‘రష్యా క్షిపణితోనే ఆ విమానాన్ని కూల్చారు’
న్యూవెజీన్: మలేషియా విమానం ఎంహెచ్-17 కూల్చివేత వ్యవహారంలో రష్యా ప్రభుత్వం ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఉక్రెయిన్ పేర్కొంది. అంతర్జాతీయ నేరన్యాయ సంస్థ జరిపిన దర్యాప్తులో ఈ విషయం స్పష్టమైందని తెలిపింది. ఈ విమానాన్ని ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు కూల్చివేశారని డచ్ నేతృత్వంలోని సంయుక్త దర్యాప్తు సంస్థ వెల్లడించింది. నెదర్లాండ్స్ లోని న్యూవెజీన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్యాప్తు వివరాలను అధికారులు వెల్లడించారు.
ప్రాసంగిక సాక్ష్యాలు, ఫోరెన్సిక్ పరీక్షలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం, సాటిలైట్ ఫొటోలు, రాడార్ డేటా, టెలిఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు సాగించామన్నారు. 9ఎం38 క్షిపణితో విమానాన్ని కూల్చివేసినట్టు గుర్తించామని చెప్పారు. ఉక్రెయిన్ లోని స్నిజ్నె పట్టణానికి దక్షిణ వైపున 6 ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతం నుంచి విమానాన్ని పేల్చివేశారని తెలిపారు. రష్యా భూభాగం నుంచి క్షిపణిని తూర్పు ఉక్రెయిన్ కు తరలించారని, తర్వాత తెలుగు రంగు వాల్వో వాహనంలో దీన్ని అక్కడికి చేర్చినట్టు చెప్పారు. ఈ వ్యవహారంలో దాదాపు వంద మందికి సంబంధమున్నట్టు వెల్లడించారు. క్షిపణిని ఎవరు తరలించమన్నారు, విమానాన్ని ఎవరు కూల్చివేయమన్నారనే దానిపై దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.
దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగలేదంటూ రష్యా అసంతృప్తి వ్యక్తం చేసింది. 2014, జూలై 17న దక్షిణాఫ్రికాలోని అమ్‌స్టర్‌డాం నుంచి కౌలాలంపుర్ వెళుతున్న విమానాన్ని ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 298 మంది చనిపోయారు.