Playground
-
ఖర్కీవ్పై రష్యా క్షిపణి దాడి
మాస్కో: ఉక్రెయిన్ నగరం ఖర్కీవ్పై రష్యా ప్రయోగించిన క్షిపణి ఆటస్థలంలో పడటంతో 14 ఏళ్ల బాలిక మృత్యువాత పడింది. సరిహద్దులకు సమీపంలోని ఖర్కీవ్పైనే జరిపిన మరో దాడిలో 12 అంతస్తుల నివాస భవనం ధ్వంసమయింది. ఘటనలో ఐదుగురు చనిపోగా మరో 59 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 9 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో 20 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఘటనలో భవనంలో పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. భవనం వెలుపలి గోడ తీవ్రంగా దెబ్బతింది. సమీపంలో పార్కు చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఇలా ఉండగా, సరిహద్దులకు సమీపంలోని బెల్గొరోడ్ ప్రాంతంపై ఉక్రెయిన్ ఆర్మీ జరిపిన దాడుల్లో ఐదుగురు చనిపోయినట్లు రష్యా ప్రకటించింది. కాగా, డొనెట్స్క్ రిజియన్లోని చాసివ్ యార్ పట్టణంపై రష్యా జరిపిన దాడుల్లో ఏడుగురు మృతి చెందారు. పట్టణంలోని పౌరులందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆ ప్రాంత గవర్నర్ కోరారు. ఉక్రెయిన్ బలగాల మౌలిక వనరుల రవాణాకు కీలకంగా ఉన్న పొక్రొవ్స్క్ నగరానికి అతి సమీపంలో రష్యా బలగాలు తిష్టవేశాయి.ఎయిర్ ఫోర్స్ చీఫ్ తొలగింపు: ముందుకు చొచ్చుకు వస్తున్న రష్యా బలగాలను నిలువరించి, ఎదురు దాడులు చేయడంలో అమెరికా మిత్ర దేశాలు అందించిన ఎఫ్–16 యుద్ధ విమానాలను ఉక్రెయిన్ కీలకంగా భావిస్తోంది. అయితే, సోమవారం ఒక ఎఫ్–16 యుద్ధ విమానాన్ని రష్యా ఆర్మీ కూల్చి వేసింది. అందులోని పైలట్ కూడా చనిపోయారు. ఘటనను అధ్యక్షుడు జెలెన్స్కీ సీరియస్గా తీసుకున్నారు. వైమానిక దళం చీఫ్ మికోలా ఒలెశ్చుక్ను బాధ్యతల నుంచి తొలగిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇందుకు కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. సైనికుల భద్రతకు ఆయనదే పూర్తి బాధ్యతని మాత్రమే వ్యాఖ్యానించారు. -
పచ్చనేతలు పోట్లూరు స్కూల్ ప్లేగ్రౌండ్ కబ్జా
-
ప్లే గ్రౌండ్లోనే ప్రసవించింది!
ఛత్తీస్ఘడ్: ప్లే గ్రౌండ్లో ఓ మహిళ పండండి బిడ్డవకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఛత్తీస్ఘడ్ రాష్ట్రం జైపూర్ జిల్లాలోని ఘుగ్రి గ్రామంలో చోటుచేసుకుంది. ఓ గర్భవతి పురిటి నొప్పులతో ఆమె బందువు సహయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. అది తెరవకపోవడంతో ఆసుపత్రి ముందు గంటకుపైగా నిరీక్షించారు. వారు 102, 108 నంబర్లకు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఆసుపత్రి పక్కన ఉన్న ఆట స్థలంలో బిడ్డకు జన్మనిచ్చింది. కొద్ది గంటల అనంతరం ఆమె తిరిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్లింది. విషయం తెలిసిన గ్రామస్థులు ఆగ్రహించడంతో ఆ సమయంలో ఆసుపత్రి తెరిచే ఉందని, ఒక నర్సు విధులు నిర్వహిస్తుందని డాక్టర్ సాహు చెప్పారు. -
ప్రధానికి లేఖ రాసింది .. చివరికి సాధించింది.
ముంబై: ఒలింపిక్స్ లో భారతదేశం పతకాలు సాధించాలంటే ప్రతీ పాఠశాలలో ఆట స్థలం ఉండాలి. పిల్లలకు స్కూలు నుంచే ఆ శిక్షణ లభించాలని ముంబైకి చెందిన ఓ విద్యార్థిని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసింది. దయచేసి మాకు ప్లే గ్రౌండ్ కేటాయించండని పీఎంఓ కార్యాలయానికి విన్నవించింది. సాక్షి తివారీ నవీ ముంబై శివారులోని ప్రభుత్వ పాఠశాలలో 9 వ తరగతి చదువుతోంది. నరేంద్రమోదీ 'మన్ కీ బాత్' లోమాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలను రాసి తనకు పప్పించాలని చెప్పడం విన్న ఆమె ఒలింపిక్ లో పతకం సాధించాలనే తన ఆశయాన్ని వివరిస్తూ పీఎంఓకి లెటర్ రాసింది. పీఎంఓ కార్యాలయం ఆమె లేఖకు స్పందిస్తూ.. పాఠశాలకు దగ్గరలో స్థలాన్ని కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. సాక్షికి ఈవిషయాన్ని పీఎంఓ కార్యాలయం తెలిపింది. పీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన రెస్సాన్స్ కు ఆశ్చర్యానికి గురయ్యానని పీవీ సింధు, సాక్షి మలిక్ లాగానే తాను కూడా ఒలింపిక్ లో పతకం సాధిస్తానని సాక్షి చెబుతోంది. -
వాన- అమ్మను కొత్తగా చూపిస్తుంది
బడిగంట మీద కురిసే వాన ఎంత గింజుకున్నా దానిని ఏమీ చేయలేదు. ఇటు నుంచి కొట్టినా అటు నుంచి కొట్టినా ఆ నాలుగంచుల ఇనుప పలక- పోయే ఎర్రిదానా అన్నట్టుగా కదలక మెదలక ఉంటుంది. అప్పుడప్పుడు తడికి ఒళ్లు జలదరించినట్టుగా కంపించి మళ్లీ తన మానాన తాను నిలుచుంటుంది. అప్పుడిక పిల్లలే గోల మొదలెడతారు. ప్లేగ్రౌండ్ను చదును చేస్తున్నట్టుగా కురిసే వానను చూస్తూ, అసెంబ్లీ గ్రౌండ్లో కవాతు చేస్తున్నట్టుగా ఉన్న వానను చూస్తూ, గాలి ఈడ్చినప్పుడల్లా క్లాస్రూముల్లోకి దూకుడుగా దడేలున దూరడానికి చూస్తున్న వానను చూస్తూ ఎంత కర్కోటకుడైన ఉపాధ్యాయుడైనా ఆ పూట పాఠం మానేసేలా చేసే వానను చూస్తూ, కొత్తగా పెట్టిన జామాయిల్ మొక్కల ముక్కులను దాదాపు నేలకు రాసేలా చేస్తున్న వానను చూస్తూ, స్కూలుబావికి కొత్త నీరు అందిస్తున్న వానను చూస్తూ, ఎప్పుడూ గంభీరంగా ఉండే తెలుగు టీచరమ్మ కాసింత కుచ్చిళ్లను ఎత్తి పట్టుకుని అల్లరిగా నవ్వుకుంటూ నడిచేలా చేసిన వానను చూస్తూ, పక్కనే ఉన్న గర్ల్స్ హైస్కూల్ నుంచి బయటపడ్డ ఆడపిల్లల వెంటపడి నీటిపువ్వుల జడలు అల్లడానికి చూస్తున్న వానను చూస్తూ, ఆగకుండా కురిసే వానను చూస్తూ, ఆగి ఆగి పెరిగే వానను చూస్తూ పిల్లలందరూ పెద్ద పెద్దగా కేరింతలు కొడతారు. అల్లరి చేస్తారు. ఎందుకనో ఊరికూరికే నవ్వుతారు. అప్పడిక లాంగ్బెల్ వినబడుతుంది. అందుకోసమే కురిసిన వాన పిల్లలకు ఆ పూట ఆ ముద్దు ఇచ్చి ఇక ఆడుకోండిరా అని కాసింత నెమ్మదిస్తుంది. పెంకుటింటి మీద కురిసే వానకు బడాయి జాస్తి. వరండా మీద నుంచి జారి పదహారు ధారలను కిందకు నిలబెడుతుంది. ఆ తాకిడికి చిట్టి గుంతలు ఏర్పడి, మట్టికి మలినం చేసే శక్తి కోల్పోయి, తేట నీరు తెర్లుతూ కాలువలోకి వడిగా పారుతూ కాగితప్పడవలు వదలడానికి కావలిసిన సెట్టింగునంతా అమరుస్తుంది. కొత్త నోట్బుక్ ఉంటే మంచిదే. పాత నోట్బుక్కును చింపి పడవను వదిలామా అది సాగినంత మేరా కరిగిన సిరా చారల గుర్తులు. మునిగిన పడవకు శ్రద్ధాంజలి. గెలిచిన పడవను మళ్లీ వదలాలి. బాగా తాటాకులు కుట్టి పైన దుబ్బును మందంగా పరిచి ఇటొక ఇంటూ మార్కుగా ఇటొక ఇంటూ మార్కుగా గడ్డి మోకులను దిగవిడిచి బందోబస్తు చేసిన పూరిల్లు ఎంత వాన కొట్టూ కిమ్మనదు. కమ్మనదు. ఒంటి నిట్టాడితో లోపల వెచ్చగా... ఆ మూల మండే మూడు రాళ్ల పొయ్యి దగ్గర ఉడుకుతున్న అన్నంతో సువాసనగా... నూరిన పచ్చడిలోకి ఉప్పు చేప ఉంటే సరి. ఒలిచిన ఉల్లిపాయ ఉంటే మరిమరీ. మాసిన దుప్పట్లు కప్పుకున్నా సరే వాన ఆ పూట వారికి భలే నిద్ర ఇస్తుంది. పైన మెత్తటి చప్పుడు చేస్తూ కమ్మని కలలను కనుపాపల్లో ఒంపుతుంది. టీ అంగళ్ల దగ్గర చేరేవాళ్ల కబుర్లకు ఇంతకు మించిన సందర్భం ఉండదు. నడుముకు ఎర్ర తువ్వాలు చుట్టిన టీ మాస్టరు అరవ్వాయన అయితే గనక గరిటె నుంచి గ్లాసులోకి పడే పాలధార సౌందర్యానికి తిరుగే ఉండదు. లుంగీలు మడిచిన వాళ్లు, గొడుగులు తెరిచినవాళ్లు, తడవనీలే అని సైకిళ్లను వదిలిపెట్టిన వాళ్లు, కింద పరిచిన గోతం పట్టా మీద ఖాళీ పాదాలను తుడిచి టీ అందుకునేవాళ్లు, సగం సగంగా తడిసి, కావాలని పూర్తిగా తడిసి.... ఒకరికొకరు ఒరుసుకుంటూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియనంతగా గోల చేస్తూ.... వాన ఊరికే ఉంటుందా? నాక్కూడా అని టీ రుచి చూడ్డానికి నాలుగు చుక్కలు చిలకరిస్తుంది. వాన చాలా చిరుతిండ్లను సిద్ధం చేస్తుంది. వేడి వేడి వేరుశనగలు చిట్టూపట్టూ అంటాయి. బాణలిలోని చెగోడీలు చర్రున కేకేస్తాయి. పిడతకింద పప్పును కలిపే కర్ర టకాపకామని గుర్రపుడెక్కలు వేస్తుంది. పుల్లట్లు సుయ్మని సైగ చేస్తాయి. కాఫీ తాగుతూ ఇష్టమైన పుస్తకం చదువుకునే మారాజులు పేజీలు తిరగేసే చప్పుడు తప్ప వేరే ఏ శబ్దమూ రానివ్వరు. వాన- అమ్మను కొత్తగా చూపిస్తుంది. ఆరేసిన బట్టల కోసం ఆమె అంత వేగంగా పరగెత్తగలదని అప్పుడే తెలుస్తుంది. కొంగు తల నిండుగా కప్పుకుంటే ఇంత బాగుంటుందా అని ఆశ్చర్యం కలిగిస్తుంది. వాన ఉన్నప్పుడు నాన్న కూడా ఉండాలి. అప్పుడు అమ్మా నాన్నల చేతులు చాలా మాట్లాడుకుంటాయి. వాన ఒకోసారి మరీ మిడిమేలంగా ఉంటుంది. శివాలయం మెట్ల మీద నివసించే ఎరుకలను తరిమికొట్టి ఆ నల్ల నాపరాళ్ల మీద రుద్ర నర్తనం చేస్తుంది. మూసిన అంగళ్ల కింద తల దాచుకుంటున్న బైరాగులను మరింత ముడుక్కునేలా చేసి వారి ముసలిపళ్లను టకటకలాడిస్తుంది. దారిన పోతూ కాసింత ఆగి ఆయోమయంగా చూస్తున్న పశువుల మంద మీద పచ్చిడోలు మీటుతుంది. పూర్తిగా తడిసిపోయిన వీధి కుక్క చేత దులపరింతల చిటికెలు మోగిస్తుంది. దీని పుణ్యమా అని కాలేజీ ఆడపిల్లల మడమలు బయటపడతాయి. బద్దకం నేర్చిన పెళ్లికాని కుర్రాడొకడు ఇదే అదనుగా వేణ్ణీళ్ల స్నానానికి ఉపక్రమించి మగ్గుమగ్గుగా మునకలు వేస్తాడు. వాన చాలా సంభాషణలు చేస్తుంది. ఎవరూ చూడని సముద్రతలాల్లో ఉప్పు నీటితో మతలబులు చెబుతుంది. ఎవరూ చేరని నదీ స్థలాలలో ప్రవాహాన్ని చేయి పట్టుకుని రన్నింగ్ రేసుకు బయల్దేర దీస్తుంది. అడవి దాని డెన్. భూపొరలలో దాని ప్రసారాలను ట్యాప్ చేసే నెట్వర్క్ ఇంకా అందుబాటులోకి రాలేదు. వాన చాలా చప్పుడు చేయాలి. వాన చాలా సవ్వడి చేయాలి. వాన చాలా ఫెళపెళార్భాటాలను సృష్టించాలి. ఎందుకంటే- ఆశ కొనసాగుతుందనడానికి అంతకు మించిన సంకేతం లేదు. - ఖదీర్ -
విజయవాడలో మహిళపై హత్యాచారం!
విజయవాడ: విజయవాడ నగరంలో దారుణం చోటు చేసుకుంది. సిద్ధార్థ మెడికల్ కాలేజీ క్రీడా మైదానంలో సోమవారం అర్థరాత్రి గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. మంగళవారం ఉదయం మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉందని పోలీసులు తెలిపారు. దుండగులు మహిళపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్రీడా మైదానం మిత్రుడికి అంకితం..!
తిరుపతి నగరంలో 45 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన శ్రీపండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల (ఎస్పీజేఎన్ఎం)లోని క్రీడామైదానం మొదటిదిగా గుర్తింపు పొందింది. ఈ క్రీడా మైదానంలో జాతీయ స్థాయి ఉత్తమ క్రీడాకారులు కూడా ఎదిగారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ పాఠశాల క్రీడామైదానంలోకి ప్రస్తుతం క్రీడాకారులకు ప్రవేశం నిషిద్ధం. ఎందుకంటే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయించిన ఓ మున్సిపల్ అధికారి స్నేహితుడు వాకింగ్ చేయడానికి అంకితం ఇచ్చారు. క్రీడాకారులు ఎవరూ ప్రవేశించకుండా గేటుకు తాళం కూడా వేశారు. తిరుపతి స్పోర్ట్స్ : తిరుపతి నగర కార్పొరేషన్లోని ఓ ఉన్నతాధికారి స్నేహితుడి వాకింగ్ చేయాలనే కోర్కె తీర్చేందుకు శ్రీపండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని మైదానంలో లక్షలు ఖర్చుపెట్టి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఆ ట్రాక్ దెబ్బతినకుండా, వాకింగ్ సమయంలో స్నేహితుడికి అసౌకర్యం లేకుండా ప్రహరీ నిర్మించి దానికి ఇనుప గేట్లు వేయించారు. ఈ గేటుకు తాళం వేసి, తాళాలను తన స్నేహితుడికి అందించినట్టు సమాచారం. దీంతో మైదానంలోకి విద్యార్థులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పాఠశాలకు సెలవు ఇచ్చిన రోజు ల్లో కూడా పాఠశాల విద్యార్థులు, క్రీడాకారు లు మైదానంలోకి వెళ్లలేక పోతున్నారు. ఇదే మైదానంలో చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉన్నప్పటికీ క్రికెట్ స్వేచ్ఛగా ఆడలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు క్రీడాకారులు ఎతైన ప్రహరీ గోడ, ఇనుప గేటు దూకి, కిందపడి గాయపడ్డారు. ఎవరైనా సా హసించి మైదానంలో ఆడుతుంటే బలవంతంగా వెళ్లగొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం క్రీడాకారుల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. క్రీడాకారులకు ఇబ్బందనీ... విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే తాళాలు వేశాం. రోజూ సాయంత్రం కొంత సేపు విద్యార్థులకు క్రీడలను నేర్పించి తిరిగి తాళాలు వేస్తున్నాం. ఇతరులు లోనికి రాకుండా కట్టడి చేయచ్చు. ఇక మైదానంలో వాకింగ్ ట్రాక్ ఎవరి కోసం వేశారో నాకు తెలియదు. -రెడ్డెప్పరెడ్డి, ఇన్చార్జ్ హెచ్ఎం,ఎస్పీజేఎన్ఎం పాఠశాల. తిరుపతి