ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఐవీఎఫ్ సేవలతో లక్షల ఖర్చు తప్పినట్టే
రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ దవాఖాన్లలో ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులకు ఇది ఓ రకంగా శుభవార్త అని డాక్టర్లు చెబుతున్నారు. సంతానం కోసం అనేకమంది దంపతులు ఐవీఎఫ్ సెంటర్లను ఆశ్రయిస్తూ లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఫర్టిలిటీ ట్రీట్‌మెంట్ పేరిట ప్రత్యేక ప్యాకేజీలు పెట్టి మరీ బాధితుల వద్ద రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు.
రూ. 50 నుంచి రూ. 80 వేల ఖర్చులో పూర్తయ్యే ఐవీఎఫ్ చికిత్సకు, రూ.3 నుంచి రూ.6 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇంత ఖర్చు చేస్తున్నా, సగం మందికి ఫలితం దక్కడం లేదు. కానీ, ప్రైవేట్ ఆస్పత్రులు మార్కెటింగ్ ట్రిక్స్‌తో బాధిత దంపతులను మభ్యపెట్టి లక్షల్లో దండుకుంటున్నాయి. –సాక్షి, హైదరాబాద్
పెరుగుతున్న ఇన్‌ఫర్టిలిటీ సమస్యలు
రాష్ట్రంలో యువతకు సంతాన సమస్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రతి వంద జంటల్లో 30 నుంచి 40 జంటలు ఏదో ఒక స్థాయి ఇన్‌ఫర్టిలిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతోంది. ప్రభుత్వ దవాఖాన్లలో ఇన్‌ఫర్టిలిటీకి ట్రీట్‌మెంట్ అందించే సౌకర్యాలు లేకపోవడం, ప్రైవేట్ ఆస్పత్రులు రూ.లక్షల్లో చార్జీలు వసూలు చేస్తుండడంతో ఎంతో మంది మానసికంగా, ఆర్థికంగా కుంగిపోతున్నారు. మారిన జీవనశైలితో ఆడ, మగ ఇద్దరిలోనూ ఇన్‌ఫర్టిలిటీ సమస్యలు పెరిగాయని వైద్య,ఆరోగ్యశాఖ అంచనా వేస్తుంది.
పిల్లలు పుట్టకపోవడంతో కొత్త జంటలు మానసిక వేదనను అనుభవిస్తున్నాయి. ఈ సమస్య తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ దవాఖాన్లలో ఫర్టిలిటీ సెంటర్లు పెడుతామని 2017లో అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. 2023 వరకూ ఒక్క గాం«దీలో మాత్రమే ఫర్టిలిటీ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అందులో సౌకర్యాలు కల్పించలేదు.
నెల రోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి వెళ్లిన మంత్రి దామోదర దృష్టికి ఈ విషయాన్ని అధికారులు తీసుకొచ్చారు. దీంతో ఆయన ఎంబ్రయాలజిస్ట్‌ను నియమించాలని, అవసరమైన పరి కరాలు, మెడిసిన్ కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్య తీవ్రత దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలను అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment