
పరిష్కరించుకోవాల్సిన అంశాలున్నాయి: పుతిన్
మాస్కో: నెలల తరబడి రక్తమోడుతున్న ఉక్రెయిన్ రణక్షేత్రాల్లో శాంతి పవనాలు వీయొచ్చనే ఆశలు రేకెత్తుతున్నాయి. అమెరికా ప్రతిపాదించిన ‘30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం’ సుసాధ్యమయ్యేలా ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు. మాస్కో నగరంలో గురువారం పత్రికా సమావేశంలో పుతిన్ మాట్లాడారు. ‘‘ తొలుత 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం జరగాలంటూ అమెరికా చేస్తున్న ప్రతిపాదన అద్భుతంగా ఉంది. సబబైంది కూడా.
ఈ ప్రతిపాదనకు మేం సూత్రప్రాయంగా, సైద్ధాంతికంగా అంగీకారం తెలుపుతున్నాం. అయితే యుద్ధంలో ఇంకా పరిష్కరించుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. వాటిని చర్చించాలి’’ అని పుతిన్ అన్నారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కోఫ్ మాస్కో నగరానికి గురువారం విచ్చేసిన వేళ కాల్పుల విరమణ ప్రతిపాదనకు పుతిన్ సానుకూలంగా స్పందించడం గమనార్హం. ‘‘అమెరికా మిత్రులు, సంబంధిత భాగస్వాములతో రష్యా ఈ విషయమై విస్తృతస్థాయిలో సమాలోచనలు చేయాల్సి ఉంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడకుండా, ఉల్లంఘనలు జరక్కుండా చూసుకునే ఒక వ్యవస్థను తొలుత సిద్ధంచేయాలి. దీంతోపాటు ఈ 30 రోజుల కాల్పుల విరమణ సమయాన్ని ఉక్రెయిన్ దుర్వినియోగం చేయకుండా చూడాలి. అంటే ఈ 30 రోజుల్లో సరిహద్దులకు అదనపు బలగాలను మొహరించడం, మరింతగా ఆయుధాలను సమకూర్చుకోవడం వంటివి చేయకుండా నిరోధించాలి.
యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపాలనే ప్రతిపాదనలను మేం అంగీకరిస్తాం. అయితే ఈ తాత్కాలిక కాల్పుల విరమణ అనేది శాశ్వత శాంతికి బాటలు వేయాలి. ఈ సంక్షోభానికి మూలాలను తొలగించగలగాలి. యుద్ధానికి శాశ్వతంగా తెరపడాలి’’ అని పుతిన్ అన్నారు. సంక్షోభానికి మూలకారణాలను రూపుమాపాలని పుతిన్ గతంలోనూ వ్యాఖ్యానించారు. జెలెన్‌స్కీ సారథ్యంలో కొలువుతీరిన ప్రభుత్వం సైతం సంక్షోభానికి కారణమని పుతిన్ గతంలో పరోక్షంగా అన్నారు. నాటో విస్తరణతోపాటు ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇచ్చే ప్రతిపాదననూ పుతిన్ వ్యతిరేకిస్తున్నారు.
థాంక్యూ ట్రంప్
‘‘ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం వెతికేందుకు శతథా కృషిచేస్తూ, ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టిసారించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నా కృతజ్ఞతలు. ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు తమ వంతు కృషిచేస్తున్న చైనా, భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా అగ్రనేతలకూ నా కృతజ్ఞతలు’’ అని పుతిన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment