జనరల్ సర్జరీ వైద్యులతో ఆపరేషన్ చేయించుకున్న వెంకటేశ్వర్లు
గుంటూరు మెడికల్: అరుదైన వ్యాధితో బాధపడుతోన్న వృద్ధుడికి గుంటూరు జీజీహెచ్ జనరల్ సర్జరీ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ జరుగుతుండగా రోగి గుండె ఆగిపోగా.. అప్రమత్తమైన జనరల్ సర్జన్ నేరుగా కడుపులో నుంచి చేతిని గుండెపైకి పంపించి గుండెకు మసాజ్ చేసి ఆగిన గుండెను కొట్టుకునేలా చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడారు.
బుధవారం గుంటూరు జీజీహెచ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆపరేషన్ వివరాలను జనరల్ సర్జరీ రెండో యూనిట్ ఇన్‌చార్జి డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ మీడియాకు చెప్పారు. ప్రకాశం జిల్లా నందనవనం గ్రామానికి చెందిన విట్టా వెంకటేశ్వర్లు (70) నెల రోజులుగా కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, వాంతులు, ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడటం తదితర సమస్యలతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని జనవరి 17న గుంటూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారు.
జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో వృద్ధుడికి అత్యవసర సేవల విభాగంలో పరీక్షలు చేసి (గ్యాస్టిక్ అవుట్‌లెట్ అబ్‌స్ట్రక్షన్) చేసి కడుపులో క్యాన్సర్ వల్ల ఆహారం పొట్టలోకి వెళ్లడం లేదని నిర్ధారించి వార్డులో అడ్మిట్ చేసుకున్నారు. జనరల్ సర్జరీ వార్డులో మెరుగైన చికిత్స అందించేందుకు సీటీ స్కాన్, బేరియం ఎక్స్‌రే, గ్యాస్ట్రోస్కోపి, ఎండోస్కోపి చేశారు. స్కానింగ్‌లో గుండె చాలా బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు.
దాంతోపాటుగా లక్షల్లో ఒకరికి మాత్రమే సంభవించే అత్యంత అరుదైన డయాఫ్రాగ్‌మెటిక్ హెరి్నయాతో రోగి బాధపడుతున్నట్లు గుర్తించారు. గుండె, ఊపిరితిత్తులు, కడుపుకి మధ్యలో ఉండే డయాఫ్రమ్‌కు రంధ్రం ఏర్పడి అందులో నుంచి కడుపు, పెద్దపేగు సగభాగం గుండెకు, ఊపిరితిత్తులకు అతుక్కున్నట్లు నిర్ధారించారు. సాధారణంగా పుట్టుకతో డయాఫ్రమ్‌కు రంధ్రాలు ఏర్పడి వయసు పెరిగే కొద్ది పూడుకుపోతుందని కిరణ్‌కుమార్ చెప్పారు. వెంకటేశ్వర్లు విషయంలో డయాఫ్రమ్‌కు ఉన్న రంధ్రం పూడుకుపోకుండా పేగులు, కడుపు, గుండె, ఊపిరితిత్తుల మధ్యకు వెళ్లిపోయిందని తెలిపారు.
ఆగిన గుండె..
గుండె, ఊపిరితిత్తుల మధ్య అతుక్కుని ఉన్న పేగులు, కడుపును కిందకు తీసేందుకు ఫిబ్రవరి 2న ఆపరేషన్ ప్రారంభించామని, ఆపరేషన్ చేస్తోన్న సమయంలో వృద్ధుడి గుండె ఆగిపోయిందన్నారు. మత్తు వైద్యులు ఛాతిపై నుంచి మసాజ్ చేసే (సీపీఆర్) ప్రయత్నం చేస్తామని, ఆపరేషన్ ఆపాలని సూచించినట్లు చెప్పారు. తక్షణమే తాను డయాఫ్రమ్‌కి ఉన్న రంధ్రం ద్వారా చేతిని గుండెపైకి పోనిచ్చి నేరుగా చేతితో ఆగిపోయిన గుండెను నొక్కి కార్డియాక్ మసాజ్ చేయడంతో కొద్ది క్షణాల్లో ఆగిన గుండె కొట్టుకోవడం ప్రారంభించిందన్నారు.
3 గంటల సేపు ఆపరేషన్ చేసి ఛాతి, గుండెలోకి వెళ్లిన పెద్ద పేగు, కడుపును కిందకు లాగి మరలా సమస్య ఉత్పన్నం కాకుండా ప్రొలేన్ మెష్ అమర్చి డయాఫ్రమ్‌ను మూసివేశామన్నారు. 48 గంటల పాటు ఐసీయూలో రోగిని ఉంచి గుండె, ఊపిరితిత్తులు, మెదడు పనితీరు బాగున్నాయని నిర్ధారించుకున్న తరువాత వెంటిలేటర్ తొలగించి సాధారణ వార్డుకు తరలించినట్లు చెప్పారు. వృద్ధుడు కోలుకోవడంతో బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు తెలిపారు.
చదవండి: భారీగా తగ్గిన చికెన్ ధరలు కిలో ఎంతంటే?
ప్రైవేట్ ఆసుపత్రుల్లో దీని చికిత్సకు రూ.10 లక్షలు ఖర్చవుతుందని, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేశామని తెలిపారు. జీజీహెచ్‌కు సీఎం వైఎస్ జగన్ అత్యాధునిక వైద్య పరికరాలు అందజేయడంతో జనరల్ సర్జరీ వైద్య విభాగంలో కార్పొరేట్ ఆసుపత్రి కంటే మెరుగైన ఆపరేషన్‌లను తాము పేదలకు ఉచితంగా చేస్తున్నామన్నారు. ఆపరేషన్‌లో తనతోపాటు వైద్యులు రమణాచలం, వంశీ, వెంకటరమణ, సంతోష్, నిఖిల్, అనూష, లిఖిత, కిషోర్, వేణు, కోటి, మత్తు వైద్యులు మహే‹Ùబాబు, ప్రదీప్, ధరణి, శ్వేత పాల్గొన్నట్లు వెల్లడించారు. జనరల్ సర్జరీ వైద్య బృందాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment