ఉక్రెయిన్ అమ్ములపొదిలో కొత్త అస్త్రం
తమ భూభాగాన్ని దురాక్రమించిన రష్యా సైన్యంతో నెలల తరబడి అలుపెరగక పోరాడుతున్న ఉక్రెయిన్ బలగాల చేతికి కొత్త అస్త్రమొచ్చింది. రష్యా స్థావరాలపై భారీ స్థాయిలో మంటలు చిమ్ముతూ, పొగ వెదజల్లే కొత్త తరహా డ్రోన్‌ను ఉక్రెయిన్ యుద్ధరంగంలోకి దింపింది. అటవీప్రాంతాల్లో నక్కిన రష్యా సైనికులు, వారి యుద్ధట్యాంకులపైకి బుల్లి డ్రోన్లు ఏకధాటిగా నిప్పులు వెదజల్లుతున్న వీడియోను ఉక్రెయిన్ రక్షణ శాఖ ‘ఎక్స్’లో విడుదలచేయడంతో ఈ డ్రోన్‌ల సంగతి అందరికీ తెల్సింది. రణరీతులను మార్చేస్తున్న అధునాతన డ్రాగన్ డ్రోన్ గురించి అంతటా చర్చమొదలైంది.
ఏమిటీ డ్రాగన్ డ్రోన్?
చైనాలో జానపథ గాథల్లో డ్రాగన్ పేరు ప్రఖ్యాతిగాంచింది. నిప్పులు కక్కుతూ ఆకాశంలో చక్కర్లు కొట్టే డ్రాగన్ గురించి అందరికీ తెలుసు. అచ్చం అలాగే నిప్పులను వెదజల్లుతూ ఆకాశంలో దూసుపోతుంది కాబట్టే ఈ డ్రోన్‌కు డ్రాగన్ అని పేరు పెట్టారు. సంప్రదాయక డ్రోన్లకు భిన్నంగా పనిచేస్తున్న ఈ డ్రోన్లతో రష్యా బలగాలకు నష్టం పెద్దగా ఉంటుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
ఈ డ్రోన్ ప్రత్యేకత ఏంటి?
థర్మైట్ ఈ డ్రోన్‌లో ఉన్న ఏకైక ఆయుధం. అత్యధికంగా మండే స్వభావమున్న ఖనిజాన్ని, అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్ పొడి, ఇంకొంచెం ఇనుప రజను మిశ్రమాన్ని మందుగుండుగా వాడతారు. అయితే మిగతా డ్రోన్లలాగా ఇది పేలే బాంబును లక్ష్యంగాపైకి జాడవిడచదు. తనలోని మిశ్రమాన్ని మండించి తద్వారా విడుదలయ్యే మంటను కొంచెం కొంచెంగా అలా దారి పొడవునా వెదజల్లుకుంటూ పోతుంది. ఊపిరి ఆడకుండా దట్టమైన పొగను సైతం వెదజల్లుతుంది.
ద్రవరూపంలోకి వారిన ఖనిజం మండుతూ ఏకంగా 4,000 డిగ్రీ ఫారన్‌హీట్ వేడిని పుట్టిస్తుంది. ఇంతటి వేడి శత్రు స్థావరాలను కాల్చేస్తుంది. ఈ ద్రవఖనిజం మీద పడితే మిలటరీ గ్రేడ్ ఆయుధాలు ఏవైనా కరిగిపోతాయి. సముద్రతీర ప్రాంతాల్లో నీటి అడుగున నక్కిన శత్రువుల ఆయుధాలను ఇది కాల్చేస్తుంది. ఎందుకంటే ఇది నీటిలో కూడా మండగలదు. ఇది మీద పడితే సైనికుల శరీరం, ఎముకలు కాలిపోతాయి. మరణం దాదాపు తథ్యం. ఒకవేళ తృటిలో తప్పించుకున్నా మానసిక సమస్యలు
ఎదుర్కొంటారు.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
థర్మైట్ ఆయుధంతోపాటు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యంపైకి దూసుకెళ్లడం ఈ డ్రాగన్ డ్రోన్ ప్రత్యేకత. సంప్రదాయక రక్షణ ఉత్పత్తులతో పోలిస్తే ఇది అత్యంత ప్రమాదకరమైందని బ్రిటన్‌లోని యుద్ధవ్యతిరేక దౌత్య సంస్థ ‘యాక్షన్ ఆన్ ఆర్మ్‌డ్ వయలెన్స్’ పేర్కొంది. దాడి చేయడంతో పాటు నిఘా పనులూ ఇవి ఒకే సమయంలో పూర్తిచేయగలవు. ఎందుకంటే వీటికి స్పష్టమైన కెమెరాలను బిగించారు. యుద్ధట్యాంక్, సైనికుడు, మరేదైనా స్థావరం.. ఇలా శత్రువుకు సంబంధించిన దేనిపై దాడి చేస్తుందో కెమెరాలో ఉక్రెయిన్ బలగాలు స్పష్టంగా చూడొచ్చు.
అంకుర సంస్థ చేతిలో..
ఈ డ్రాగన్ డ్రోన్‌ను ఉక్రెయిన్‌లోని స్టార్టప్ సంస్థ ‘స్టీల్ హార్నెట్స్’ తయారుచేసినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ తయారుచేసిన శక్తివంతమైన థరై్మట్ సాయంతో 4 మిల్లీమీటర్ల మందమైన లోహ ఉపరితలానికి సైతం కేవలం 10 సెకన్లలో రంధ్రం పడుతుందని తెలుస్తోంది. యుద్దం మొదలైననాటి నుంచి ఉక్రెయిన్‌కు అన్ని రకాల ఆయుధాలు అందిస్తూ అమెరికా ఆదుకుంటోంది. అమెరికా తన అమ్ములపొదిలోని థర్మైట్ గ్రనేడ్లను ఉక్రెయిన్‌కు ఇస్తోందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అమెరికా ఇస్తేగనక రష్యా సైతం ఇలాంటి ఆయుధాలనే ప్రయోగించడం ఖాయం.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment