
ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులు
ద్వారకాతిరుమల: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని గొల్లగూడెంలో ఆదివారం రాత్రి వినాయకచవితి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్న పలువురు వైఎస్సార్‌సీపీ నేతలపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కర్రలు, ఇతర ఆయుధాలతో దాడిచేసి హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో ఐదుగురు వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
బాధితుల కథనం ప్రకారం.. వినాయకచవితి ఉత్సవాల నిర్వహణ కోసం స్థానిక రామాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు గంటా వెంకటసుబ్రహ్మణ్యం, బొంతు రమేష్, ఈలప్రోలు ధర్మరాజు, కొత్తపల్లి గురువిష్ణు, కొత్తపల్లి హేమంత్ షామియానా పందిరి ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమయంలో పాతకక్షల నేపథ్యంలో టీడీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రసాద్, నాయకులు కొమ్మిన సత్యనారాయణ, చిలకా సతీష్, బొంతు వెంకటేశ్వరరావు, కొత్తపల్లి హరికృష్ణ, గంజి సతీష్, గంజి సురేష్, బొంతు మణీంద్రరావు, బొంతు నరసింహరావు, కవి భార్గవ, కొత్తపల్లి దుర్గారావు తదితరులు వారిపై ఒక్కసారాగా దాడిచేశారు.
కర్రలు, ఆయుధాలతో తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో ఘంటా వెంకటసుబ్రహ్మణ్యం, బొంతు రమేష్, ఈలప్రోలు ధర్మరాజు తలలకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావమైంది. కొత్తపల్లి గురువిష్ణుకు చెయ్యి విరగ్గా, కొత్తపల్లి హేమంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారు అక్కడ చికిత్స పొందుతున్నారు. రాజకీయకక్షల నేపథ్యంలో తమను హత్యచేసేందుకు ప్రయత్నించారని బాధితులు పేర్కొన్నారు. ఈ దాడిపై దర్యాప్తు చేస్తున్నట్లు ద్వారకాతిరుమల ఎస్‌ఐ టి.సుధీర్ తెలిపారు.