డబుల్‌ ధమాకా ఆఫర్‌! 15 వేలు ఇస్తే ప్రమోషన్‌...కోరిన చోట పోస్టింగ్‌ | Employee In HV Post At KGH Corrupted With WhatsApp Messages | Sakshi
Sakshi News home page

డబుల్‌ ధమాకా ఆఫర్‌! 15 వేలు ఇస్తే ప్రమోషన్‌...కోరిన చోట పోస్టింగ్‌

Published Sun, Jun 12 2022 6:27 PM | Last Updated on Sun, Jun 12 2022 6:27 PM

Employee In HV Post At KGH Corrupted With WhatsApp Messages - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘డియర్‌ బ్రదర్స్‌... మీ నోట్‌ ఫైల్‌ అయిపోయింది. మేడమ్‌ (రీజనల్‌ డైరెక్టర్‌) సంతకం కోసం పెండింగ్‌లో ఉన్న సంగతి మీకందరికీ తెలిసినదే. అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఏఎంఓ (అసిస్టెంట్‌ మలేరియా ఆఫీసర్‌)ల ఫైల్‌ కూడా రెడీ అయిపోయింది. వారికి ఎస్‌ఆర్‌లు కాల్‌ఫర్‌ చేస్తున్నారు. వాళ్లది అయిన (ప్రమోషన్లు ఇచ్చిన) తర్వాత పెడితే బాగుంటుందని కొంతమంది బ్రదర్స్‌ కాల్‌ చేస్తున్నారు.

మీరు ఏదో ఒకటి డిసైడ్‌ అవ్వండి. ఇప్పుడీ పదహారు (16 మంది ఎంపీహెచ్‌ఎస్‌లకు ప్రమోషన్‌)కూ కాల్‌ఫర్‌ చేయించేయాలా? ఏఎంఓలు అయిన తర్వాత ఐదు ఖాళీలైతే అప్పుడు పెట్టించుకుంటారా? పది మంది అలా అడుగుతున్నారు. పది మంది ఇలా చెబుతున్నారు. ఏదో ఒకటి డిసైడైతే బాగుంటుంది. ఏదో ఒకటి చెబితే ఈరోజు పెట్టించేయాలా (సంతకం)? ఆపాలా? అనేది నేను డిసైడ్‌ అవ్వాల్సి ఉంటుంది. మీరు చెప్పేదాని కోసమే వెయింటింగ్‌ ఇక్కడ...’  

ఇదీ విశాఖలోని కేజీహెచ్‌లో పనిచేస్తున్న ఓ హెల్త్‌ విజిటర్‌ (హెచ్‌వీ) వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్‌ హెల్త్‌ సూపర్‌వైజర్లకు పంపిన వాయిస్‌ మెయిల్‌. వారికే కాదు విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల్లోని ప్రాథమిక వైద్య కేంద్రాల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లకు అదే తరహాలో సందేశం వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే రూ.15 వేలు ఫార్మాల్టీ ఇస్తే వారికి ప్రమోషన్‌తో పాటు కోరుకున్న చోట పోస్టింగ్‌ కూడా ఇప్పిస్తామని! ఈ డబుల్‌ ధమాకా ఆఫర్‌తో ఆకర్షితులైన చాలామంది ఆ శాఖ ఉద్యోగులు పైకం సమర్పించుకున్నారనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి.

ప్రమోషన్లు, బదిలీలు పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే చెబుతున్నా దిగువస్థాయిలో మాత్రం ఆయన ఆశయానికి కొంతమంది గండికొడుతున్నారు. జోన్‌–1 పరిధిలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఇటీవల ఏర్పాటైన పార్వతీపురం–మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు కూడా ఉన్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వైద్యారోగ్య శాఖలో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

తర్వాత ప్రమోషన్ల ఫైళ్లు కూడా కదిలాయి. మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఏఎన్‌ఎం)లుగా పనిచేస్తున్నవారికి మల్టీపర్పస్‌ హెల్త్‌ సూపర్‌వైజర్‌ (ఎంపీహెచ్‌ఎస్‌)/హెల్త్‌ విజిటర్‌ (హెచ్‌వీ)లుగా ప్రమోషన్‌ ఇవ్వాల్సి ఉంది. అలాగే, ఎంపీహెచ్‌ఎస్‌గా పనిచేస్తున్నవారికి మల్టీపర్పస్‌ హెల్త్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (ఎంపీహెచ్‌ఈవో)లుగా ప్రమోషన్‌ ఇస్తారు. వారిలో ఎవరైనా బీఎస్సీ (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ–బీజడ్‌సీ) డిగ్రీ ఉన్నవారైతే అసిస్టెంట్‌ మలేరియా ఆఫీసర్‌ (ఏఎంవో)గా నియమించవచ్చు. ఈ ప్రమోషన్ల జాబితాలన్నింటికీ రీజినల్‌ డైరెక్టర్‌ (ఆర్‌డీ) ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.  

ఓ ఉద్యోగిని చక్రం... 
జాబితాలో పేరుంది. రూ.15 వేలే కదా ఫార్మాల్టీ ఇచ్చేస్తే ప్రమోషన్‌కు ప్రమోషన్‌... తర్వాత కోరుకున్న చోటుకు పోస్టింగ్‌ వస్తుందని చెబుతూ కొంతమంది ఉద్యోగులే వసూళ్లపర్వానికి తెరలేపారు. గతంలో విజయనగరం జిల్లా బొద్దాం పీహెచ్‌సీలో పనిచేసి ప్రస్తుతం కేజీహెచ్‌లో హెచ్‌వీ పోస్టులో ఉన్న ఓ ఉద్యోగిని చక్రం తిప్పుతోందని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. ఏదో ఒకటి డిసైడ్‌ చేసుకొని చెబితే ఆర్డీ సంతకం చేయించేస్తానంటూ రికార్డు చేసిన వాయిస్‌ను ఏకంగా వాట్సాప్‌లోనే పోస్టు చేయడం గమనార్హం. అంతేకాదు ఫార్మాల్టీలే ప్రసాదంగా భావించే ఆర్డీ కార్యాలయంలో ఓ ఉద్యోగి పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.  

జాబితాలు వాట్సాప్‌లో  చక్కర్లు... 
జోన్‌–1లోని పీహెచ్‌సీల్లో పనిచేస్తున్నవారిలో 87 మంది ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్‌)లకు ఎంపీహెచ్‌ఎస్‌లుగా ప్రమోషన్‌ ఇచ్చేందుకు జాబితా తయారైంది. వారిలో 45 మంది విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల్లో పనిచేస్తున్నవారు ఉన్నారు. అలాగే, 16 మంది ఎంపీహెచ్‌ఎస్‌లకు ఎంపీహెచ్‌ఈవో/ఏఎంవోలుగా పదోన్నతి ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ జాబితాలు ఇంకా ఆర్డీ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్డీ డాక్టర్‌ యు.స్వరాజ్యలక్ష్మి సంతకం చేయకుండా ఉన్న జాబితాలు మాత్రం కార్యాలయం నుంచి బయటకు వచ్చేశాయి. ప్రమోషన్‌ కోసం చూస్తున్నవారి వాట్సాప్‌కు అవి చేరాయి.   

ఫార్మాల్టీలతో పబ్బం... 
ఫార్మాల్టీ ఇచ్చేస్తే ఎలాంటి పని అయినా అయిపోతుందని ఎర వేస్తూ వైద్యారోగ్య శాఖలో కొంతమంది తోటి ఉద్యోగులే పబ్బం గడుపుకుంటున్నారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ కారణంగా కొంతమంది జూనియర్‌ అసిస్టెంట్లను కొత్త జిల్లాలైన పార్వతీపురం–మన్యం, అల్లూరి సీతారామరాజు (పాడేరు)కు పంపించారు. వారిలో ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు పాడేరు నుంచి మళ్లీ వెనక్కి తీసుకురావడానికి రూ.70 వేలు చొప్పున సమర్పించుకున్నారని ఆ శాఖ ఉద్యోగులే చెవులు కొరుక్కుంటున్నారు. అలాగే, విజయనగరం జిల్లాలో ముగ్గురు జూనియర్‌ అసిస్టెంట్లకు సీనియర్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్‌ ఇస్తూ జాబితా సిద్ధమైంది. రేపో మాపో దానికి ఆమోదముద్ర పడనుంది. అందుకోసం వారు కూడా రూ.15 వేలు చొప్పున ఫార్మాల్టీ చెల్లించుకోవాల్సి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

ప్రమోషన్లు ఫైనల్‌ చేయలేదు
అందరి దగ్గరా ఎస్‌ఆర్‌ (సర్వీసు రిజిస్టర్‌)లు మాత్రమే కాల్‌ఫర్‌ చేశాం. వారి దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు నా దృష్టికి రాలేదు. ఏఎన్‌ఎంలు కూడా ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. వసూళ్లు చేసినవారెవ్వరో నాకు చెబితే వారికి వార్నింగ్‌ ఇస్తా.    
– డాక్టర్‌ యు.స్వరాజ్యలక్ష్మి, ఆర్డీ, వైద్యారోగ్య శాఖ, విశాఖపట్నం 

(చదవండి: సర్వశ్రేయో నిధితో ఆలయాల అభివృద్ధి)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement