెబుతున్నారు. కోస్తాంధ్రలోనే అతిపెద్ద పేదల ఆసుపత్రిగా పేరొందిన జీజీహెచ్‌లో సైతం వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండటంతో ఈ ఆసుపత్రికి అధిక సంఖ్యలో వచ్చే రోగులకు అరకొర వైద్య సేవలు మాత్రమే అందించగలుగుతున్నారు. ఈ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది, వైద్య పరికరాలు లేవనే కారణంతో దీని పరిథిలోని వైద్య కళాశాలకు ఈ ఏడాది 50 ఎంబీబీఎస్ సీట్లకు భారత వైద్య మండలి గుర్తింపు ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ కళాశాలలో 66 ప్రొఫెసర్ పోస్టులకు 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 46 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఐదు పోస్టులు, 195 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 61 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు 50 వరకు పారామెడికల్ సిబ్బంది పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమౌతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కార్యాలయ పరిథిలో పనిచేసే జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో వివిధ కేటగిరీలకు చెందిన 150 పోస్టులు ఖాళీగా ఉండటంతో వైద్య సేవలందించడంలో విఫలమౌతున్నారు. 24 గంటలూ పనిచేసే వైద్యశాలల్లో సైతం జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో విద్యుత్కోతవేళల్లో బాలింతలు, గర్భిణీలు, పసికందులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఎమర్జెన్సీ మందులూ కరువే.. జిల్లాలోని అనేక ప్రభుత్వ వైద్యశాలల్లో మందుల కొరత పీడిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అత్యవసర మందులు, ఇన్సులిన్లు దొరక్క ఇక్కట్లపాలౌతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కుక్కకాటుకు, పాముకాటు ఇంజక్షన్లు లేకపోవడంతో సుదూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఒక్కోసారి పరిస్థితి విషమించి ప్రాణాలకు సైతం ప్రమాదం ఏర్పడుతోంది. ఇప్పటికైనా వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది పోస్టులు భర్తీచేసి, సరైన సౌకర్యాలు కల్పించి, అత్యవసర మందులను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పేరుకే.. పెద్దాసుపత్రా..?
పేరుగొప్ప .. ఊరుదిబ్బ అన్న చందంగా తయారైంది జిల్లా కేంద్ర ఆస్పత్రి తీరు. ఈ ఆస్పత్రికి నిత్యం జిల్లా నలుమూలల నుంచి వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు.కానీ వారికి మెరుగైన సేవలు అందడం లేదని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అన్ని సౌకర్యాలు ఉన్నా చిన్న చిన్న పరీక్షలు కూడా నిర్వహించడం లేదని రోగులు వాపోతున్నారు. - న్యూస్‌లైన్, నల్లగొండ టౌన్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రోగులకు అవసరమైన రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించడానికి ప్రయోగశాల ఉంది. కానీ ఇ క్కడ చిన్న చిన్న పరీక్షలు కూడా నిర్వహిం చకుండా ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏ పరీక్షకైనా ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపి తమ జేబు ను గుల్లా చేస్తున్నారని రోగులు వాపోతున్నారు. ఆరోగ్యశ్రీ కేసులతో పాటు ఇతర కేసులకు కూడా ప్రైవేటు ల్యాబ్‌లలో పరీ క్షలు చేయించుకోవాలని పంపించడం బా ధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్త గ్రూపును కనుగొనే పరీక్షలకు కూడా ప్రైవేటుకు పంపిస్తున్నారంటే ప్ర యోగశాల దుస్థితి అర్థమవుతోంది. రసాయనాలు లేకపోవడమేనా..? ఆస్పత్రి ప్రయోగశాలలో ఇద్దరు డాక్టర్లు, నలుగురు చొప్పున ల్యాబ్ టెక్నీషియన్లు, అటెండంర్లు పనిచేస్తున్నారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించే టెక్నీషియన్లు పని చేస్తున్నా అవసరమైన రసాయనాలు లేకపోవడంతోనే వివిధ పరీక్షలకు ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపిస్తున్పట్లు సమాచారం. -
అబ్బే.. అంతా బాగే
సాక్షి ప్రతినిధి, ఏలూరు :కిడ్నీ రోగుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్న ప్రభుత్వాసుపత్రిలోని బిబ్రాన్ ఆరోగ్యశ్రీ డయాలసిస్ యూనిట్‌కు అధికారులు క్లీన్చిట్ ఇచ్చేశారు. తూతూమంత్రంగా తనిఖీలు చేసి అంతా బాగానే ఉందని, ఇకపై పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసి మరీ వెళ్లారు. జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని ఆరోగ్యశ్రీ డయూలసిస్ యూనిట్ నిర్వాహకులు ప్రైవేటు ల్యాబ్‌తో కుమ్మక్కై రక్త పరీక్షలు చేయకుండానే చేసినట్లు రిపోర్టులు ఇస్తున్న వైనాన్ని ‘అవినీతి జబ్బు’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. దీంతో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ జిల్లా కో-ఆర్డినేటర్ ప్రభాకరరావు, వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రుల జిల్లా కో-ఆర్డినేటర్ శంకర్రావు మంగళవారం ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో బిబ్రాన్ కంపెనీ నిర్వహిస్తున్న డయాలసిస్ యూనిట్లో తనిఖీ నిర్వహిం చారు. రోగులను పరీక్షించి, వారి రక్తపరీక్షల రిపోర్టులను పరిశీలించారు. పరీక్షలు చేయకుండానే రిపోర్టులు తెప్పిస్తున్నారని బయటపడితే మళ్లీ అవే రిపోర్టులను పరిశీ లించి క్లీన్చిట్ ఇవ్వడం విశేషం. రక్త పరీక్షలు నిర్వహించేందుకు డయాలసిస్ యూనిట్‌తో ఒప్పందం చేసుకున్న జెడ్ ల్యాబ్ యాజమాన్యాన్ని పిలిపించి వారి రికార్డులను కూడా పరి శీలించారు. యూనిట్లో ఉన్న రిపోర్టులు, ల్యాబ్‌లో ఉన్న రికార్డులను సరిపోల్చి అంతా బాగానే ఉందని కితాబిచ్చారు. ఆ రిపోర్టులకు సంబంధించి పరీక్షలే జరగడం లేదనే విషయాన్ని అధికారులు మరచిపోవడం గమనార్హం. అదికాకుండా బిబ్రాన్ కంపెనీ, జెడ్ ల్యాబ్‌తో లోపాయకారిగా ఎటువంటి సంప్రదింపులు జరపలేదని తేల్చేశారు. జెడ్ ల్యాబ్ కంటే ముందు వేరే ల్యాబ్‌తో ఉన్న ఒప్పం దాన్ని ఎందుకు రద్దు చేసుకున్నారనే విషయంపైనా సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ఆ ల్యాబ్ పరీక్షలు సరిగా చేయకపోవడం వల్లనే వారితో ఒప్పందం రద్దు చేసుకున్నారని ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ సమర్థిస్తుండటం గమనార్హం. కేస్ షీట్లతో జత చేయలేదేం హెచ్‌సీవీ, హెచ్ఐవీ రక్త పరీక్షలు జరిపి.. సంబంధిత కిట్లను రోగి కేస్షీట్కు జత చేయాల్సి వుంది. కిట్లను జతచేసి ఉంటే వాటి రిపోర్టులు, మళ్లీ అదే రోగికి రక్త పరీక్షలు జరిపితే వచ్చే రిపోర్టులను పోల్చి చూస్తే కొంతైనా వాస్తవం తెలిసే అవకాశం ఉండేది. కానీ చాలా కేస్ షీట్లు, రిపోర్టులకు ఆ కిట్లు జతచేసి ఉంచడం లేదు. దీంతో అసలు పరీక్షలు చేశారనే గ్యారంటీయే లేకుండాపోతోంది. అలాంటప్పుడు ఆ రిపోర్టులను పరిశీలించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హెచ్‌సీవీ పాజిటివ్ ఎందుకొస్తోంది అధికారులు తనిఖీ చేసే సమయంలో డయాలసిస్ యూనిట్లో ఆరుగురు రోగులుండగా, అందులో నలుగురికి హెచ్‌సీవీ పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. నిజానికి హెపటైటిస్ సీ వైరస్ ఆస్పత్రిలో వాడే పరికరాలు సరిగా లేకపోవడం వల్లే రోగులకు వస్తుంది. యూనిట్లో అంతా సవ్యంగా చేస్తే రెగ్యులర్‌గా డయాలసిస్ చేసే రోగులకు ఈ వైరస్ సోకే అవకాశం ఉండదు. కానీ ఈ యూనిట్లో డయాలసిస్ చేయించుకున్న రోగుల్లో 60 శాతం మందికి ఈ వైరస్ సోకుతోంది. లివర్‌కు సంబంధించి ఈ వైరస్ సోకిందని తెలియగానే వారు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి.. ఆస్తులను అమ్ముకుని లక్షలు పెట్టి చికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. ఈ వైరస్ కేసులు డయాలసిస్ యూనిట్లో ఎక్కువగా ఉండటాన్ని బట్టే అక్కడ ఏదో తేడా జరుగుతుందనే విషయాన్ని అధికారులు గుర్తించాల్సివుంది. అప్పటికప్పుడు ప్రత్యక్షమైన వైద్యులు అధికారులు యూనిట్లో తనిఖీలు చేస్తున్నప్పుడు ఎప్పడూ అక్కడకు రాని వైద్యులు అప్పటికప్పుడు వచ్చి వాలిపోవడం గమనార్హం. ఈ డయాలసిస్ యూనిట్లో నిరంతరం ఒక డ్యూటీ వైద్యుడు, ఒక నెఫ్రాలజీ వైద్యుడు ఉండాలి. యూనిట్ నిర్వాహకులు విజయవాడకు చెందిన నెఫ్రాలజీ వైద్యుడు సత్యవంశీని నియమించారు. ఆయన వారానికి ఒకటి, రెండుసార్లు మాత్రమే అది కూడా ఉదయం పదిగంటల లోపు వచ్చి వెళ్లిపోతున్నట్లు సమాచారం. డ్యూటీ డాక్టర్ అని పేరేగానీ ఎప్పుడూ డ్యూటీలో డాక్టర్ ఉండరని చెబుతున్నారు. టెక్నీషియన్లే అంతా తామై తంతు నడిపించేస్తున్నారు. దీనివల్ల వల్ల కూడా రోగులు ఇబ్బందుల పాలవుతున్నారు. సీరియస్ కేసులు వచ్చినప్పుడు కూడా నెఫ్రాలజీ వైద్యు డు, డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది. అయితే విచారణాధికారులు అంతా సవ్యంగా ఉందని కితాబివ్వడం అనుమానాలకు తావిస్తోంది.