Hypersonic Missile
-
‘ఉక్రెయిన్ యుద్ధంలో హైపర్సోనిక్ మిసైల్స్ వాడాం’
గత రెండేళ్ల నుంచి రష్యా.. ఉక్రెయన్‌పై దాడులతో యుద్ధం చేస్తూనే ఉంది. పలు ప్రాంతాలు రష్యా ఆక్రమించుకుంది. మరోవైపు పలుదేశాల మద్దతుతో ఉక్రెయిన్ సైతం రష్యా దాడులకు భయపడకుండా అదును చూసుకోని ప్రతిదాడులకు దిగుతోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ఆయన జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి గురువారం మాట్లాడారు. రష్యా ఆరేళ్ల కిందట ప్రవేశపెట్టిన అత్యాధునిక ఆయుధాలను ప్రస్తుతం ఉపయోగిస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో కింజాల్, సిర్కాన్ లాంటి హైపర్సోనిక్ మిసైల్స్‌ను రష్యా సైనిక బలగాలు వాడుతున్నట్లు పేర్కొన్నారు. అవి ఉక్రెయిన్ మిలిటరీ స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో దాడి చేసినట్లు కూడా తెలిపారు. అవన్గార్డ్ స్ట్రాటజిక్ హైపర్సోనిక్ గ్లైడర్లు, పెరిస్వెల్ లేజర్ వ్యవస్థలు ఇప్పటికే పనిచేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా హైపర్సోనిక్ గ్లైడర్లు.. లక్ష్యం దిశగా అణ్వాయుధాలను మోసుకెళ్లుతాయి. హై ఆల్టిట్యూడ్‌లో అత్యంత వేగంగా ఆ మిసైల్స్ ప్రయాణిస్తాయి. త్వరలోనే హెవీ స్ట్రాటజిక్ ఖండాంతర బాలిస్టిక్ సర్మట్ మిసైల్స్‌ను విడుదల చేయనున్నట్లు పుతిన్ తెలిపారు. అణ్వాయుధ సహిత క్రూయిజ్ మిసైల్ బురెవెస్నిక్తో పాటు అండర్ వాటర్ అణ్వాయుధ పోసిడాన్ డ్రోన్ ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నాయని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. -
రష్యాలో కిమ్ జోంగ్ ఉన్ బిజీబిజీ
సియోల్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన శనివారం రష్యా ఆయుధాగారాన్ని సందర్శించారు. రష్యా అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సహిత బాంబర్లు, హైపర్‌సానిక్ క్షిపణులు, అత్యాధునిక యుద్ధ నౌకను పరిశీలించారు. కిమ్ తొలుత ఉత్తర కొరియా నుంచి రైలులో అరి్టయోమ్ సిటీకి చేరుకున్నారు. ఇక్కడికి సమీపంలోని ఎయిర్‌పోర్టులో రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్లు, యుద్ధ విమానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కిమ్ వెంట రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉన్నారు. టు–160, టు–95–, టు–22 బాంబర్ల గురించి కిమ్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మిగ్–31 ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించే హైపర్‌సానిక్ కింజాల్ క్షిపణుల గురించి కిమ్‌కు సెర్గీ వివరించారు. ఇలాంటి క్షిపణులను ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యం ప్రయోగిస్తోంది. కిమ్, సెర్గీ షోయిగు కలిసి రేవు నగరం వ్లాదివోస్తోక్ చేరుకున్నారు. ఇక్కడ అత్యాధునిక యుద్ధ నౌకలను, ఆయుధాలను కిమ్ పరిశీలించారు. ఆయుధాలు, ఉపగ్రహాల తయారీ విషయంలో రష్యా నుంచి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికే కిమ్ రష్యాలో పర్యటిస్తున్నట్లు పశి్చమ దేశాలు అంచనా వేస్తున్నాయి. -
డేంజర్ బెల్స్.. టెన్షన్ పెడుతున్న పుతిన్ ప్లాన్స్
ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ పుతిన్ మరో హెచ్చరికను జారీ చేశారు. ఉక్రెయిన్ ఆక్రమణను మరింత వేగవంతం చేసేందుకు అత్యంత శక్తివంతమైన క్షిపణిని రష్యా ప్రయోగించింది. శక్తిమంతమైన జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్షను రష్యా చేపట్టింది. విజయవంతంగా ఈ పరీక్ష నిర్వహించినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి.. ధ్వని వేగం కన్నా 9 రెట్లు (గంటకు 11వేల కిలోమీటర్లు) వేగంగా దూసుకెళ్తుంది. బాలిస్టిక్ తరగతికి చెందని క్షిపణుల్లో ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైందని నిపుణులు చెబుతున్నారు. ఇది దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా చేధించగలదు. బారెంట్స్ సముద్రంలోని అడ్మిరల్ గోర్షోవ్ ఫ్రిగేట్ యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన ఈ మిసైల్ వెయ్యి కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌ను విజయవంతంగా చేధించినట్టు రక్షణ శాఖ తెలిపింది. మరోవైపు.. జిర్కాన్ క్షిపణిని శత్రు దేశాల రాడార్లు పసిగట్టలేవని రష్యా సైనికాధికారులు చెబుతున్నారు. ఈ క్షిపణిలో వాడిన అప్‌గ్రేడెడ్ ఇంధనంవల్లే అది మెరుపులా దూసుకెళ్లగలుగుతుందని పేర్కొన్నారు. ఈ వేగం కారణంగా జిర్కాన్ ముందు భాగంలోని వాయుపీడనం.. క్షిపణి చుట్టూ ప్లాస్మా మేఘాన్ని ఏర్పరుస్తుంది. అది శత్రు రాడార్ నుంచి వచ్చే రేడియో తరంగాలను శోషించుకుంటుంది. ఫలితంగా దీన్ని శత్రుదేశాలు పసిగట్టలేవని రక్షణ శాఖ తెలిపింది. ఇక, అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ‘కింజాల్’ను మార్చిలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన విషయం తెలిసిందే. మరోవైపు తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంపై పట్టు పెంచుకోవడంలో భాగంగా రష్యా చిన్న పట్టణాలను తన అధీనంలోకి తీసుకుంటున్నది. కాగా, జిర్కాన్ సాయంతో అమెరికా విమానవాహక నౌకలను సైతం కూల్చేయవచ్చని రష్యా అధికారులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి:మాయమైతే.. పైసలు వాపస్ -
Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో రష్యా ఉక్కిరిబిక్కిరి
చిన్న దేశం.. చిదిపేద్దాం! అనుకొని ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాకు నెల దాటినా విజయతీరం కనిపించడం లేదు. ఫాస్ఫరస్ బాంబుల నుంచి హైపర్ సోనిక్ క్షిపణుల వరకు పలు ఆయుధాలను ప్రయోగించినా ఫలితం కనిపించడంలేదు. చాలా నగరాలు ఇలా స్వాధీనమై, అలా చేజారుతున్నాయి. విజయం సాధించలేదన్న ఉక్రోషంతో రష్యా మరింత భయానక మారణాయుధాలు ప్రయోగిస్తాయన్న భయాలు కూడా పెరిగాయి. రష్యాకు సునాయాస విజయం దక్కకపోవడానికి కారణాలనేకమని యుద్ధ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రపంచ సూపర్ పవర్స్లో ఒకటైన రష్యాకు ఉక్రెయిన్‌పై దాడిలో ఎదురవుతున్న భంగపాటు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రోజుల్లో ముగిసిపోతుందనుకున్న యుద్ధం నెలదాటినా కొలిక్కిరాకపోవడంతో రష్యాలో అసహనం పెరుగుతోంది. స్వదేశీయుల జాతీయాభిమానానికి పాశ్చాత్య దేశాల అండదండలు తోడవడంతో రష్యాకు ఉక్రెయిన్ చుక్కలు చూపుతోంది. చిన్నపాటి యుద్ధంగా అందరూ భావించిన ఈ దాడిలో రష్యా ఎదురుదెబ్బలు తినడానికి కారణాలు చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు. కోల్డ్‌వార్ ముగిసిన అనంతరం రష్యా ఆయుధీకరణపై పెద్దగా ఫోకస్ చేయకపోవడం, పలు ఆయుధాలను ఆర్థికావసరాలకు విక్రయించడం, రష్యా నేతల ఆలోచనలకు తగినట్లు యుద్ధ భూమిలో వ్యూహాలు లోపించడం, ఉక్రెయిన్ ప్రతిఘటనను తక్కువగా అంచనా వేయడం, మిలటరీ అగ్రనేతల్లో పేరుకుపోయిన అవినీతి, ఇష్టంలేని యువతను సైన్యంలో బలవంతంగా చేర్చుకోవడం తదితర చర్యలు రష్యా మిలటరీని బలహీనపరిచాయని విశ్లేషిస్తున్నారు. అసలు సమస్యలు ఇవే! సంస్థాగత లోపాలు, ఆయుధాల పేలవ ప్రదర్శన, వైమానిక సమన్వయ లోపం, ఆర్థిక ఇబ్బందులు.. రష్యా భంగపాటుకు కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి రష్యా వ్యూహాత్మకంగా సైనిక బెటాలియన్లను సరిహద్దులకు తరలించడం ఆరంభించింది. రష్యా పంపిన తొలి బెటాలియన్లలో అనుభవం తక్కువగా ఉన్న లేదా కాంట్రాక్టు సైనికులు అధికంగా ఉంటారు. ఇలాంటి బెటాలియన్లు చిన్నతరహా లేదా స్వల్పకాలిక యుద్ధాలకు పనికివస్తారు. కానీ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఈ బెటాలియన్లు వృ«థా అవుతాయి. అలాగే సమన్వయ లోపం రష్యా మిలటరీకి శాపంగా మారింది. కాంట్రాక్టు బెటాలియన్ సైనికులకు, నిజ సైనిక బెటాలియన్‌కు మధ్య సమన్వయం కుదర్చడానికి రష్యా కమాండర్లు నానా తంటాలు పడుతున్నారు. అలాగే మిలటరీ– వైమానిక సిబ్బంది మధ్య కూడా సమన్వయం లోపించింది. దీనివల్ల వైమానిక దాడులతో సాధించే పురోగతిని మిలటరీ కొనసాగించలేకపోయింది. నేలపై శత్రురాడార్ వ్యవస్థలను, డ్రోన్లను అనుకున్న సమయంలో రష్యన్ మిలటరీ ధ్వంసం చేయలేకపోవడం వైమానిక దాడులకు అవరోధంగా మారింది. ఇక సరుకులు, మందుగుండు సరఫరా, రిపైర్ వర్క్‌షాపుల కొరత, వైద్యసాయం అందకపోవడం అన్నింటి కన్నా ప్రధాన సమస్యలుగా మారాయి. యూఎస్ సహా పలు దేశాల ఆంక్షలు రష్యా ఆర్థిక పరిస్థితిని పాతాళానికి తీసుకుపోతున్నాయి. దీనివల్లనే సొంతసైన్యానికి రష్యా తగినంత సాయం అందించలేకపోతోందని కొందరి అంచనా. మరోవైపు ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు భారీగా ఆయుధాలను, నిధులను అందిస్తున్నాయి. దీంతో రష్యాను ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అంతిమ విజయం ఎవరిది? రష్యా వెనుకంజ కేవలం పాశ్చాత్య మీడియా సృష్టని యుద్ధ నిపుణుల్లో కొందరు భావిస్తున్నారు. యుద్ధ సమయంలో కూడా రష్యా సహజవాయు సరఫరా కొనసాగిస్తూనే ఉందని, ఆంక్షలను ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు ముందే తీసుకుందని గుర్తు చేస్తున్నారు. దీనికితోడు చైనా, బెలారస్ వంటి దేశాలు రష్యాకు సాయం చేస్తున్నాయని, భారత్ లాంటి కీలక దేశాలు తటస్థ వైఖరిని అవలంబించడం కూడా రష్యాకు కలిసివచ్చే అంశమని చెబుతున్నారు. ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవడం పుతిన్ ఉద్దేశం కాదని, కేవలం తనకు అనుకూల ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్ ఎంత ప్రతిఘటించినా చివరకు పుతిన్ అనుకున్నది సాధించే తీరతాడని విశ్లేషిస్తున్నారు. త్వరలో ఇరు పక్షాల మధ్య జరిగే చర్చల్లో రష్యాకు అనుకూల ప్రతిపాదనలు రావచ్చని వీరి అంచనా. యుద్ధంలో విధ్వంసకాలు రష్యా వాడుతున్న ఆయుధాలు: 1. ఫాస్ఫరస్ బాంబులు: భారీగా ఫాస్ఫరస్ పొగను విడుదల చేస్తాయి. ఈ రసాయనం గాల్లో విడుదలైనప్పుడు ప్రకాశవంతంగా మండుతుంది. దీనివల్ల శత్రు టార్గెట్లను సులభంగా గుర్తించవచ్చు. అలాగే ఇవి పేలినప్పుడు దగ్గరలో ఉన్న జీవజాలం చర్మంపై బొబ్బలు వస్తాయి. 2. కింజల్ మిసైల్స్: ఇవి హైపర్సోనిక్ క్షిపణులు. మిగ్ విమానం నుంచి ప్రయోగిస్తారు. ధ్వని వేగానికి ఐదురెట్లు వేగంతో పయనిస్తాయి. 2వేల కిలోమీటర్ల పరిధిలో ప్రయోగించవచ్చు. 3. ఇస్కాండర్ మిసైల్: స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు. 500 కిలోమీటర్ల దూరంలో టార్గెట్‌ను కూడా ధ్వంసం చేయగలవు. ఉక్రెయిన్‌పై ఎక్కువగా రష్యా వీటినే ప్రయోగిస్తోంది. ఇవి బంకర్ బస్టర్లుగా, థర్మోబారిక్ బాంబుగా, ఈఎంపీగా ఉపయోగపడతాయి. 4. వాక్యూమ్ బాంబ్: థర్మోబారిక్ బాంబ్ అంటారు. అత్యంత ప్రమాదకరమైన బాంబులు. పేలినప్పుడు భారీ విధ్వంసాన్ని సృష్టిస్తాయి. ప్రయోగప్రాంతంలో ఆక్సిజన్‌ను పీల్చుకొని అత్యంత పెద్ద పేలుడును ఉత్పత్తి చేస్తాయి. 5. క్లస్టర్ బాంబు: ఉక్రెయిన్ స్కూల్‌పై రష్యా ప్రయోగించిందన్న ఆరోపణలున్నాయి. పేలినప్పుడు చిన్న బాంబ్లెట్స్గా మారి చుట్టుపక్కలున్నవారిని గాయపరుస్తాయి. సిరియాలో కూడా రష్యా వీటిని వాడిందన్న విమర్శలున్నాయి. 6. బాంబర్ ప్లేన్స్: ఉక్రెయిన్ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేయడానికి ఉపయోగించారు. వీటి నుంచి మిసైల్స్‌ను, క్లస్టర్ బాంబులను ప్రయోగించవచ్చు. ఉక్రెయిన్ వాడుతున్నవి: 1. జావెలిన్ మిసైల్: ఉక్రెయిన్ వాడుతోంది. యూఎస్ తయారీ. రష్యా మిలటరీ వాహనాలను హడలుగొడుతున్నాయి. ప్రయోగించిన తర్వాత వాటంతటవే టార్గెట్‌ను ఎంచుకోవడం వీటి ప్రత్యేకత. 2. టీబీ2 డ్రోన్: దీన్ని కూడా ఉక్రెయిన్ విరివిగా వాడుతోంది. టర్కీ తయారీ. 27 గంటల పాటు గాల్లో ఉండగలవు. 3. ఎన్ఎల్ఏడబ్ల్యూ: స్వల్ప దూరంలో లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. ఒక్కరే ఆపరేట్ చేయవచ్చు. ఒక్క షాట్‌తో ట్యాంకును మట్టికరిపిస్తుంది. 4. స్టింగర్ మిసైల్: ఉక్రెయిన్‌కు యూఎస్ సరఫరా చేసింది. భూమి మీద నుంచి గాల్లోకి ప్రయోగిస్తారు. వీటివల్లనే రష్యా వైమానిక దళం ఆధిపత్యం ప్రదర్శించలేకపోతోంది. పలు రష్యన్ హెలికాప్టర్లను ఈ క్షిపణులు కూల్చివేశాయి. – నేషనల్ డెస్క్, సాక్షి. -
ఉక్రెయిన్‌పై రష్యా ‘కింజల్’ దాడి..హైపర్ సోనిక్ మిసైల్ అంటే?
ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ప్రపంచదేశాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఇరు దేశాలకు చెందిన వేలాదిమంది సైనికులు, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అందిరినీ కలచివేస్తోంది. ఇక ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో ఎలాగైనా పట్టు సాధించేందుకు రష్యా అణు దాడి చేస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అణ్వాయుధాలనూ మోసుకుపోగల కింజల్‌ను రష్యా యుద్ధంలో తొలిసారి ప్రయోగించడంతో భయాలు రెట్టింపయ్యాయి. ఈక్రమంలో హైపర్ సోనిక్ క్షిపణి కింజల్ గురించి, ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల వద్ద ఈ తరహా క్షిపణులు ఉన్నాయో తెలుసుకుందాం... హైపర్ సోనిక్ మిసైళ్లను ఎదుర్కొనే రక్షణ వ్యవస్థలను ఇప్పటివరకు ఎవరూ తయారు చేయలేదని నిపుణులు అంటున్నారు. అమెరికా, రష్యా, చైనా దగ్గర అత్యాధునిక హైపర్ సోనిక్ మిసైళ్లున్నాయి. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు ఈ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. రష్యా సాయంతో కలిసి ఇండియా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్‌ను తయారు చేస్తోంది. సూపర్ సోనిక్ అంటే ధ్వని వేగం కన్నా ఎక్కువ వేగం (మాక్ 2 నుంచి 3)తో దూసుకెళ్లేవి. బ్రహ్మోస్ 2 హైపర్ సోనిక్ మిసైల్‌ను కూడా ఇండియా తయారు చేస్తోంది. హైపర్ సోనిక్ అని ఎందుకంటారు? ధ్వని వేగం కన్నా 5 రెట్లు ఎక్కువ వేగంతో వెళ్తే హైపర్ సోనిక్ అంటారు. ధ్వని వేగం గంటకు 1,234 కిలోమీటర్లు. మాక్ 5తో వెళ్లే మిసైళ్ల వేగం గంటకు దాదాపు 6 వేల కిలోమీటర్లకు పైనే ఉంటుందన్నమాట. మామూలుగా మిసైళ్లను బాలిస్టిక్, క్రూయిజ్ అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఈ హైపర్ సోనిక్ మిసైల్ క్రూయిజ్ మిసైళ్ల వర్గానికి చెందింది. హైపర్ సోనిక్ మిసైళ్లు లక్ష్యాన్ని ఛేదించే వరకు శక్తితోనే (ఇంధనం) నడుస్తుంటాయి. భూ వాతావరణంలోనే ఉంటూ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. పరావలయ మార్గంలో వెళ్లినా అవసరమైతే దిశను మార్చుకోవడం వీటి ప్రత్యేకత. ఇవి తక్కువ బరువునే మోసుకెళ్లగలవు. కింజల్ ప్రత్యేకతలు పేరు: కేహెచ్ 47ఎం2 కింజల్ వేగం: గంటకు 12 వేల కిలోమీటర్లకు పైనే పరిధి: 1,500 కిలోమీటర్ల నుంచి 2 వేల కిలోమీటర్లు ఎంత బరువును మోసుకెళ్లగలదు: 500 కిలోలు సంప్రదాయ, అణు బాంబులను ప్రయోగించవచ్చు – సాక్షి సెంట్రల్ డెస్క్