Russia-Ukraine war: Defeat in Ukraine will spell doom for Russia - Sakshi
Sakshi News home page

Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో రష్యా ఉక్కిరిబిక్కిరి

Published Tue, Mar 29 2022 4:38 AM | Last Updated on Tue, Mar 29 2022 8:20 AM

Russia-Ukraine war: Defeat in Ukraine will spell doom for Russia - Sakshi

చిన్న దేశం.. చిదిపేద్దాం! అనుకొని ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాకు నెల దాటినా విజయతీరం కనిపించడం లేదు. ఫాస్ఫరస్‌ బాంబుల నుంచి హైపర్‌ సోనిక్‌ క్షిపణుల వరకు పలు ఆయుధాలను ప్రయోగించినా ఫలితం కనిపించడంలేదు. చాలా నగరాలు ఇలా స్వాధీనమై, అలా చేజారుతున్నాయి. విజయం సాధించలేదన్న ఉక్రోషంతో రష్యా మరింత భయానక మారణాయుధాలు ప్రయోగిస్తాయన్న భయాలు కూడా పెరిగాయి. రష్యాకు సునాయాస విజయం దక్కకపోవడానికి కారణాలనేకమని యుద్ధ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.  

 ప్రపంచ సూపర్‌ పవర్స్‌లో ఒకటైన రష్యాకు ఉక్రెయిన్‌పై దాడిలో ఎదురవుతున్న భంగపాటు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రోజుల్లో ముగిసిపోతుందనుకున్న యుద్ధం నెలదాటినా కొలిక్కిరాకపోవడంతో రష్యాలో అసహనం పెరుగుతోంది. స్వదేశీయుల జాతీయాభిమానానికి పాశ్చాత్య దేశాల అండదండలు తోడవడంతో రష్యాకు ఉక్రెయిన్‌ చుక్కలు చూపుతోంది. చిన్నపాటి యుద్ధంగా అందరూ భావించిన ఈ దాడిలో రష్యా ఎదురుదెబ్బలు తినడానికి కారణాలు చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు. కోల్డ్‌వార్‌ ముగిసిన అనంతరం రష్యా ఆయుధీకరణపై పెద్దగా ఫోకస్‌ చేయకపోవడం, పలు ఆయుధాలను ఆర్థికావసరాలకు విక్రయించడం, రష్యా నేతల ఆలోచనలకు తగినట్లు యుద్ధ భూమిలో వ్యూహాలు లోపించడం, ఉక్రెయిన్‌ ప్రతిఘటనను తక్కువగా అంచనా వేయడం, మిలటరీ అగ్రనేతల్లో పేరుకుపోయిన అవినీతి, ఇష్టంలేని యువతను సైన్యంలో బలవంతంగా చేర్చుకోవడం తదితర చర్యలు రష్యా మిలటరీని బలహీనపరిచాయని విశ్లేషిస్తున్నారు.  

అసలు సమస్యలు ఇవే!
సంస్థాగత లోపాలు, ఆయుధాల పేలవ ప్రదర్శన, వైమానిక సమన్వయ లోపం, ఆర్థిక ఇబ్బందులు.. రష్యా భంగపాటుకు కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌ నుంచి రష్యా వ్యూహాత్మకంగా సైనిక బెటాలియన్లను సరిహద్దులకు తరలించడం ఆరంభించింది. రష్యా పంపిన తొలి బెటాలియన్లలో అనుభవం తక్కువగా ఉన్న లేదా కాంట్రాక్టు సైనికులు అధికంగా ఉంటారు. ఇలాంటి బెటాలియన్లు చిన్నతరహా లేదా స్వల్పకాలిక యుద్ధాలకు పనికివస్తారు. కానీ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఈ బెటాలియన్లు వృ«థా అవుతాయి. అలాగే సమన్వయ లోపం రష్యా మిలటరీకి శాపంగా మారింది. కాంట్రాక్టు బెటాలియన్‌ సైనికులకు, నిజ సైనిక బెటాలియన్‌కు మధ్య సమన్వయం కుదర్చడానికి రష్యా కమాండర్లు నానా తంటాలు పడుతున్నారు.

అలాగే మిలటరీ– వైమానిక సిబ్బంది మధ్య కూడా సమన్వయం లోపించింది. దీనివల్ల వైమానిక దాడులతో సాధించే పురోగతిని మిలటరీ కొనసాగించలేకపోయింది. నేలపై శత్రురాడార్‌ వ్యవస్థలను, డ్రోన్లను అనుకున్న సమయంలో రష్యన్‌ మిలటరీ ధ్వంసం చేయలేకపోవడం వైమానిక దాడులకు అవరోధంగా మారింది. ఇక సరుకులు, మందుగుండు సరఫరా, రిపైర్‌ వర్క్‌షాపుల కొరత, వైద్యసాయం అందకపోవడం అన్నింటి కన్నా ప్రధాన సమస్యలుగా మారాయి. యూఎస్‌ సహా పలు దేశాల ఆంక్షలు రష్యా ఆర్థిక పరిస్థితిని పాతాళానికి తీసుకుపోతున్నాయి. దీనివల్లనే సొంతసైన్యానికి రష్యా తగినంత సాయం అందించలేకపోతోందని కొందరి అంచనా. మరోవైపు ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు భారీగా ఆయుధాలను, నిధులను అందిస్తున్నాయి. దీంతో రష్యాను ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.  

అంతిమ విజయం ఎవరిది?
రష్యా వెనుకంజ కేవలం పాశ్చాత్య మీడియా సృష్టని యుద్ధ నిపుణుల్లో కొందరు భావిస్తున్నారు. యుద్ధ సమయంలో కూడా రష్యా సహజవాయు సరఫరా కొనసాగిస్తూనే ఉందని, ఆంక్షలను ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు ముందే తీసుకుందని గుర్తు చేస్తున్నారు. దీనికితోడు చైనా, బెలారస్‌ వంటి దేశాలు రష్యాకు సాయం చేస్తున్నాయని, భారత్‌ లాంటి కీలక దేశాలు తటస్థ వైఖరిని అవలంబించడం కూడా రష్యాకు కలిసివచ్చే అంశమని చెబుతున్నారు. ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవడం పుతిన్‌ ఉద్దేశం కాదని, కేవలం తనకు అనుకూల ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్‌ ఎంత ప్రతిఘటించినా చివరకు పుతిన్‌ అనుకున్నది సాధించే తీరతాడని విశ్లేషిస్తున్నారు. త్వరలో ఇరు పక్షాల మధ్య జరిగే చర్చల్లో రష్యాకు అనుకూల ప్రతిపాదనలు రావచ్చని వీరి అంచనా.  

యుద్ధంలో విధ్వంసకాలు
రష్యా వాడుతున్న ఆయుధాలు:
1. ఫాస్ఫరస్‌ బాంబులు: భారీగా ఫాస్ఫరస్‌ పొగను విడుదల చేస్తాయి. ఈ రసాయనం గాల్లో విడుదలైనప్పుడు ప్రకాశవంతంగా మండుతుంది. దీనివల్ల శత్రు టార్గెట్లను సులభంగా గుర్తించవచ్చు. అలాగే ఇవి పేలినప్పుడు దగ్గరలో ఉన్న జీవజాలం చర్మంపై బొబ్బలు వస్తాయి.  
2. కింజల్‌ మిసైల్స్‌: ఇవి హైపర్‌సోనిక్‌ క్షిపణులు. మిగ్‌ విమానం నుంచి ప్రయోగిస్తారు. ధ్వని వేగానికి ఐదురెట్లు వేగంతో పయనిస్తాయి. 2వేల కిలోమీటర్ల పరిధిలో ప్రయోగించవచ్చు.  
3. ఇస్కాండర్‌ మిసైల్‌: స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులు. 500 కిలోమీటర్ల దూరంలో టార్గెట్‌ను కూడా ధ్వంసం చేయగలవు. ఉక్రెయిన్‌పై ఎక్కువగా రష్యా వీటినే ప్రయోగిస్తోంది. ఇవి బంకర్‌ బస్టర్లుగా, థర్మోబారిక్‌ బాంబుగా, ఈఎంపీగా ఉపయోగపడతాయి.
4. వాక్యూమ్‌ బాంబ్‌: థర్మోబారిక్‌ బాంబ్‌ అంటారు. అత్యంత ప్రమాదకరమైన బాంబులు. పేలినప్పుడు భారీ విధ్వంసాన్ని సృష్టిస్తాయి. ప్రయోగప్రాంతంలో ఆక్సిజన్‌ను పీల్చుకొని అత్యంత పెద్ద పేలుడును ఉత్పత్తి చేస్తాయి.  
5. క్లస్టర్‌ బాంబు: ఉక్రెయిన్‌ స్కూల్‌పై రష్యా ప్రయోగించిందన్న ఆరోపణలున్నాయి. పేలినప్పుడు చిన్న బాంబ్‌లెట్స్‌గా మారి చుట్టుపక్కలున్నవారిని గాయపరుస్తాయి. సిరియాలో కూడా రష్యా వీటిని వాడిందన్న విమర్శలున్నాయి.  
6. బాంబర్‌ ప్లేన్స్‌: ఉక్రెయిన్‌ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేయడానికి ఉపయోగించారు. వీటి నుంచి మిసైల్స్‌ను, క్లస్టర్‌ బాంబులను ప్రయోగించవచ్చు.

ఉక్రెయిన్‌ వాడుతున్నవి:
1. జావెలిన్‌ మిసైల్‌: ఉక్రెయిన్‌ వాడుతోంది. యూఎస్‌ తయారీ. రష్యా మిలటరీ వాహనాలను హడలుగొడుతున్నాయి. ప్రయోగించిన తర్వాత వాటంతటవే టార్గెట్‌ను ఎంచుకోవడం వీటి ప్రత్యేకత.
2. టీబీ2 డ్రోన్‌: దీన్ని కూడా ఉక్రెయిన్‌ విరివిగా వాడుతోంది. టర్కీ తయారీ. 27 గంటల పాటు గాల్లో ఉండగలవు.  
3. ఎన్‌ఎల్‌ఏడబ్ల్యూ: స్వల్ప దూరంలో లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. ఒక్కరే ఆపరేట్‌ చేయవచ్చు. ఒక్క షాట్‌తో ట్యాంకును మట్టికరిపిస్తుంది.  
4. స్టింగర్‌ మిసైల్‌: ఉక్రెయిన్‌కు యూఎస్‌ సరఫరా చేసింది. భూమి మీద నుంచి గాల్లోకి ప్రయోగిస్తారు. వీటివల్లనే రష్యా వైమానిక దళం ఆధిపత్యం ప్రదర్శించలేకపోతోంది. పలు రష్యన్‌ హెలికాప్టర్లను ఈ క్షిపణులు కూల్చివేశాయి.  

 – నేషనల్‌ డెస్క్, సాక్షి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement