కొనసాగుతున్న హెపటైటిస్‌ – బీ టీకా పంపిణీ | Ongoing Hepatitis B vaccine distribution | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న హెపటైటిస్‌ – బీ టీకా పంపిణీ

Published Sat, Mar 11 2023 4:39 AM | Last Updated on Sat, Mar 11 2023 10:39 AM

Ongoing Hepatitis B vaccine distribution - Sakshi

సాక్షి, అమరావతి: హెపటైటిస్‌ వ్యాధి నియంత్రణ, నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. హెపటైటిస్‌–బీ బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలున్న హెచ్‌ఐవీ బాధితులకు టీకా పంపిణీని గత నెలలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రారంభించింది. రాష్ట్రంలోని 55 యాంటి రెట్రోవైరల్‌ థెరపీ (ఏఆర్‌టీ) కేంద్రాల్లో టీకా అందుబాటులో ఉంచింది. హెచ్‌ఐవీ బాధితులకు స్క్రీనింగ్‌ నిర్వహించి హెపటైటిస్‌–బీ నెగెటివ్‌గా నిర్ధారణ అయిన వారికి టీకా వేస్తున్నారు.

ఇలా ఇప్పటివరకు 54,805 మందికి తొలి డోసు వేశారు. రెండో డోసు 3,002 మందికి వేశారు. వచ్చే వారంలో హెచ్‌ఐవీ హైరిస్క్‌ వర్గాలకు టీకా పంపిణీ ప్రారంభిస్తున్నారు. ఏపీ శాక్స్‌ హై రిస్క్‌ వర్గాలుగా గుర్తించిన 3,923 మంది ట్రాన్స్‌జెండర్‌లు, 1,16,616 మంది మహిళా సెక్స్‌ వర్కర్లు, 23,623 మంది పురుష స్వలింగ సంపర్కులు, 1,741 ఇన్‌జెక్టింగ్‌ డ్రగ్‌ యూజర్స్‌.. మొత్తం 1,45,903 మందికి టీకా పంపిణీ లక్ష్యం. ఈ క్రమంలో దేశంలోనే హెచ్‌ఐవీ బాధితులు, హైరిస్క్‌ వర్గాలకు టీకా ఇస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలుస్తోంది. తొలి డోసు వేసుకున్న నెలకు రెండో డోసు, తరువాత రెండు నెలలకు చివరి డోసు టీకా వేస్తారు.

హెపటైటిస్‌ నియంత్రణలో భాగంగా ఇప్పటికే వైద్యులు, వైద్య సిబ్బందికి వందశాతం టీకా పంపిణీ చేశారు. కొత్తగా విధుల్లో చేరుతున్న వారికి కూడా టీకా వేస్తున్నారు. వైద్యశాఖ అంచనాల ప్రకారం రాష్ట్రంలో 2.3 శాతం జనాభా హెపటైటిస్‌ – బీ, 0.3 శాతం హెపటైటిస్‌–సీతో బాధపడుతున్నారు. శృంగారం, రక్తమార్పిడి, సిరంజిలు, టూత్‌బ్రెష్, రేజర్లు వంటి వివిధ రూపాల్లో హెపటైటిస్‌–బీ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది.

హెచ్‌ఐవీ బాధితులు, హైరిస్క్‌ వర్గాల వారు హెపటైటిస్‌–బీ బారిన పడటానికి ఎక్కువ అవకాశాలుంటాయని, అందువల్ల వీరు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని రాష్ట్ర హెపటైటిస్‌ వ్యాధి నియంత్రణ కార్యక్రమం ప్రత్యేకాధికారి డాక్టర్‌ నీలిమ తెలిపారు. దగ్గరలోని ఏఆర్‌టీ కేంద్రానికి వెళ్లి స్క్రీనింగ్‌ చేయించుకుని టీకా వేయించుకోవాలన్నారు. హెపటైటిస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయించి, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement