అబ్బే.. అంతా బాగే
Published Wed, Dec 4 2013 4:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
సాక్షి ప్రతినిధి, ఏలూరు :కిడ్నీ రోగుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్న ప్రభుత్వాసుపత్రిలోని బిబ్రాన్ ఆరోగ్యశ్రీ డయాలసిస్ యూనిట్‌కు అధికారులు క్లీన్‌చిట్ ఇచ్చేశారు. తూతూమంత్రంగా తనిఖీలు చేసి అంతా బాగానే ఉందని, ఇకపై పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసి మరీ వెళ్లారు. జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని ఆరోగ్యశ్రీ డయూలసిస్ యూనిట్ నిర్వాహకులు ప్రైవేటు ల్యాబ్‌తో కుమ్మక్కై రక్త పరీక్షలు చేయకుండానే చేసినట్లు రిపోర్టులు ఇస్తున్న వైనాన్ని ‘అవినీతి జబ్బు’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే.
దీంతో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ జిల్లా కో-ఆర్డినేటర్ ప్రభాకరరావు, వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రుల జిల్లా కో-ఆర్డినేటర్ శంకర్రావు మంగళవారం ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో బిబ్రాన్ కంపెనీ నిర్వహిస్తున్న డయాలసిస్ యూనిట్‌లో తనిఖీ నిర్వహిం చారు. రోగులను పరీక్షించి, వారి రక్తపరీక్షల రిపోర్టులను పరిశీలించారు. పరీక్షలు చేయకుండానే రిపోర్టులు తెప్పిస్తున్నారని బయటపడితే మళ్లీ అవే రిపోర్టులను పరిశీ లించి క్లీన్‌చిట్ ఇవ్వడం విశేషం. రక్త పరీక్షలు నిర్వహించేందుకు డయాలసిస్ యూనిట్‌తో ఒప్పందం చేసుకున్న జెడ్ ల్యాబ్ యాజమాన్యాన్ని పిలిపించి వారి రికార్డులను కూడా పరి శీలించారు. యూనిట్‌లో ఉన్న రిపోర్టులు, ల్యాబ్‌లో ఉన్న రికార్డులను సరిపోల్చి అంతా బాగానే ఉందని కితాబిచ్చారు. ఆ రిపోర్టులకు సంబంధించి పరీక్షలే జరగడం లేదనే విషయాన్ని అధికారులు మరచిపోవడం గమనార్హం.
అదికాకుండా బిబ్రాన్ కంపెనీ, జెడ్ ల్యాబ్‌తో లోపాయకారిగా ఎటువంటి సంప్రదింపులు జరపలేదని తేల్చేశారు. జెడ్ ల్యాబ్ కంటే ముందు వేరే ల్యాబ్‌తో ఉన్న ఒప్పం దాన్ని ఎందుకు రద్దు చేసుకున్నారనే విషయంపైనా సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ఆ ల్యాబ్ పరీక్షలు సరిగా చేయకపోవడం వల్లనే వారితో ఒప్పందం రద్దు చేసుకున్నారని ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ సమర్థిస్తుండటం గమనార్హం.
కేస్ షీట్‌లతో జత చేయలేదేం హెచ్‌సీవీ, హెచ్‌ఐవీ రక్త పరీక్షలు జరిపి.. సంబంధిత కిట్‌లను రోగి కేస్‌షీట్‌కు జత చేయాల్సి వుంది. కిట్‌లను జతచేసి ఉంటే వాటి రిపోర్టులు, మళ్లీ అదే రోగికి రక్త పరీక్షలు జరిపితే వచ్చే రిపోర్టులను పోల్చి చూస్తే కొంతైనా వాస్తవం తెలిసే అవకాశం ఉండేది. కానీ చాలా కేస్ షీట్‌లు, రిపోర్టులకు ఆ కిట్‌లు జతచేసి ఉంచడం లేదు. దీంతో అసలు పరీక్షలు చేశారనే గ్యారంటీయే లేకుండాపోతోంది. అలాంటప్పుడు ఆ రిపోర్టులను పరిశీలించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హెచ్‌సీవీ పాజిటివ్ ఎందుకొస్తోంది
అధికారులు తనిఖీ చేసే సమయంలో డయాలసిస్ యూనిట్‌లో ఆరుగురు రోగులుండగా, అందులో నలుగురికి హెచ్‌సీవీ పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. నిజానికి హెపటైటిస్ సీ వైరస్ ఆస్పత్రిలో వాడే పరికరాలు సరిగా లేకపోవడం వల్లే రోగులకు వస్తుంది. యూనిట్‌లో అంతా సవ్యంగా చేస్తే రెగ్యులర్‌గా డయాలసిస్ చేసే రోగులకు ఈ వైరస్ సోకే అవకాశం ఉండదు. కానీ ఈ యూనిట్‌లో డయాలసిస్ చేయించుకున్న రోగుల్లో 60 శాతం మందికి ఈ వైరస్ సోకుతోంది. లివర్‌కు సంబంధించి ఈ వైరస్ సోకిందని తెలియగానే వారు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి.. ఆస్తులను అమ్ముకుని లక్షలు పెట్టి చికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. ఈ వైరస్ కేసులు డయాలసిస్ యూనిట్‌లో ఎక్కువగా ఉండటాన్ని బట్టే అక్కడ ఏదో తేడా జరుగుతుందనే విషయాన్ని అధికారులు గుర్తించాల్సివుంది.
అప్పటికప్పుడు ప్రత్యక్షమైన వైద్యులు
అధికారులు యూనిట్‌లో తనిఖీలు చేస్తున్నప్పుడు ఎప్పడూ అక్కడకు రాని వైద్యులు అప్పటికప్పుడు వచ్చి వాలిపోవడం గమనార్హం. ఈ డయాలసిస్ యూనిట్‌లో నిరంతరం ఒక డ్యూటీ వైద్యుడు, ఒక నెఫ్రాలజీ వైద్యుడు ఉండాలి. యూనిట్ నిర్వాహకులు విజయవాడకు చెందిన నెఫ్రాలజీ వైద్యుడు సత్యవంశీని నియమించారు. ఆయన వారానికి ఒకటి, రెండుసార్లు మాత్రమే అది కూడా ఉదయం పదిగంటల లోపు వచ్చి వెళ్లిపోతున్నట్లు సమాచారం. డ్యూటీ డాక్టర్ అని పేరేగానీ ఎప్పుడూ డ్యూటీలో డాక్టర్ ఉండరని చెబుతున్నారు. టెక్నీషియన్లే అంతా తామై తంతు నడిపించేస్తున్నారు. దీనివల్ల వల్ల కూడా రోగులు ఇబ్బందుల పాలవుతున్నారు. సీరియస్ కేసులు వచ్చినప్పుడు కూడా నెఫ్రాలజీ వైద్యు డు, డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది. అయితే విచారణాధికారులు అంతా సవ్యంగా ఉందని కితాబివ్వడం అనుమానాలకు తావిస్తోంది.
Advertisement