రేపల్లెలో విదేశాల నుంచి వచ్చిన వారికి సూచనలు, సలహాలు అందిస్తున్న డాక్టర్ కిరణ్, వైద్య బృందం
రేపల్లె: విదేశాల నుంచి ఇటీవల పట్టణానికి వచ్చిన సుమారు 10 మందిపై ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా హెచ్చరికలు చేయటంతో పాటు నిరంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు వచ్చేందుకు ప్రధాన మార్గంగా ఉన్న పెనుమూడి–పులిగడ్డ వారధిని పోలీసులు మూసివేశారు.రహదారికి బారికేట్లు ఏర్పాటు చేసి ఎవరిని అనుమతించటం లేదు. తహసీల్దార్ విజయశ్రీ, మున్సిపల్ కమిషనర్ బి.విజయసారధి, ఎంపీడీవో సువార్త, పట్టణ సీఐ ఎస్.సాంబశివరావు, పట్టణ ఎసై చరణ్‌లు నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
తలుపులు వేసి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు
కావూరు(చెరుకుపల్లి): ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి కార్యకాలాపాలను నిర్వహిస్తున్న కంపెనీని పోలీసులు మూసివేయించారు. కరోనా వైరస్ నేపథ్యంలో యావత్ భారతదేశంలోని అన్ని కంపెనీలు, వ్యాపార సంస్థలు మూసివేసి నిబంధనలను పాటిస్తుంటే మండలంలోని కావూరు గ్రామంలోని ఒక కంపెనీ వారు మాత్రం పాటించకుండా మంగళవారం కూడా కొనసాగించారు. బయట తలుపులను వేసి ఉద్యోగులచే విధులు నిర్వహిస్తుండగా పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కంపెనీ నిర్వాహకులతో మాట్లాడి ఉద్యోగులందర్ని పంపించేశారు.
కరోనా దెబ్బకు స్తంభించిన జనజీవనం
వినుకొండ(నూజెండ్ల): కరోన ఎఫెక్ట్‌తో వినుకొండ ప్రజలు మంగళవారం కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం ఉదయం 9గంటల వరకు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించడంతో ఉదయాన్నే కూరగాయల మార్కెట్, శివయ్యస్థూపం సెంటర్, ఇతర ప్రాంతాల్లో జనం రద్దీగా కనిపించారు. 9గంటల తరువాత పోలీసులు షాపులను మూసివేయించి ప్రజలను అనుమతించకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్, శివయ్యస్థూపం సెంటర్, మెయిన్‌బజారు, ముండ్లమూరు బస్టాండ్, ఏనుగుపాలెం రోడ్డులను పూర్తిగా బంద్ చేశారు.
కరోనాపై హైఅలర్ట్
రొంపిచర్ల: మండలంలోని అన్ని గ్రామాల్లొ పోలీస్ శాఖ కరోనాపై హైఅలర్ట్ ప్రకటించింది. గ్రామాల్లో హైఅలర్ట్ స్టిక్కర్‌లను అంటించారు. కరోనా వైరస్ అతి ప్రమాదకరమైనదిగా భావించాలన్నారు. వైరస్ నివారణకు మందులు కాని, టీకాలు కాని లేవని స్వీయ పర్యవేక్షణ ఒక్కటే మార్గమని ఎస్‌ఐ ఎస్. వెంకట్రావు లౌడ్ స్పీకర్ ద్వారా మండల ప్రజలకు తెలియజేశారు. ఈ మేరకు పొలాలకు వెళుతున్న రైతులు, రైతు కూలీలకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇళ్లకు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment