Russia missile
-
ఖర్కీవ్‌పై రష్యా క్షిపణి దాడి
మాస్కో: ఉక్రెయిన్ నగరం ఖర్కీవ్‌పై రష్యా ప్రయోగించిన క్షిపణి ఆటస్థలంలో పడటంతో 14 ఏళ్ల బాలిక మృత్యువాత పడింది. సరిహద్దులకు సమీపంలోని ఖర్కీవ్పైనే జరిపిన మరో దాడిలో 12 అంతస్తుల నివాస భవనం ధ్వంసమయింది. ఘటనలో ఐదుగురు చనిపోగా మరో 59 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 9 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో 20 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఘటనలో భవనంలో పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. భవనం వెలుపలి గోడ తీవ్రంగా దెబ్బతింది. సమీపంలో పార్కు చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఇలా ఉండగా, సరిహద్దులకు సమీపంలోని బెల్గొరోడ్ ప్రాంతంపై ఉక్రెయిన్ ఆర్మీ జరిపిన దాడుల్లో ఐదుగురు చనిపోయినట్లు రష్యా ప్రకటించింది. కాగా, డొనెట్స్క్ రిజియన్‌లోని చాసివ్ యార్ పట్టణంపై రష్యా జరిపిన దాడుల్లో ఏడుగురు మృతి చెందారు. పట్టణంలోని పౌరులందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆ ప్రాంత గవర్నర్ కోరారు. ఉక్రెయిన్ బలగాల మౌలిక వనరుల రవాణాకు కీలకంగా ఉన్న పొక్రొవ్స్క్ నగరానికి అతి సమీపంలో రష్యా బలగాలు తిష్టవేశాయి.ఎయిర్ ఫోర్స్ చీఫ్ తొలగింపు: ముందుకు చొచ్చుకు వస్తున్న రష్యా బలగాలను నిలువరించి, ఎదురు దాడులు చేయడంలో అమెరికా మిత్ర దేశాలు అందించిన ఎఫ్–16 యుద్ధ విమానాలను ఉక్రెయిన్ కీలకంగా భావిస్తోంది. అయితే, సోమవారం ఒక ఎఫ్–16 యుద్ధ విమానాన్ని రష్యా ఆర్మీ కూల్చి వేసింది. అందులోని పైలట్ కూడా చనిపోయారు. ఘటనను అధ్యక్షుడు జెలెన్స్కీ సీరియస్‌గా తీసుకున్నారు. వైమానిక దళం చీఫ్ మికోలా ఒలెశ్చుక్ను బాధ్యతల నుంచి తొలగిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇందుకు కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. సైనికుల భద్రతకు ఆయనదే పూర్తి బాధ్యతని మాత్రమే వ్యాఖ్యానించారు. -
రష్యా క్రూరత్వం.. ఉక్రెయిన్‌పై ఒకేసారి 120 మిసైల్స్‌తో అటాక్!
కీవ్: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై కొద్ది నెలలుగా భీకర దాడులకు పాల్పడుతోంది రష్యా. ప్రధాన వనరులను ధ్వంసం చేస్తూ ఉక్రేనియన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరోమారు క్షిపణుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఒకేరోజు 120 మిసైల్స్‌ను ప్రయోగించింది. ఏ వైపు నుంచి బాంబులు పడతాయోనని అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యేలా చేసింది. భారీ స్థాయిలో మిసైల్స్ ప్రయోగించినట్లు ఉక్రెయిన్ మిలిటరీ వెల్లడించింది. ‘డిసెంబర్ 29. భారీ స్థాయిలో మిసైల్స్‌తో దాడి జరిగింది. ఆకాశం, సముద్రం నుంచి శుత్రు దేశం ఉక్రెయిన్ను చుట్టుముట్టి మిసైల్స్‌తో విరుచుకుపడింది. ’అని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది ఉక్రెయిన్ వైమానిక దళం. మరోవైపు.. 120 మిసైల్స్ ప్రయోగించినట్లు అధ్యక్షుడి సహాయకుడు మైఖైలో పోడోల్యాక్ తెలిపారు. గురువారం ఉదయమే ఉక్రెయిన్ వ్యాప్తంగా రాజధాని కీవ్‌తో పాటు ప్రధాన నగరాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ క్రమంలోనే విద్యుత్తుకు అంతరాయం ఏర్పడొచ్చని, ప్రజలు నీటిని నిలువ చేసుకోవాలని కీవ్ మేయర్ విటాలి క్లిట్స్కో అప్రమత్తం చేశారు. అలాగే.. రెండో పెద్ద నగరం ఖార్కివ్‌లోనూ వరుస పేలుళ్లు జరిగాయి. ఇదీ చదవండి: క్యాసినో హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది సజీవ దహనం.. -
Russia-Ukraine war: డోన్బాస్‌పై రష్యా సేనల గురి
కీవ్: ఉక్రెయిన్‌లోని మారియుపోల్ సిటీని విజయవంతంగా స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు ఇక తూర్పున పారిశ్రామిక ప్రాంతమైన డోన్బాస్సై ప్రధానంగా గురిపెట్టాయి. క్షిపణుల వర్షం కురిపించాయి. అత్యాధునిక ఆయుధాలతో దాడికి దిగాయి. డోన్బాస్లో రష్యా అనుకూల వేర్పాటువాదులు అధికంగా ఉండడం పుతిన్ సైన్యానికి కలిసొచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు లుహాన్స్క్ ప్రావిన్స్‌లోని ముఖ్య నగరం సీవిరోడోంటెస్క్‌లో పాగా వేయడానికి రష్యా సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. డోన్బాస్లో ఒక భాగమైన డోంటెస్క్ ప్రావిన్స్‌లోని స్లోవానిస్క్లో మళ్లీ దాడులు ప్రారంభిస్తామని రష్యా సైన్యం ప్రకటించింది. డోంటెస్క్‌లో శనివారం రష్యా బాంబు దాడుల్లో ఏడుగురు పౌరులు మరణించారని, మరో 10 మంది గాయపడ్డారని స్థానిక గవర్నర్ వెల్లడించారు. బొహోరోడిచిన్ గ్రామంలోని ఓ చర్చిలో తలదాచుకుంటున్న 100 మంది క్రైస్తవ మతాధికారులు, పిల్లలను అధికారులు ఖాళీ చేయించారు. ఇక్కడ రష్యా వైమానిక దాడులు సాగిస్తుండడమే ఇందుకు కారణం. మారియుపోల్ అజోవ్‌స్టల్ స్టీల్‌ప్లాంట్ నుంచి 2,500 మంది ఉక్రెయిన్ సైనికులను ఖైదీలుగా అదుపులోకి తీసుకున్నామని రష్యా స్పష్టం చేసింది. దీంతో సదరు సైనికుల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమ వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. త్వరగా ఈయూలో చేర్చుకోండి: జెలెన్స్కీ డోన్బాస్లో ప్రస్తుతం పరిస్థితి ఆందోళకరంగానే ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. ఆయన తాజాగా దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశం విడుదల చేశారు. రష్యా సేనలను ఉక్రెయిన్ను దళాల కచ్చితంగా ఓడిస్తాయని పేర్కొన్నారు. రష్యా దండయాత్ర నేపథ్యంలో తమ దేశాన్ని సాధ్యమైనంత త్వరగా యూరోపియన్ యూనియన్(ఈయూ)లో చేర్చుకోవాలని జెలెన్స్కీ మరోసారి కోరారు. ఈ విషయంలో ఈయూలోని 27 సభ్యదేశాలు వెంటనే చొరవ తీసుకోవాలని విన్నవించారు. ఈయూలో ఉక్రెయిన్ చేరికకు కనీసం 20 ఏళ్లు పడుతుందని ఫ్రాన్స్ మంత్రి క్లెమెంట్ బ్యూనీ చెప్పారు. ఏడాది, రెండేళ్లలో ఈయూలో ఉక్రెయిన్ భాగస్వామి అవుతుందనడం ముమ్మాటికీ అబద్ధమేనన్నారు. సిరియా నుంచి బ్యారెల్ బాంబు నిపుణులు సిరియా నుంచి రష్యాకు మద్దతుగా 50 మంది బ్యారెల్ బాంబు నిపుణులు వచ్చినట్లు ఉక్రెయిన్ నిఘా వర్గాలు వెల్లడించాయి. వీరు తయారు చేసిన బాంబులు సిరియాలో పెను విధ్వంసం సృష్టించాయి. రష్యాకు అపజయమే: అండ్రెజ్ డుడా పోలండ్ అధ్యక్షుడు అండ్రెజ్ డుడా ఆదివారం కీవ్‌లో పర్యటించారు. ఉక్రెయిన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు విజయం దక్కదని జోస్యం చెప్పారు. యుద్ధం ప్రారంభమయ్యాక ఉక్రెయిన్ పార్లమెంట్లో మాట్లాడిన తొలి విదేశీ నేత డుడానే. -
Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో రష్యా ఉక్కిరిబిక్కిరి
చిన్న దేశం.. చిదిపేద్దాం! అనుకొని ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాకు నెల దాటినా విజయతీరం కనిపించడం లేదు. ఫాస్ఫరస్ బాంబుల నుంచి హైపర్ సోనిక్ క్షిపణుల వరకు పలు ఆయుధాలను ప్రయోగించినా ఫలితం కనిపించడంలేదు. చాలా నగరాలు ఇలా స్వాధీనమై, అలా చేజారుతున్నాయి. విజయం సాధించలేదన్న ఉక్రోషంతో రష్యా మరింత భయానక మారణాయుధాలు ప్రయోగిస్తాయన్న భయాలు కూడా పెరిగాయి. రష్యాకు సునాయాస విజయం దక్కకపోవడానికి కారణాలనేకమని యుద్ధ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రపంచ సూపర్ పవర్స్లో ఒకటైన రష్యాకు ఉక్రెయిన్‌పై దాడిలో ఎదురవుతున్న భంగపాటు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రోజుల్లో ముగిసిపోతుందనుకున్న యుద్ధం నెలదాటినా కొలిక్కిరాకపోవడంతో రష్యాలో అసహనం పెరుగుతోంది. స్వదేశీయుల జాతీయాభిమానానికి పాశ్చాత్య దేశాల అండదండలు తోడవడంతో రష్యాకు ఉక్రెయిన్ చుక్కలు చూపుతోంది. చిన్నపాటి యుద్ధంగా అందరూ భావించిన ఈ దాడిలో రష్యా ఎదురుదెబ్బలు తినడానికి కారణాలు చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు. కోల్డ్‌వార్ ముగిసిన అనంతరం రష్యా ఆయుధీకరణపై పెద్దగా ఫోకస్ చేయకపోవడం, పలు ఆయుధాలను ఆర్థికావసరాలకు విక్రయించడం, రష్యా నేతల ఆలోచనలకు తగినట్లు యుద్ధ భూమిలో వ్యూహాలు లోపించడం, ఉక్రెయిన్ ప్రతిఘటనను తక్కువగా అంచనా వేయడం, మిలటరీ అగ్రనేతల్లో పేరుకుపోయిన అవినీతి, ఇష్టంలేని యువతను సైన్యంలో బలవంతంగా చేర్చుకోవడం తదితర చర్యలు రష్యా మిలటరీని బలహీనపరిచాయని విశ్లేషిస్తున్నారు. అసలు సమస్యలు ఇవే! సంస్థాగత లోపాలు, ఆయుధాల పేలవ ప్రదర్శన, వైమానిక సమన్వయ లోపం, ఆర్థిక ఇబ్బందులు.. రష్యా భంగపాటుకు కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి రష్యా వ్యూహాత్మకంగా సైనిక బెటాలియన్లను సరిహద్దులకు తరలించడం ఆరంభించింది. రష్యా పంపిన తొలి బెటాలియన్లలో అనుభవం తక్కువగా ఉన్న లేదా కాంట్రాక్టు సైనికులు అధికంగా ఉంటారు. ఇలాంటి బెటాలియన్లు చిన్నతరహా లేదా స్వల్పకాలిక యుద్ధాలకు పనికివస్తారు. కానీ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఈ బెటాలియన్లు వృ«థా అవుతాయి. అలాగే సమన్వయ లోపం రష్యా మిలటరీకి శాపంగా మారింది. కాంట్రాక్టు బెటాలియన్ సైనికులకు, నిజ సైనిక బెటాలియన్‌కు మధ్య సమన్వయం కుదర్చడానికి రష్యా కమాండర్లు నానా తంటాలు పడుతున్నారు. అలాగే మిలటరీ– వైమానిక సిబ్బంది మధ్య కూడా సమన్వయం లోపించింది. దీనివల్ల వైమానిక దాడులతో సాధించే పురోగతిని మిలటరీ కొనసాగించలేకపోయింది. నేలపై శత్రురాడార్ వ్యవస్థలను, డ్రోన్లను అనుకున్న సమయంలో రష్యన్ మిలటరీ ధ్వంసం చేయలేకపోవడం వైమానిక దాడులకు అవరోధంగా మారింది. ఇక సరుకులు, మందుగుండు సరఫరా, రిపైర్ వర్క్‌షాపుల కొరత, వైద్యసాయం అందకపోవడం అన్నింటి కన్నా ప్రధాన సమస్యలుగా మారాయి. యూఎస్ సహా పలు దేశాల ఆంక్షలు రష్యా ఆర్థిక పరిస్థితిని పాతాళానికి తీసుకుపోతున్నాయి. దీనివల్లనే సొంతసైన్యానికి రష్యా తగినంత సాయం అందించలేకపోతోందని కొందరి అంచనా. మరోవైపు ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు భారీగా ఆయుధాలను, నిధులను అందిస్తున్నాయి. దీంతో రష్యాను ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అంతిమ విజయం ఎవరిది? రష్యా వెనుకంజ కేవలం పాశ్చాత్య మీడియా సృష్టని యుద్ధ నిపుణుల్లో కొందరు భావిస్తున్నారు. యుద్ధ సమయంలో కూడా రష్యా సహజవాయు సరఫరా కొనసాగిస్తూనే ఉందని, ఆంక్షలను ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు ముందే తీసుకుందని గుర్తు చేస్తున్నారు. దీనికితోడు చైనా, బెలారస్ వంటి దేశాలు రష్యాకు సాయం చేస్తున్నాయని, భారత్ లాంటి కీలక దేశాలు తటస్థ వైఖరిని అవలంబించడం కూడా రష్యాకు కలిసివచ్చే అంశమని చెబుతున్నారు. ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవడం పుతిన్ ఉద్దేశం కాదని, కేవలం తనకు అనుకూల ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్ ఎంత ప్రతిఘటించినా చివరకు పుతిన్ అనుకున్నది సాధించే తీరతాడని విశ్లేషిస్తున్నారు. త్వరలో ఇరు పక్షాల మధ్య జరిగే చర్చల్లో రష్యాకు అనుకూల ప్రతిపాదనలు రావచ్చని వీరి అంచనా. యుద్ధంలో విధ్వంసకాలు రష్యా వాడుతున్న ఆయుధాలు: 1. ఫాస్ఫరస్ బాంబులు: భారీగా ఫాస్ఫరస్ పొగను విడుదల చేస్తాయి. ఈ రసాయనం గాల్లో విడుదలైనప్పుడు ప్రకాశవంతంగా మండుతుంది. దీనివల్ల శత్రు టార్గెట్లను సులభంగా గుర్తించవచ్చు. అలాగే ఇవి పేలినప్పుడు దగ్గరలో ఉన్న జీవజాలం చర్మంపై బొబ్బలు వస్తాయి. 2. కింజల్ మిసైల్స్: ఇవి హైపర్సోనిక్ క్షిపణులు. మిగ్ విమానం నుంచి ప్రయోగిస్తారు. ధ్వని వేగానికి ఐదురెట్లు వేగంతో పయనిస్తాయి. 2వేల కిలోమీటర్ల పరిధిలో ప్రయోగించవచ్చు. 3. ఇస్కాండర్ మిసైల్: స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు. 500 కిలోమీటర్ల దూరంలో టార్గెట్‌ను కూడా ధ్వంసం చేయగలవు. ఉక్రెయిన్‌పై ఎక్కువగా రష్యా వీటినే ప్రయోగిస్తోంది. ఇవి బంకర్ బస్టర్లుగా, థర్మోబారిక్ బాంబుగా, ఈఎంపీగా ఉపయోగపడతాయి. 4. వాక్యూమ్ బాంబ్: థర్మోబారిక్ బాంబ్ అంటారు. అత్యంత ప్రమాదకరమైన బాంబులు. పేలినప్పుడు భారీ విధ్వంసాన్ని సృష్టిస్తాయి. ప్రయోగప్రాంతంలో ఆక్సిజన్‌ను పీల్చుకొని అత్యంత పెద్ద పేలుడును ఉత్పత్తి చేస్తాయి. 5. క్లస్టర్ బాంబు: ఉక్రెయిన్ స్కూల్‌పై రష్యా ప్రయోగించిందన్న ఆరోపణలున్నాయి. పేలినప్పుడు చిన్న బాంబ్లెట్స్గా మారి చుట్టుపక్కలున్నవారిని గాయపరుస్తాయి. సిరియాలో కూడా రష్యా వీటిని వాడిందన్న విమర్శలున్నాయి. 6. బాంబర్ ప్లేన్స్: ఉక్రెయిన్ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేయడానికి ఉపయోగించారు. వీటి నుంచి మిసైల్స్‌ను, క్లస్టర్ బాంబులను ప్రయోగించవచ్చు. ఉక్రెయిన్ వాడుతున్నవి: 1. జావెలిన్ మిసైల్: ఉక్రెయిన్ వాడుతోంది. యూఎస్ తయారీ. రష్యా మిలటరీ వాహనాలను హడలుగొడుతున్నాయి. ప్రయోగించిన తర్వాత వాటంతటవే టార్గెట్‌ను ఎంచుకోవడం వీటి ప్రత్యేకత. 2. టీబీ2 డ్రోన్: దీన్ని కూడా ఉక్రెయిన్ విరివిగా వాడుతోంది. టర్కీ తయారీ. 27 గంటల పాటు గాల్లో ఉండగలవు. 3. ఎన్ఎల్ఏడబ్ల్యూ: స్వల్ప దూరంలో లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. ఒక్కరే ఆపరేట్ చేయవచ్చు. ఒక్క షాట్‌తో ట్యాంకును మట్టికరిపిస్తుంది. 4. స్టింగర్ మిసైల్: ఉక్రెయిన్‌కు యూఎస్ సరఫరా చేసింది. భూమి మీద నుంచి గాల్లోకి ప్రయోగిస్తారు. వీటివల్లనే రష్యా వైమానిక దళం ఆధిపత్యం ప్రదర్శించలేకపోతోంది. పలు రష్యన్ హెలికాప్టర్లను ఈ క్షిపణులు కూల్చివేశాయి. – నేషనల్ డెస్క్, సాక్షి. -
‘రష్యా క్షిపణితోనే ఆ విమానాన్ని కూల్చారు’
న్యూవెజీన్: మలేషియా విమానం ఎంహెచ్-17 కూల్చివేత వ్యవహారంలో రష్యా ప్రభుత్వం ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఉక్రెయిన్ పేర్కొంది. అంతర్జాతీయ నేరన్యాయ సంస్థ జరిపిన దర్యాప్తులో ఈ విషయం స్పష్టమైందని తెలిపింది. ఈ విమానాన్ని ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు కూల్చివేశారని డచ్ నేతృత్వంలోని సంయుక్త దర్యాప్తు సంస్థ వెల్లడించింది. నెదర్లాండ్స్ లోని న్యూవెజీన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్యాప్తు వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రాసంగిక సాక్ష్యాలు, ఫోరెన్సిక్ పరీక్షలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం, సాటిలైట్ ఫొటోలు, రాడార్ డేటా, టెలిఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు సాగించామన్నారు. 9ఎం38 క్షిపణితో విమానాన్ని కూల్చివేసినట్టు గుర్తించామని చెప్పారు. ఉక్రెయిన్ లోని స్నిజ్నె పట్టణానికి దక్షిణ వైపున 6 ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతం నుంచి విమానాన్ని పేల్చివేశారని తెలిపారు. రష్యా భూభాగం నుంచి క్షిపణిని తూర్పు ఉక్రెయిన్ కు తరలించారని, తర్వాత తెలుగు రంగు వాల్వో వాహనంలో దీన్ని అక్కడికి చేర్చినట్టు చెప్పారు. ఈ వ్యవహారంలో దాదాపు వంద మందికి సంబంధమున్నట్టు వెల్లడించారు. క్షిపణిని ఎవరు తరలించమన్నారు, విమానాన్ని ఎవరు కూల్చివేయమన్నారనే దానిపై దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగలేదంటూ రష్యా అసంతృప్తి వ్యక్తం చేసింది. 2014, జూలై 17న దక్షిణాఫ్రికాలోని అమ్‌స్టర్‌డాం నుంచి కౌలాలంపుర్ వెళుతున్న విమానాన్ని ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 298 మంది చనిపోయారు.