ఐక్యరాజ్యసమతి: గాజాపై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. మొత్తం 193 దేశాలున్న ఐరాస జనరల్ అసెంబ్లీలో 45 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండగా 120 దేశాలు తీర్మానానికి మద్దతుగా, 14 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. మిగతావి ఓటింగ్‌లో పాల్గొనలేదు. అయితే ఉగ్రవాదం మానవాళి పట్ల ఎప్పటికీ మాయని మచ్చేనని భారత్ పునరుద్ఘాటించింది.
‘‘ఉగ్రవాదానికి సరిహద్దుల్లేవు. జాతి, జాతీయత లేవు. అందుకే కారణమేదైనా సరే, మతిలేని ఉగ్రవాద చర్యలకు ఎవరూ మద్దతివ్వరాదు. ఈ విషయంలో ప్రపంచమంతా ఒక్కతాటిపై ఉండాలి’’అని పిలుపునిచి్చంది. ఇజ్రాయెల్, హమాస్ తక్షణం పోరుకు స్వస్తి చెప్పాలని తీర్మానం పిలుపునిచి్చంది. గాజాకు అన్ని రకాల సాయం నిరి్నరోధంగా, పూర్తిస్థాయిలో, సురక్షితంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరింది. బందీలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. తీర్మానాన్ని జోర్డాన్ రూపొందించింది. అందులో హమాస్ పేరును ప్రస్తావించకపోవడాన్ని అమెరికా తప్పుబట్టింది.
చర్చలతోనే పరిష్కారం: భారత్
ఐరాసలో మన దేశ ఉప శాశ్వత ప్రతినిధి యోజనా పటేల్ తీర్మానంపై చర్చలో భారత్ తరఫున పాల్గొన్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి దిగడం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన పరిణామమన్నారు. దాన్ని అందరూ ఖండించాల్సి ఉందని చెప్పారు. విభేదాలు, వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ‘అలాగాకుండా పలు దేశాలు పరస్పరం హింసాకాండకు దిగుతుండటం ఆందోళనకరం. మానవతా విలువలకు పాతరేసే స్థాయిలో హింస, ప్రాణ నష్టం చోటుచేసుకుంటుండటం శోచనీయం. రాజకీయ లక్ష్యాల సాధనకు హింసను మార్గంగా చేసుకోవడం శాశ్వత పరిష్కారాలు ఇవ్వజాలదు’అని స్పష్టం చేశారు.
‘ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదు. ఈ విషయంలో దేశాలు పరస్పర విభేదాలను కూడా పక్కన పెట్టాలి’అని పిలుపునిచ్చారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో జరిగని చర్చలు ఉగ్రవాదానికి, హింసకు వ్యతిరేకంగా స్పష్టమైన సందేశమిచ్చాయని అభిప్రాయపడ్డారు. తక్షణం బందీలను విడిచిపెట్టాలని హమాస్‌కు సూచించారు. గాజాకు భారత్ కూడా మానవతా సాయం అందించిందని పటేల్ తెలిపారు. స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటే ఘర్షణకు పరిష్కారమన్నది ముందునుంచీ భారత్ వైఖరి అని స్పష్టం చేశారు. 38 టన్నుల మేరకు ఔషధాలు, పరికరాలు, నిత్యావసరాలను పంపినట్టు చెప్పారు. ఇరుపక్షాలు హింసకు స్వస్తి చెప్పి తక్షణం నేరుగా చర్చలు మొదలు పెట్టాలని కోరారు.
హమాస్ పేరు ప్రస్తావించనందుకే...!
ఐరాసలో జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంలో హమాస్ పేరును ప్రస్తావించనందుకే దానిపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్నట్టు సమాచారం. ఇజ్రాయెల్, అమెరికా తదితర దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి. చైనా, ఫ్రాన్స్, రష్యా తదితర దేశాలు అనుకూలంగా ఓటేయగా భారత్‌తో పాటు కెనడా, జర్మనీ, బ్రిటన్, జపాన్, ఉక్రెయిన్ తదితర దేశాలు దూరంగా ఉన్నాయి. తీర్మానానికి కెనడా ప్రతిపాదించిన కీలక సవరణకు భారత్ మద్దతిచ్చింది.
‘‘ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని, వందల మందిని బందీలుగా తీసుకోవడాన్ని ఏకగ్రీవంగా ఖండిస్తున్నాం. వారిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’అని తీర్మానంలో చేర్చాలని భారత్ కోరింది. భారత్‌తో పాటు మొత్తం 87 దేశాలు సవరణకు అనుకూలంగా, 55 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. 23 దేశాలు దూరంగా ఉన్నాయి. మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో సవరణ ఆమోదం పొందలేదు.
Comments
Please login to add a commentAdd a comment