మాస్కో: తిరుగుబాటు నాయకుడు యెవ్జెనీ ప్రిగోజిన్ పై ఉన్న క్రిమినల్ కేసును ఉపసంహరించుకునే విధంగా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకో జరిపిన మధ్యవర్తిత్వం ఫలించింది. దీంతో మాస్కో వైపుగా కదులుతామని హెచ్చరించిన వాగ్నర్ తిరుగుబాటు సైన్యం శాంతించి తిరుగుముఖం పట్టింది.
క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ మాట్లాడుతూ రక్తపాతాన్ని నిరోధించి, అంతర్గత ఘర్షణలను తగ్గుముఖం పట్టించి, పరిస్థితులు తీవ్ర పరిణామాలకు దారితీయకుండా చూడాలన్నదే మా ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సందర్బంగా దేశం కోసం వారు చేసిన వీరోచిత పోరాటాలను మేమెప్పుడూ గౌరవిస్తామని అన్నారు.
బెలారస్ అధ్యక్షుడు లుకాశెంకో జరిపిన ఈ మధ్యవర్తిత్వం ప్రకారం వాగ్నర్ సైన్యం నాయకుడు యెవ్జెనీ ప్రిగోజిన్ పై ఉన్న క్రిమినల్ కేసును ఎత్తివేస్తున్నట్లుగానూ, అలాగే వాగ్నర్ సైనికులపై ఎలాంటి విచారణ కూడా ఉండదని పెస్కోవ్ అన్నారు. ఇక ఈ తిరుగుబాటులో పాల్గొనని సైనికులు యధాతధంగా తమ విధులకు హాజరవ్వొచ్చని తెలిపారు.
యెవ్జెనీ ప్రిగోజిన్ పై తీవ్రవాద నేరం మోపబడ్డ గంటల వ్యవధిలోనే అతని తిరుగుబాటు సైన్యం రష్యాలో ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిందే. శనివారం రష్యా సైన్యంపై చేసిన తిరుగుబాటుకి దక్షిణ రష్యా అట్టుడికిపోయింది.
అప్పటికే ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని ఉత్తర రష్యా వైపుగా వస్తున్నామని ప్రిగోజిన్ ప్రకటించారు. దీంతో మరింత విధ్వంసం తప్పదని భావించిన తరుణంలో రష్యా మిత్రపక్షమైన బెలారస్ అధ్యక్షుడు లుకాశెంకో చొరవ తీసుకుని జరిపిన మధ్యవర్తిత్వం ఫలించడంతో ఊపిరి తీసుకున్నాయి రష్యా శ్రేణులు.
ఇది కూడా చదవండి: ఈజిప్టుకు చేరుకున్న ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment