రక్షణ మంత్రిని తొలగించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు  | Ukrainian President Zelensky Sacks Wartime Defence Minister Reznikov | Sakshi
Sakshi News home page

రక్షణ మంత్రిని తొలగించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ

Published Mon, Sep 4 2023 8:52 PM | Last Updated on Mon, Sep 4 2023 9:13 PM

Ukrainian President Zelensky Sacks Wartime Defence Minister Reznikov - Sakshi

క్యివ్: రష్యాతో జరుగుతున్న యుద్ధం నేపధ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యివ్ రక్షణ శాఖ మంత్రి బాధ్యతల నుండి ఒలెక్సి రెజ్‌నికోవ్‌ను తప్పిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఆయన స్థానంలో రుస్తెం ఉమెరోవ్‌ను నూతన రక్షణశాఖ మంత్రిగా నియమిస్తున్నట్లు ప్రకటించి ఇది రక్షణశాఖలో సరికొత్త విధానాన్ని అమలుచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అధ్యక్షుడి నిర్ణయం ప్రకటించిన తర్వాత రెజ్‌నికోవ్‌ తన రాజీనామాను పార్లమెంటుకు సమర్పించారు.  

యధాప్రకారం సాయంత్రం జరిగే మీడియా సమావేశంలో వ్లాదిమిర్ జెలెన్‌స్కీ మాట్లాడుతూ..  ఒలెక్సి రెజ్‌నికోవ్‌ రష్యాతో యుద్ధం మొదలైన నాటి నుండి దాదాపు 550 రోజులు యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కానీ ప్రస్తుతం రక్షణశాఖలో సరికొత్త విధానాన్ని అనుసరించాల్సిన అవసరముందని అందుకే క్రిమియా రాష్ట్ర సంపద నిధుల సంరక్షకుడిగా వ్యవహరిస్తున్న ఉమెరోవ్‌కు రక్షణశాఖ బాధ్యతలు అప్పచెబుతున్నామని అన్నారు. పార్లమెంట్ ఉమేరోవ్ అభ్యర్ధిత్వాన్ని ఆమోదిస్తుందని భావిస్తున్నామన్నారు.

 
ఉక్రెయిన్ అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయం ఉక్రెయిన్ రక్షణశాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 2022లో రష్యాతో యుద్ధం మొదలైన నాటి నుండి ఒలేక్సి రెజ్‌నికోవ్‌ పాశ్చాత్య దేశాల నుండి బిలియన్ డాలర్ల సహాయాన్ని పొందడంలో కీలక పాత్ర పోషించారు. కానీ రక్షణశాఖలో అంతర్గత ఆరోపణలు పెచ్చుమీరడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

అధ్యక్షుడి నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదిస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి. కానీ రెజ్‌నికోవ్‌ను ఉన్నట్టుండి బాధ్యతల నుండి తప్పించడాన్నే మీడియా హైలైట్ చేస్తూ రెజ్‌నికోవ్‌కు వేరే బాధ్యతలు ఏమైనా అప్పగిస్తున్నారా అన్నది అధ్యక్షుడే తెలపాల్సి ఉంటుంది. రక్షణశాఖలో భారీగా జరుగుతున్న అవినీతి నేపధ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు చేసే వారు కూడా లేకపోలేదు. అంతర్జాతీయ అవినీతి దేశాల జాబితాలో ఉక్రెయిన్ 180 దేశాల్లో 116 వ స్థానంలో ఉంది. అవినీతి విషయంలో ఒకప్పటితో పోలిస్తే ఉక్రెయిన్ ఇప్పుడు చాల మెరుగయ్యిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: జీ20 సదస్సుకు జిన్‌పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement