తాగితే నిప్పు.. ప్రాణానికే ముప్పు   | Doctors Warn That Drinking Sanitizer Is Dangerous | Sakshi
Sakshi News home page

తాగితే నిప్పు.. ప్రాణానికే ముప్పు  

Published Sun, Aug 2 2020 6:29 AM | Last Updated on Sun, Aug 2 2020 8:39 AM

Doctors Warn That Drinking Sanitizer Is Dangerous - Sakshi

మద్యానికి బానిసలైన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం, వేల్పూరు గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు మార్చి 30న శానిటైజర్‌లో ఉప యోగించే ఐసోప్రోపిల్‌ ఆల్కహాల్‌ను కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగారు.ఈ ఘటనలో యువకులు మృత్యువాత పడ్డారు. 

ప్రకాశం జిల్లా, కురిచేడు మండల కేంద్రంలో శానిటైజర్‌ తాగి ఆరోగ్యం విషమించి గురు, శుక్రవారాల్లో 13 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో గుంటూరుకు చెందిన మాతంగి పెదసుబ్బారావు కూడా ఉన్నాడు. ఇతను కురిచేడులో ఓ ఫంక్షన్‌కు హాజరై అక్కడి వ్యక్తులతో కలసి శానిటైజర్‌ తాగాడు. శనివారం మరో ఇద్దరు    మృతి చెందారు. 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సాక్షి, గుంటూరు: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో మద్యం షాపులు మూతపడ్డాయి. దీంతో మద్యం లభించక తాగుడుకు బానిసలైన కొందరు ప్రత్యామ్నాయ మార్గాల్లో కిక్‌ను వెతుక్కుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జిల్లాలో 239 ప్రభుత్వ మద్యం దుకాణాలున్నాయి. వీటిలో ప్రస్తుతం 116 దుకాణాల్లో మాత్రమే విక్రయాలు నడుస్తున్నాయి. మిగిలినవి కంటైన్మెంట్‌ జోన్లలో ఉండటంతో మూతపడ్డాయి. గుంటూరు నగరం, నరసరావుపేట, బాపట్ల, తెనాలి, పొన్నూరు, మాచర్ల పట్టణాలు సహా జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు నెలలకు పైగా మద్యం షాపులు తెరుచుకోలేదు. 

ప్రత్యామ్నాయం వైపు మందుబాబుల చూపు..  
మూడు, నాలుగు నెలలకు పైగా మద్యం షాపులు మూతపడటం, దీనికి తోడు పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీలు, పేదలు శానిటైజర్లు, స్పిరిట్, నాటుసారా తాగడం, నిద్ర మాత్రలు వేసుకోవడం, గంజాయి పీల్చడం వంటి మార్గాల్లో కిక్‌ పొందుతున్నారు. బీర్‌లో తొమ్మిది శాతం, మద్యంలో సుమారు 24.3 శాతం ఆల్కహాల్‌ ఉంటుంది. అయితే, శానిటైజర్‌లో కంపెనీని బట్టి 80–90శాతం వరకూ ఉంటుంది. ఆల్కహాల్‌ శాతం అధికంగా ఉన్న శానిటైజర్‌ను మద్యానికి బానిసలైన కొందరు నీళ్లు, కూల్‌ డ్రింక్స్‌లోకి పోసుకుని తాగుతున్నారు. ఇది ఎంతో ప్రమాదకరమని, ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ కిక్‌ కోసం ఈ మార్గాన్నే కొందరు ఎంచుకుంటున్నారు.

స్టువర్టుపురం, వెల్దుర్తి, బొల్లాపల్లి, దిండి, నిజాంపట్నం సహా మరికొన్ని ప్రాంతాల్లో నాటు సారా వినియోగం అధికంగా ఉంటోంది. దిండి పరిసర ప్రాంతాల్లో తయారవుతున్న నాటు సారా భట్టిప్రోలు, పొన్నూరు, బాపట్ల, రేపల్లె ఇలా డెల్టా ప్రాంతాల్లో సరఫరా అవుతోంది. గుంటూరు నగరంలో అయితే కొందరు మద్యం దొరక్క నిద్రమాత్రలు వేసుకుంటూ కిక్‌ పొందుతున్నారు. మందుబాబులు కిక్‌ కోసం వెతుక్కుంటున్న ప్రత్యామ్నాయ మార్గాలన్నీ ప్రాణాల మీదకి తెచ్చేవేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రకాశం జిల్లా, కురిచేడు ఘటనను గుణపాఠంగా తీసుకుని ఇప్పటికైనా మందుబాబులు మత్తు కోసం అడ్డదార్లు తొక్కవద్దని సూచిస్తున్నారు.  

మానడానికి ఇదే అవకాశం 
ఓ వైపు కరోనా ఆంక్షలు, మద్యం షాపులు మూతపడటం అంశాలు మద్యం మానడానికి ఇదే సరైన అవకాశం అని మానసిక నిపుణులు చెబుతున్నారు.తాగుడును ఒకేసారి మానడం కష్టం. మద్యానికి ప్రత్యామ్నాయంగా ప్రమాదకరమైన శానిటైజర్, నాటుసారా వంటివి తాగకుండా జ్యూస్‌లు, కూల్‌ డ్రింక్‌లు తాగడం, ఖాళీగా ఉండకుండా ఏదోక పనిలో నిమగ్నం అవ్వడం, మద్యం నుంచి ఇతర అంశాలపై దృష్టి సారించడం చేయాలని సూచిస్తున్నారు.

మార్పు తేవచ్చు
మద్యానికి బానిసలైన వారిని డీ అడిక్షన్‌ సెంటర్‌లో చేర్చి చికిత్స అందించడం ద్వారా మార్పు రాబట్టవచ్చు. మద్యం, మత్తు పదార్థాలకు బానిసలైన వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు, ఉచితంగా మందులు అందిస్తాం. కుటుంబ సభ్యులు వారితో ఎలా మెలగాలి అనేదానిపై కౌన్సెలింగ్‌ ఇస్తాం. తల్లిదండ్రులు పిల్లల్ని ఓ కంట కనిపెట్టాలి. ప్రస్తుతం యువతే ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసవుతోంది.  
– పబ్బతి లోకేశ్వరరెడ్డి, డీ అడిక్షన్‌ సెంటర్‌ నోడల్‌ ఆఫీసర్, గుంటూరు జీజీహెచ్‌ 

స్వచ్ఛమైన ఇథైల్‌ ఆల్కహాల్‌ తాగితే చనిపోతారు  
మద్యానికి అలవాటు పడిన వారిలో కొంతమంది శానిటైజర్, స్పిరిట్‌ తాగి చనిపోతున్నారు. సాధారణంగా తాగే మద్యంలో ఇథైల్‌ ఆల్కహాల్‌ 40 శాతం వరకూ మాత్రమే ఉంటుంది. కాని శానిటైజర్, స్పిరిట్‌లో 100శాతం ఇథైల్‌ ఆల్కహాల్‌ ఉంటుంది. అంతేకాకుండా వాటి స్వచ్ఛత కోసం ఇథైల్‌ ఆల్కహాల్‌తో పాటుగా గ్లిజరిన్, ఐసోప్రొఫెల్‌ ఆల్కహాల్‌ ఇతర రసాయనాలను కలుపుతారు. స్పిరిట్, శానిటైజర్లు శరీరంపైన బ్యాక్టీరియాలను నిర్మూలించేందుకు మాత్రమే వినియోగించాలి. వాటిని తాగటం వల్ల రక్తాన్ని శుద్ధి చేసే వ్యవస్థ దెబ్బతినిపోతుంది. రక్తంలో ఆక్సిజన్‌ను పూర్తిగా నిర్వీరం చేస్తుంది. దీంతో రెస్పిరేటరీ సిస్టం దెబ్బతిని ఊపిరి తిత్తులు పాడై ఊపిరి తీసుకోలేక మనిషి చనిపోతాడు. కొన్ని సందర్భాల్లో  కళ్లు పోతాయి. 
–డాక్టర్‌ తిరుమలశెట్టి వెంకట ఆదిశేషుబాబు, జనరల్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్, గుంటూరు జీజీహెచ్‌   

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement