ఉషశ్రీ (ఫైల్)
సాక్షి, హన్మకొండ: పాఠాలు బోధించే బడిలోనే ఓ ఉపాధ్యాయురాలు ప్రాణాలు విడిచింది. రోజూ మాదిరిగానే పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయురాలు అలసటగా ఉందని, ఒళ్లు చెమటలు పట్టేస్తున్నాయని, చేతులు లాగుతున్నాయంటూ రెస్ట్ రూంలోకి వెళ్లింది. అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగానే విగతజీవిగా మారిపోయింది.
హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందిందని తెలపడటంతో పాఠశాల శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషాద ఘటన మంగళవారం హనుమకొండలోని యాదవనగర్‌లోని సిద్దార్థ హైస్కూల్‌లో చోటుచేసుకుంది. పాఠశాల ప్రిన్సిపాల్ సంపత్ ఇల్లందుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ బ్రాహ్మణవాడకు చెందిన చెరుకుపెల్లి ఉషశ్రీ (45) సుమారు 12 సంవత్సరాలుగా సిద్దార్థ హైస్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది.
రెండు రోజులుగా ఆరోగ్యం సహకరించడం లేదంటూనే మంగళవారం విధులకు హాజరైంది. మధ్యాహ్నం 1గంట సమయంలో ఒళ్లు అలసటగా ఉందని, చేతులు లాగుతున్నాయంటూ తరగతిలో నుంచి బయటకు వచ్చింది. అంతలోనే సహచర సిబ్బంది ఏమైందని తెలుసుకునేలోగా స్పృహ కోల్పోయింది. హుటాహుటిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇప్పటి వరకు పాఠాలు బోధించిన టీచర్ ఇకలేరని తెలుసుకున్న విద్యార్థులు రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment