న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై యుద్ధంతో ప్రపంచ దేశాల ఆర్థిక ఆంక్షలకు గురైన రష్యాకి, మిత్ర దేశాలైన భారత్, చైనా చేదోడుగా నిలుస్తున్నాయి. మే నెలలో రష్యా ఎగుమతి చేసిన చమురులో 80 శాతం ఈ రెండు దేశాలే కొనుగోలు చేసినట్టు అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) ప్రకటించింది. ‘‘మార్కెట్ కంటే తక్కువకు వచ్చే రష్యా చమురు కొనుగోలుకు ఆసియాలో కొత్త కొనుగోలుదారులు లభించారు. భారత్ రోజువారీ కొనుగోళ్లు 2 మిలియన్ బ్యారెళ్లకు మించింది.
చైనా రోజువారీ కొనుగోళ్లను 0.5 మిలియన్ బ్యారెళ్ల నుంచి 2.2 మిలియన్ బ్యారెళ్లకు పెంచింది’’అని ఐఈఏ తన తాజా నివేదికలో ప్రస్తావించింది. మే నెలలో భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా 45 శాతం సమకూర్చగా, చైనాలో ఇది 20 శాతంగా ఉన్నట్టు వివరించింది. రష్యా సముద్రపు ముడి చమురులో 90 శాతం ఆసియాకు వెళ్లిందని, యుద్ధానికి ముందు ఇది 34 శాతంగా ఉండేదని వివరించింది. ‘‘ఏప్రిల్ నెలతో పోలిస్తే భారత్ మే నెలలో 14 శాతం అధికంగా చమురుని రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. మే నెల మొదటి మూడు వారాల్లో సగటు రష్యా చమురు బ్యారెల్ 26 డాలర్లుగా ఉంది’’ అని వివరించింది.
భారత్ జీడీపీ 4.8 శాతం
భారత్ జీడీపీ 2023 సంవత్సరంలో 4.8 శాతం వృద్ధి సాధిస్తుందని ఐఈఏ అంచనా వేసింది. 2024లో ఇది 6.3 శాతానికి చేరుతుందని, తదుపరి 2025 నుంచి 2028 మధ్య 7 శాతంగా ఉంటుందని పేర్కొంది. జనాభా పెరుగుదుల, మధ్య తరగతి విస్తరణ సానుకూలమని భావించింది. ప్రపంచ చమురు వినియోగ డిమాండ్‌లో చైనాను భారత్ 2027లో వెనక్కి నెట్టేస్తుందని అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment