సాక్షి, గుంటూరు : సర్కారు దవాఖానాలంటే జనం హడలెత్తిపోతున్నారు. వేళకు రాని వైద్యులు... నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బంది... అందుబాటులో లేని మందులు.. అరకొర సౌకర్యాలు వెరశి ప్రభుత్వ ఆస్పత్రులంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థికంగా స్థితిమంతులైతే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇక నిరుపేద ప్రజానీకానికి మాత్రం ఎన్ని కష్టాలైనా ప్రభుత్వ ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలబారినపడి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే క్షతగాత్రులకు కనీస వైద్య సేవలూ అందడంలేదు. ఎక్స్‌రే, రక్తపరీక్షల వంటివాటికోసం కూడా ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లాల్సి వస్తోంది. నరసరావుపేట, పల్నాడు, వినుకొండ వంటి ప్రాంతాల్లో రక్తమోడుతూ ఆసుపత్రులకు వస్తే గాయాలను శుభ్రం చేసి తెల్లగుడ్డతో చుట్టి గుంటూరు వంటి పెద్ద ఆసుపత్రులకు పంపించేసి చేతులు దులుపుకుంటున్నారు. అత్యవసర వైద్యం అందక మార్గమద్యంలోనే కొందరు తనువు చాలిస్తున్నారు.
చాలినంతమంది సిబ్బంది లేక... జిల్లాలో 77 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 16 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా ఆసుపత్రులు, జిల్లా కేంద్రమైన గుంటూరులో సమగ్ర వైద్యశాల ఉన్నాయి. వీటిలో 60 ఏళ్ళ క్రితం మంజూరైన పోస్టులనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ రోగులు మాత్రం పది రెట్లు పెరిగారు. అందుకు అనుగుణంగా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో వైద్య సేవలందించడం కష్టతరంగా మారింది.
పస్తుతం ఉన్న పోస్టులే చాలా వరకు ఖాళీగా ఉండటంతో కొత్త పోస్టులను పెంచే యోచనలో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు లేరని చెబుతున్నారు. కోస్తాంధ్రలోనే అతిపెద్ద పేదల ఆసుపత్రిగా పేరొందిన జీజీహెచ్‌లో సైతం వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండటంతో ఈ ఆసుపత్రికి అధిక సంఖ్యలో వచ్చే రోగులకు అరకొర వైద్య సేవలు మాత్రమే అందించగలుగుతున్నారు. ఈ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది, వైద్య పరికరాలు లేవనే కారణంతో దీని పరిథిలోని వైద్య కళాశాలకు ఈ ఏడాది 50 ఎంబీబీఎస్ సీట్లకు భారత వైద్య మండలి గుర్తింపు ఇచ్చేందుకు నిరాకరించారు.
ఈ కళాశాలలో 66 ప్రొఫెసర్ పోస్టులకు 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 46 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఐదు పోస్టులు, 195 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 61 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు 50 వరకు పారామెడికల్ సిబ్బంది పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమౌతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కార్యాలయ పరిథిలో పనిచేసే జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో వివిధ కేటగిరీలకు చెందిన 150 పోస్టులు ఖాళీగా ఉండటంతో వైద్య సేవలందించడంలో విఫలమౌతున్నారు. 24 గంటలూ పనిచేసే వైద్యశాలల్లో సైతం జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో విద్యుత్‌కోతవేళల్లో బాలింతలు, గర్భిణీలు, పసికందులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
ఎమర్జెన్సీ మందులూ కరువే.. జిల్లాలోని అనేక ప్రభుత్వ వైద్యశాలల్లో మందుల కొరత పీడిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అత్యవసర మందులు, ఇన్సులిన్‌లు దొరక్క ఇక్కట్లపాలౌతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కుక్కకాటుకు, పాముకాటు ఇంజక్షన్లు లేకపోవడంతో సుదూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఒక్కోసారి పరిస్థితి విషమించి ప్రాణాలకు సైతం ప్రమాదం ఏర్పడుతోంది. ఇప్పటికైనా వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది పోస్టులు భర్తీచేసి, సరైన సౌకర్యాలు కల్పించి, అత్యవసర మందులను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సర్కారు ఆసుపత్రులకు సుస్తీ
Published Thu, Jun 5 2014 11:57 PM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement
Advertisement