సుదూర శ్రేణి హైపర్‌సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం | DRDO Conducts Successful Flight Trial Of Long Range Hypersonic Missile, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

సుదూర శ్రేణి హైపర్‌సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం

Published Sun, Nov 17 2024 9:59 AM | Last Updated on Sun, Nov 17 2024 11:39 AM

DRDO Conducts Successful Flight Trial of Long Range Hypersonic Missile

న్యూఢిల్లీ: సుదూర శ్రేణి హైపర్‌ సోనిక్‌ క్షిపణిని భారత్‌ రక్షణ పరిశోధన, అభివృద్ది సంస్థ (డీఆర్‌డీఓ) ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఈ హైపర్‌ సోనిక్ క్షిపణిని భారత సాయుధ దళాలలో వివిధ సేవలను అందించేందుకు రూపొందించారు.

ఈ క్షిపణి 1,500 కి.మీకి మించిన పరిధి వరకూ వివిధ పేలోడ్‌లను మోసుకెళ్లగలదు. పలు డొమైన్‌లలో అమర్చిన వివిధ రేంజ్ సిస్టమ్‌ల ద్వారా ఈ క్షిపణిని ట్రాక్ చేశారు. డౌన్ రేంజ్ షిప్ స్టేషన్‌ల నుండి అందిన డేటా ప్రకారం ఈ క్షిపణి అధిక ఖచ్చితత్వంతో తన ప్రభావాన్ని నిర్ధారించింది.

ఈ క్షిపణిని హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌లోని ప్రయోగశాలలు, డీఆర్‌డీఓకి చెందిన ఇతర ప్రయోగశాలలు, పరిశ్రమ భాగస్వాములతో స్వదేశీయంగా అభివృద్ధి చేశారు. డీఆర్‌డీఓతో పాటు సాయుధ దళాలకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తల సమక్షంలో  ఈ క్షిపణి పరీక్ష జరిగింది. ఈ క్షిపణ పరీక్ష అధునాతన హైపర్‌సోనిక్ క్షిపణి సాంకేతికతను కలిగి ఉన్న దేశాలలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేసింది. ఈ క్షిపణి భారతదేశంలో పెరుగుతున్న స్వావలంబనను ‘మేక్ ఇన్ ఇండియా’పై  ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది.
 

డీఆర్‌డీఓ సాధించిన ఈ విజయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసించారు. దేశానికి ఇది చారిత్రాత్మక ఘట్టమని ఆయన అభివర్ణించారు. ఈ చారిత్రాత్మక విజయంలో  భాగస్వాములైన డీఆర్‌డీఓ బృందం, సాయుధ దళాలు, పరిశ్రమ భాగస్వాములను ఆయన అభినందించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి సుదూర శ్రేణి హైపర్‌సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడంతో భారతదేశం మరో ఘన విజయాన్ని సాధించిందన్నారు. హైపర్‌సోనిక్ క్షిపణులు గంటకు 6,174 కి.మీ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement