ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ప్రపంచదేశాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఇరు దేశాలకు చెందిన వేలాదిమంది సైనికులు, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అందిరినీ కలచివేస్తోంది. ఇక ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో ఎలాగైనా పట్టు సాధించేందుకు రష్యా అణు దాడి చేస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అణ్వాయుధాలనూ మోసుకుపోగల కింజల్‌ను రష్యా యుద్ధంలో తొలిసారి ప్రయోగించడంతో భయాలు రెట్టింపయ్యాయి. ఈక్రమంలో హైపర్ సోనిక్ క్షిపణి కింజల్ గురించి, ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల వద్ద ఈ తరహా క్షిపణులు ఉన్నాయో తెలుసుకుందాం...
హైపర్ సోనిక్ మిసైళ్లను ఎదుర్కొనే రక్షణ వ్యవస్థలను ఇప్పటివరకు ఎవరూ తయారు చేయలేదని నిపుణులు అంటున్నారు. అమెరికా, రష్యా, చైనా దగ్గర అత్యాధునిక హైపర్ సోనిక్ మిసైళ్లున్నాయి. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు ఈ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. రష్యా సాయంతో కలిసి ఇండియా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్‌ను తయారు చేస్తోంది. సూపర్ సోనిక్ అంటే ధ్వని వేగం కన్నా ఎక్కువ వేగం (మాక్ 2 నుంచి 3)తో దూసుకెళ్లేవి. బ్రహ్మోస్ 2 హైపర్ సోనిక్ మిసైల్‌ను కూడా ఇండియా తయారు చేస్తోంది.
హైపర్ సోనిక్ అని ఎందుకంటారు?
ధ్వని వేగం కన్నా 5 రెట్లు ఎక్కువ వేగంతో వెళ్తే హైపర్ సోనిక్ అంటారు. ధ్వని వేగం గంటకు 1,234 కిలోమీటర్లు. మాక్ 5తో వెళ్లే మిసైళ్ల వేగం గంటకు దాదాపు 6 వేల కిలోమీటర్లకు పైనే ఉంటుందన్నమాట. మామూలుగా మిసైళ్లను బాలిస్టిక్, క్రూయిజ్ అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఈ హైపర్ సోనిక్ మిసైల్ క్రూయిజ్ మిసైళ్ల వర్గానికి చెందింది. హైపర్ సోనిక్ మిసైళ్లు లక్ష్యాన్ని ఛేదించే వరకు శక్తితోనే (ఇంధనం) నడుస్తుంటాయి. భూ వాతావరణంలోనే ఉంటూ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. పరావలయ మార్గంలో వెళ్లినా అవసరమైతే దిశను మార్చుకోవడం వీటి ప్రత్యేకత. ఇవి తక్కువ బరువునే మోసుకెళ్లగలవు.
కింజల్ ప్రత్యేకతలు
పేరు: కేహెచ్ 47ఎం2 కింజల్
వేగం: గంటకు 12 వేల కిలోమీటర్లకు పైనే
పరిధి: 1,500 కిలోమీటర్ల నుంచి 2 వేల కిలోమీటర్లు
ఎంత బరువును మోసుకెళ్లగలదు: 500 కిలోలు
సంప్రదాయ, అణు బాంబులను ప్రయోగించవచ్చు
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment