ఎయిర్ టెల్ గుడ్ న్యూస్ చెప్పింది..
ముంబై: రిలయన్స్ జియోనుంచి పెరిగిన ఒత్తిడి నేపథ్యంలో భారతి ఎయిర్ టేల్ యూజర్లకు శుభవార్త అందించింది. అంచనాల కనుగుణంగానే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కాల్,డ్యాటా చార్జీలు బెడద లేకుండా మొబైల్ సేవలను అనుభవించవచ్చని మార్కెట్ లీడర్ ఎయిర్ టెల్ సోమవారం ప్రకటించింది. ఏప్రిల్ 1 2017నుంచి ఇది అమల్లోకి రానున్నట్టు ఎయిర్ టెల్ తెలిపింది.
మొబైల్ సేవలలో ఎదురవుతున్న పోటీని ఎదుర్కోవడంలో భాగంగా దేశవ్యాప్తంగా రోమింగ్ కాల్స్‌కు ప్రీమియం చార్జీల రద్దు చేస్తున్నట్టు భారతి ఎండీ, సీఈవో గోపాల్ మిట్టల్ ప్రకటించారు. ఏ దేశంలోఅడుగుపెట్టినా తమ యూజర్లు తమ మొబైల్ ఫోన్లను ఆన్ లో ఉంచుకోవచ్చని తద్వారా మొబైల్ నెట్ వర్క్‌లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నట్టు చెప్పారు. తమ వినియోగదారులు ప్రపంచంలోని ప్రతి మూలలో ఎయిర్ టెల్ నెంబర్ ను అనుమతించేలా అంతర్జాతీయ రోమింగ్ రూపంలో భారీ మార్పులు తీసుకొస్తున్నామని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీ ఆపరేటర్లు ధర అడ్డంకులను తొలగించడానికి సహకరించాలనీ, అన్యాయమైన బిల్లుల భయం లేకుండా కనెక్ట్ అయ్యేలా వినియోగదారులకు ఆఫర్లను అందించాలని కోరారు.
ఈ సందర్భంగా వినియోగదారులకు కాల్ మరియు డేటా వినియోగం కోసం ఆకర్షణీయమైన మూడుప్యాకేజీలను ప్రకటించింది. 1, 5, 30రోజుల పథకాలను అందుబాటులోకి తెచ్చింది. పాపులర్ డిస్టినేషన్లలో కాల్ చార్జీలను నిమిషానికి మూడు రూపాయలతో 90 శాతం, 3 ఎంబీ డాటాతో డేటా ఛార్జీలను 99 శాతం తగ్గించినట్టు ఎయిర్ టెల్ చెప్పింది. రూ.649 యూసేజ్దాటిన అమెరికావెళ్లే భారతీయ యూజర్లు ఆటోమేటిగ్గా వన్డే ప్యాక్ లోకి మారతారని, తద్వారా ఉచిత ఇన్ కమింగ్కాల్స్, ఎస్ఎంఎస్లతో పాటు 100 నిమిషాల ఇండియా, అమెరికా లోకల్ టాక్ టైం, 300ఎంబీ డాటా పొందుతారని తెలిపింది. అలాగే సింగపూర్ వెళ్లే (రూ.499) కస్టమర్ కూడా వన్ డేప్యాక్ కు తరలిస్తామని తెలిపింది.
దీంతో రోమింగ్‌లో ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లను కూడా ఉచితం. అంతేకాదు డేటా రోమింగ్ చార్జీలూ ఉండబోవు. ఈ వార్తల నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో భారతీ దాదాపు 3 శాతం నష్టపోయింది.