వాన- అమ్మను కొత్తగా చూపిస్తుంది | childrens enjoy a lot in rains | Sakshi
Sakshi News home page

వాన- అమ్మను కొత్తగా చూపిస్తుంది

Published Sat, Jun 27 2015 12:46 PM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

వాన- అమ్మను కొత్తగా చూపిస్తుంది

వాన- అమ్మను కొత్తగా చూపిస్తుంది

బడిగంట మీద కురిసే వాన ఎంత గింజుకున్నా దానిని ఏమీ చేయలేదు. ఇటు నుంచి కొట్టినా అటు నుంచి కొట్టినా ఆ నాలుగంచుల ఇనుప పలక- పోయే ఎర్రిదానా అన్నట్టుగా కదలక మెదలక ఉంటుంది. అప్పుడప్పుడు తడికి ఒళ్లు జలదరించినట్టుగా కంపించి మళ్లీ తన మానాన తాను నిలుచుంటుంది. అప్పుడిక పిల్లలే గోల మొదలెడతారు.

ప్లేగ్రౌండ్‌ను చదును చేస్తున్నట్టుగా కురిసే వానను చూస్తూ, అసెంబ్లీ గ్రౌండ్‌లో కవాతు చేస్తున్నట్టుగా ఉన్న వానను చూస్తూ, గాలి ఈడ్చినప్పుడల్లా క్లాస్‌రూముల్లోకి దూకుడుగా దడేలున దూరడానికి చూస్తున్న వానను చూస్తూ ఎంత కర్కోటకుడైన ఉపాధ్యాయుడైనా ఆ పూట పాఠం మానేసేలా చేసే వానను చూస్తూ, కొత్తగా పెట్టిన జామాయిల్ మొక్కల ముక్కులను దాదాపు నేలకు రాసేలా చేస్తున్న వానను చూస్తూ, స్కూలుబావికి కొత్త నీరు అందిస్తున్న వానను చూస్తూ, ఎప్పుడూ గంభీరంగా ఉండే తెలుగు టీచరమ్మ కాసింత కుచ్చిళ్లను ఎత్తి పట్టుకుని అల్లరిగా నవ్వుకుంటూ నడిచేలా చేసిన వానను చూస్తూ, పక్కనే ఉన్న గర్ల్స్ హైస్కూల్ నుంచి బయటపడ్డ ఆడపిల్లల వెంటపడి నీటిపువ్వుల జడలు అల్లడానికి చూస్తున్న వానను చూస్తూ, ఆగకుండా కురిసే వానను చూస్తూ, ఆగి ఆగి పెరిగే వానను చూస్తూ పిల్లలందరూ పెద్ద పెద్దగా కేరింతలు కొడతారు. అల్లరి చేస్తారు. ఎందుకనో ఊరికూరికే నవ్వుతారు. అప్పడిక లాంగ్‌బెల్ వినబడుతుంది. అందుకోసమే కురిసిన వాన పిల్లలకు ఆ పూట ఆ ముద్దు ఇచ్చి ఇక ఆడుకోండిరా అని కాసింత నెమ్మదిస్తుంది.
 
పెంకుటింటి మీద కురిసే వానకు బడాయి జాస్తి. వరండా మీద నుంచి జారి పదహారు ధారలను కిందకు నిలబెడుతుంది. ఆ తాకిడికి చిట్టి గుంతలు ఏర్పడి, మట్టికి మలినం చేసే శక్తి కోల్పోయి, తేట నీరు తెర్లుతూ కాలువలోకి వడిగా పారుతూ కాగితప్పడవలు వదలడానికి కావలిసిన సెట్టింగునంతా అమరుస్తుంది. కొత్త నోట్‌బుక్ ఉంటే మంచిదే. పాత నోట్‌బుక్కును చింపి పడవను వదిలామా అది సాగినంత మేరా కరిగిన సిరా చారల గుర్తులు. మునిగిన పడవకు శ్రద్ధాంజలి. గెలిచిన పడవను మళ్లీ వదలాలి.
 
బాగా తాటాకులు కుట్టి పైన దుబ్బును మందంగా పరిచి ఇటొక ఇంటూ మార్కుగా ఇటొక ఇంటూ మార్కుగా గడ్డి మోకులను దిగవిడిచి బందోబస్తు చేసిన పూరిల్లు ఎంత వాన కొట్టూ కిమ్మనదు. కమ్మనదు. ఒంటి నిట్టాడితో లోపల వెచ్చగా... ఆ మూల మండే మూడు రాళ్ల పొయ్యి దగ్గర ఉడుకుతున్న అన్నంతో సువాసనగా... నూరిన పచ్చడిలోకి ఉప్పు చేప ఉంటే సరి. ఒలిచిన ఉల్లిపాయ ఉంటే మరిమరీ. మాసిన దుప్పట్లు కప్పుకున్నా సరే వాన ఆ పూట వారికి భలే నిద్ర ఇస్తుంది. పైన మెత్తటి చప్పుడు చేస్తూ కమ్మని కలలను కనుపాపల్లో ఒంపుతుంది.
 
టీ అంగళ్ల దగ్గర చేరేవాళ్ల కబుర్లకు ఇంతకు మించిన సందర్భం ఉండదు. నడుముకు ఎర్ర తువ్వాలు చుట్టిన టీ మాస్టరు అరవ్వాయన అయితే గనక గరిటె నుంచి గ్లాసులోకి పడే పాలధార సౌందర్యానికి తిరుగే ఉండదు. లుంగీలు మడిచిన వాళ్లు, గొడుగులు తెరిచినవాళ్లు, తడవనీలే అని సైకిళ్లను వదిలిపెట్టిన వాళ్లు, కింద పరిచిన గోతం పట్టా మీద ఖాళీ పాదాలను తుడిచి టీ అందుకునేవాళ్లు, సగం సగంగా తడిసి, కావాలని పూర్తిగా తడిసి.... ఒకరికొకరు ఒరుసుకుంటూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియనంతగా గోల చేస్తూ.... వాన ఊరికే ఉంటుందా? నాక్కూడా అని టీ రుచి చూడ్డానికి నాలుగు చుక్కలు చిలకరిస్తుంది.
 
వాన చాలా చిరుతిండ్లను సిద్ధం చేస్తుంది. వేడి వేడి వేరుశనగలు చిట్టూపట్టూ అంటాయి. బాణలిలోని చెగోడీలు చర్రున కేకేస్తాయి. పిడతకింద పప్పును కలిపే కర్ర టకాపకామని గుర్రపుడెక్కలు వేస్తుంది. పుల్లట్లు సుయ్‌మని సైగ చేస్తాయి. కాఫీ తాగుతూ ఇష్టమైన పుస్తకం చదువుకునే మారాజులు పేజీలు తిరగేసే చప్పుడు తప్ప వేరే ఏ శబ్దమూ రానివ్వరు.
 
వాన- అమ్మను కొత్తగా చూపిస్తుంది. ఆరేసిన బట్టల కోసం ఆమె అంత వేగంగా పరగెత్తగలదని అప్పుడే తెలుస్తుంది.  కొంగు తల నిండుగా కప్పుకుంటే ఇంత బాగుంటుందా అని ఆశ్చర్యం కలిగిస్తుంది. వాన ఉన్నప్పుడు నాన్న కూడా ఉండాలి. అప్పుడు అమ్మా నాన్నల చేతులు చాలా మాట్లాడుకుంటాయి.
 
వాన ఒకోసారి మరీ మిడిమేలంగా ఉంటుంది. శివాలయం మెట్ల మీద నివసించే ఎరుకలను తరిమికొట్టి ఆ నల్ల నాపరాళ్ల మీద రుద్ర నర్తనం చేస్తుంది. మూసిన అంగళ్ల కింద తల దాచుకుంటున్న బైరాగులను మరింత ముడుక్కునేలా చేసి వారి ముసలిపళ్లను టకటకలాడిస్తుంది. దారిన పోతూ కాసింత ఆగి ఆయోమయంగా చూస్తున్న పశువుల మంద మీద పచ్చిడోలు మీటుతుంది. పూర్తిగా తడిసిపోయిన వీధి కుక్క చేత దులపరింతల చిటికెలు మోగిస్తుంది. దీని పుణ్యమా అని కాలేజీ ఆడపిల్లల మడమలు బయటపడతాయి. బద్దకం నేర్చిన పెళ్లికాని కుర్రాడొకడు ఇదే అదనుగా వేణ్ణీళ్ల స్నానానికి ఉపక్రమించి మగ్గుమగ్గుగా మునకలు వేస్తాడు.
 
వాన చాలా సంభాషణలు చేస్తుంది. ఎవరూ చూడని సముద్రతలాల్లో ఉప్పు నీటితో మతలబులు చెబుతుంది. ఎవరూ చేరని నదీ స్థలాలలో ప్రవాహాన్ని చేయి పట్టుకుని రన్నింగ్ రేసుకు బయల్దేర దీస్తుంది. అడవి దాని డెన్. భూపొరలలో దాని ప్రసారాలను ట్యాప్ చేసే నెట్‌వర్క్ ఇంకా అందుబాటులోకి రాలేదు.
 
వాన చాలా చప్పుడు చేయాలి. వాన చాలా సవ్వడి చేయాలి. వాన చాలా ఫెళపెళార్భాటాలను సృష్టించాలి.
ఎందుకంటే- ఆశ కొనసాగుతుందనడానికి అంతకు మించిన సంకేతం లేదు.
 - ఖదీర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement