
హమాస్‌పై పాలస్తీనియన్ల ఆగ్రహం
గాజా వీధుల్లో భారీ నిరసన ప్రదర్శనలు
బలప్రయోగంతో చెదరగొట్టిన మిలిటెంట్లు
కైరో: ఏడాదిన్నరకు పైగా సాగుతున్న యుద్ధంతో విసిగిపోయిన పాలస్తీనియన్లు హమాస్ ఉగ్ర సంస్థపై కన్నెర్రజేశారు. ఇజ్రాయెల్‌తో యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. హమాస్‌కు వ్యతిరేకంగా అతి పెద్ద నిరసన ప్రదర్శనకు దిగారు. ‘హమాస్ గెటౌట్’ అంటూ వీధుల్లోకి వచ్చి మరీ నినాదాలతో హోరెత్తించారు. ‘యుద్ధాన్ని ఆపండి’, ‘పాలస్తీనా పిల్లలు బతకాలనుకుంటున్నారు’, ‘మేమెందుకు చావాలి? మాకు చావాలని లేదు’, ‘మా పిల్లల రక్తం అంత చౌకైనది కాదు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ‘‘ప్రజలు అలసిపోయారు.
గాజాపై హమాస్ అధికారాన్ని వదులుకోవడమే యుద్ధానికి పరిష్కారమైతే అలాగే కానివ్వండి. ప్రజలను కాపాడేందుకు హమాస్ ఎందుకు అధికారాన్ని వదులుకోదు?’’ అంటూ నిలదీశారు. ‘ప్రజలు హమాస్‌ను గద్దె దించాలనుకుంటున్నారు’ అంటూ నినాదాలు చేశారు. మంగళవారం మొదలైన నిరసనలు బుధవారం గాజాలో మరిన్ని ప్రాంతాలకు పాకాయి! టెలిగ్రాం ద్వారా ఆందోళనకు పిలుపులు అందుకున్న ప్రజలు భారీగా నిరసనల్లో పాల్గొన్నారు. వారి సంఖ్య వేలల్లోనే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హమాస్, ఇజ్రాయెల్‌తో పాటు యుద్ధానికి తెర దించడంలో విఫలమవుతున్న అరబ్ దేశాలపైనా నిరసనకారులు మండిపడ్డారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి అనంతరం గాజాలో ఇదే అతి పెద్ద ఆందోళన.
జాబాలియా, బెయిట్ లహియా తదితర చోట్ల జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ‘‘ఇవేమీ రాజకీయ నిరసనలు కావు. మా జీవితాలకు సంబంధించిన విషయమిది’’ అని బెయిట్ హనూన్‌కు చెందిన మొహమ్మద్ అబూ సకర్ అన్నాడు. ఆయన ముగ్గురు పిల్లల తండ్రి. తామంతా నిత్యం ప్రాణభయంతో వణికిపోతున్నామంటూ ఆవేదన వెలిబుచ్చాడు. అందుకే మరో దారిలేక నిరసనలకు దిగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ‘‘ఈ హత్యాకాండకు, సొంత గడ్డపైనే శరణార్థులుగా బతకాల్సిన దుస్థితికి అడ్డుకట్ట వేసి తీరతాం. అందుకు ఎంతటి మూల్యమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని ప్రకటించాడు.
రెండు నెలల కాల్పుల విరమణ అనంతరం గాజాపై ఇజ్రాయెల్ తిరిగి భారీ బాంబు దాడులు ప్రారంభించడం తెలిసిందే. నిరసన ప్రదర్శనలపై హమాస్ ఉక్కుపాదం మోపింది. ముసుగులు ధరించిన సాయుధ హమాస్ మిలిటెంట్లు తుపాకులు, లాఠీలతో నిరసనకారులపై విరుచుకుపడ్డారు. అనేక మందిని కొట్టారని సమాచారం. 17 నెలల పై చిలుకు ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం గాజాను శిథిలావస్థకు చేర్చింది. మార్చి 2న గాజాకు సహాయ సామగ్రి పంపిణీని ఇజ్రాయెల్ మళ్లీ అడ్డుకోవడంతో పరిస్థితులు మరింత దిగజారాయి.
Comments
Please login to add a commentAdd a comment