సాక్షి, హైదరాబాద్: ‘కోవిడ్ మొదటి రెండు దశలతో జనం బాగా భయపడ్డారు. ఇక మూడో దశ వస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందారు. కానీ కొన్ని హెచ్చరికల్లో పేర్కొన్నట్లుగా మూడో దశ వెంటనే రాలేదు. ఇక భయం లేదు, కోవిడ్ అంతమైందన్న భావనలో ఉన్నారు. అందుకే ఇప్పుడు అక్కడక్కడా కొందరు తప్ప ఎవరూ మాస్కులు ధరించటం లేదు. కానీ ఇది చాలా ప్రమాదకర పరిణామం. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు, సూచనలను పెడచెవిన పెట్టిన ఫలితంగా అటు రష్యా, ఇటు యూకేల్లో ఇప్పుడు కోవిడ్ విజృంభిస్తోంది. ఇది మనకు ఓ హెచ్చరికలాంటిది.
ప్రస్తుతం ఉన్న నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మూడో దశ రావటానికి పెద్దగా సమయం పట్టదన్న విషయాన్ని గుర్తించాలి’ అని ఇంటిగ్రేటివ్ స్పెషలిస్టు, మైక్రోబయోలజిస్టు డాక్టర్ దుర్గా సునీల్ వాస హెచ్చరించారు. కొన్ని రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోందని, ఇది క్రమంగా మూడో దశగా మారకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ‘సాక్షి’ తో పేర్కొన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
వాక్సిన్‌లతో అతి ధీమా వల్లే..
కోవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో వ్యాక్సిల్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయా అని జనం ఎదురు చూశారు. ప్రపంచంలో ఎక్కడ తయారైనా సరే, అందుబాటులోకి వస్తే మహమ్మారి అంతమవుతుందని భావించారు. ఇప్పుడు సొంత తయారీ వ్యాక్సిన్లు మనకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వాటి కోసం ఎదురుచూసినప్పుడు ఉన్న అభిప్రాయమే జనంలో ఇప్పటికీ ఉందని ప్రస్తుతం వారి తీరును బట్టి అర్ధమవుతోంది. వ్యాక్సిన్ వస్తే కోవిడ్ వైరస్ అంతమైనట్లేనని ఆదిలో భావించారు.
ఇప్పుడు వ్యాక్సిన్లు వచ్చాయి. సింహభాగం జనం వ్యాక్సిన్లు వేసుకున్నారు. క్రమంగా రెండో డోస్ వేయించుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. టీకా తీసుకున్నాం కదా ఇక ఢోకా లేదన్న ధీమాలోకి చేరుకున్నారు. వెంటనే మాస్కులు విసిరేశారు. ఇప్పుడు ఈ ధోరణే ప్రమాదకరంగా మారబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా మళ్లీ క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రులకు వస్తున్నవారి సంఖ్యా పెరుగుతోంది.
వ్యాక్సిన్లు సురక్షితం మాత్రమే..
రెండు డోసుల వ్యాక్సినేషన్‌తో ఇక కోవిడ్ సోకదనే భ్రమ ప్రజల్లో ఉంది. దాని నుంచి బయటపడాలి. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నతర్వాతకూడా వైరస్ సోకుతుంది. ప్రస్తుతం ఆసుపత్రులకు వస్తున్న వారిని చూస్తే ఇది అవగతమవుతుంది. ఏ వ్యాక్సిన్ తయారీ కంపెనీ కూడా, రెండో డోసు తర్వాత కోవిడ్ సోకదు అని ప్రకటించని విషయాన్ని జనం గుర్తించాలి. వైరస్ సోకినా ప్రాణాంతకం కాకుండా ఉండేందుకు మాత్రమే వ్యాక్సిన్లు ఉపకరిస్తాయిచ, తప్ప వైరస్ సోకకుండా అడ్డుకోలేవు. వైరస్ సోకద్దంటే కచ్చితంగా మాస్కు ధరించటంతోపాటు కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే.
మరికొన్ని నెలలు వీటిని పాటిస్తే వైరస్ ప్రభావం బాగా తగ్గిపోయి సురక్షితంగా ఉండొచ్చు. వైరస్ ముప్పు తొలగలేదని, క్రమంగా అది ఎండమిక్ స్థాయికి చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించిన విషయాన్ని గుర్తించాలి. వైరస్ రూపాంతరం చెందినప్పుడలా ప్రభావం చూపుతుంది. సురక్షిత మాస్కులను ధరించటం, భౌతిక దూరం పాటిస్తూ, తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం మినహా ప్రస్తుతానికి తరుణోపాయం లేదు.
మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితిని మర ఆర్థిక వ్యవస్థ తట్టుకోలేదన్న విషయాన్ని కూడా ప్రజలు గుర్తించాలి. వచ్చేది చలికాలం. వ్యాధులు ముసిరే కాలం. దగ్గు, జలుబుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కోవిడ్ వైరస్ విజృంభిస్తే వ్యాధి బారిన పడే వారి సంఖ్య అతి వేగంగా పెరిగే ప్రమాదం ఉంది.
ఆ రెండు దేశాల ధోరణి ఇలాగే..
అమెరికాలో చాలా వేగంగా వ్యాక్సినేషన్ జరిగింది. టీకాలు వేసుకున్నాక మాస్కుల అవసరం లేదన్న ప్రకటనలూ జారీ అయ్యాయి. ఆదిలో కోవిడ్‌తో వణికిపోయిన యూకేలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజలు మాస్కులతో పాటు కోవిడ్ నిబంధనలను పాతరేయటంతో ఒక్కసారిగా తదుపరి దశ ప్రారంభమైంది.
ఇప్పుడు మళ్లీ యూకే వణికిపోవటం మొదలుపెట్టింది. రష్యాలో భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఆసుపత్రుల్లో బెడ్లు దొరకటమే కాదు, శ్మశానవాటికల్లో స్థలం కూడా లభించటం లేదు. ఆ దేశాలకంటే ఎన్నో రెట్లు జనాభా ఉన్న మన దేశంలో మూడో దశ మొదలైతే పరిస్థితి చేయిదాటిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment