ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం? | Russia-Ukraine war: Ukraine fires US-made longer-range missiles into Russia | Sakshi
Sakshi News home page

Russia-Ukraine war: కమ్ముకుంటున్న అణు మేఘాలు

Published Wed, Nov 20 2024 4:46 AM | Last Updated on Wed, Nov 20 2024 11:19 AM

Russia-Ukraine war: Ukraine fires US-made longer-range missiles into Russia

శరవేగంగా నాటకీయ పరిణామాలు

రష్యాపైకి ఉక్రెయిన్‌ దీర్ఘ శ్రేణి క్షిపణులు 

అమెరికా అనుమతించిన మర్నాడే దాడులు 

మండిపడ్డ పుతిన్, అణు దాడులకు నిర్ణయం! 

ఉక్రెయిన్‌–అమెరికా సంయుక్త దాడిగా పరిగణన 

ఆ మేరకు రష్యా అణు విధానానికి సవరణలు 

అణుయుద్ధం రావచ్చు, సిద్ధంగా ఉండండి 

ప్రజలకు నాటో సభ్య దేశాల ‘వార్‌ గైడ్‌లైన్స్‌’ 

ఇంటింటికీ కరపత్రాలు, హెచ్చరిక మెయిళ్లు

రష్యాపై యూఎస్‌ తయారీ దీర్ఘశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులతో ఉక్రెయిన్‌ దాడులు. తీవ్రస్థాయిలో మండిపడుతున్న రష్యా. దీన్ని అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణిస్తామని ప్రకటన. అణు దాడితో దీటుగా బదులిచ్చేందుకు వీలుగా రష్యా అణు విధానాన్ని సవరిస్తూ అధ్యక్షుడు పుతిన్‌ నిర్ణయం. 

‘ఏ క్షణాన్నయినా అణు యుద్ధం ముంచుకు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి’ అంటూ ప్రజలకు యూరప్‌ దేశాల ‘వార్‌ గైడ్‌లైన్స్‌’. సోమవారం ఒక్క రోజే శరవేగంగా జరిగిన తీవ్ర ఆందోళనకర పరిణామాలివి! 

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి తెర తీసి సరిగ్గా 1,000 రోజులు పూర్తయిన నాడే చోటుచేసుకున్న ఈ తీవ్ర పరిణామాలు గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే నాల్కలు చాస్తున్న యుద్ధ జ్వాలలు మరింతగా విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్న ఆందోళనలు సర్వత్రా తలెత్తుతున్నాయి.

అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ విజయంతో ఉక్రెయిన్‌ యుద్ధానికి తెర పడుతుందని, పశ్చిమాసియా కల్లోలమూ కాస్త అదుపులోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇందుకు బీజం పడింది. 

అమెరికా అందజేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాలో సుదూర లక్ష్యాలపై దాడుల నిమిత్తం వాడేందుకు ఉక్రెయిన్‌కు ఆయన అనుమతివ్వడం ఒక్కసారిగా ఉద్రిక్తతలను రాజేసింది. దీన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఉక్రెయిన్‌ మంగళవారమే రష్యాపై యూఎస్‌ దీర్ఘశ్రేణి ఆర్మీ టాక్టికల్‌ మిసైల్‌ సిస్టం (ఏటీఏసీఎంస్‌) బాలిస్టిక్‌ క్షిపణులను ఎడాపెడా ప్రయోగించింది. రష్యాలోని బ్రయాన్‌స్క్‌ ప్రాంతమే లక్ష్యంగా దాడులకు దిగింది. 

ఈ క్షిపణులను ఉక్రెయిన్‌ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి. అలాంటి చర్యలకు దిగితే తీవ్రస్థాయి ప్రతిస్పందన తప్పదని ఇప్పటికే హెచ్చరించిన రష్యా ఈ పరిణామంపై భగ్గుమంది. తమ భూభాగాలపైకి కనీసం ఆరు అమెరికా తయారీ ఏటీఏసీఎంఎస్‌ క్షిపణులు వచ్చి పడ్డాయని ధ్రువీకరించింది. వాటిలో ఐదింటిని కూల్చేయడంతో పాటు ఆరో దాన్నీ ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. 

ఉక్రెయిన్‌పై రష్యా అణు దాడులు! 
తాజా పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మండిపడుతున్నారు. మంగళవారం ఆయన రక్షణ తదితర శాఖల అత్యున్నత స్థాయి అధికారులతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌ క్షిపణి దాడులను అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణించాలని నిర్ణయించారు. అందుకు వీలు కలి్పంచేలా దేశ అణు విధానానికి సవరణ కూడా చేశారు! 

దాని ప్రకారం సంప్రదాయ ఆయుధాలతో రష్యాపై జరిగే దాడికి ఏ అణ్వాయుధ దేశమైనా మద్దతిస్తే దాన్ని ఆ రెండు దేశాల సంయుక్త దాడిగానే పరిగణిస్తారు. సదరు దేశాలపై అణు దాడులకు దిగుతారా అన్నదానిపై సవరణలో స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే రష్యాపై భారీ స్థాయి వైమానిక, బాలిస్టిక్, క్రూయిజ్‌ క్షిపణి దాడులు జరిగితే అణ్వాయుధాలతో బదులిచ్చేందుకు అది వీలు కలి్పస్తుండటం విశేషం! అంతేగాక మిత్ర దేశమైన బెలారస్‌పై దుందుడుకు చర్యలకు దిగినా అణ్వాయుధాలతో బదులు చెప్పేందుకు తాజా సవరణ అనుమతించనుంది! 

ఉక్రెయిన్‌కు మరింత సాయం చేయకుండా యూరప్‌ దేశాలను నియంత్రించడంతో పాటు అవసరమైతే దానిపై అణ్వాయుధ ప్రయోగానికి, అమెరికాపై సైనిక చర్యకు కూడా దిగడం పుతిన్‌ తాజా నిర్ణయాల ఉద్దేశమని భావిస్తున్నారు. అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులతో ఉక్రెయిన్‌ చేసిన తాజా దాడులకు బదులుగానే అణు విధాన సవరణ జరిగిందా అన్న ప్రశ్నకు క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్‌ నేరుగా బదులివ్వలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా అణు విధానాన్ని అప్‌డేట్‌ చేయాల్సిందిగా పుతిన్‌ ఆదేశించారంటూ నర్మగర్భంగా స్పందించారు. 

ఇటీవలి కాలంలో రష్యా అణు విధానానికి పుతిన్‌ సవరణ చేయడం ఇది రెండోసారి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా సైన్యం కూడా ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొంటుండటం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అమెరికా ఇప్పటికే ప్రకటించింది. దీర్ఘశ్రేణి క్షిపణుల వాడకానికి అనుమతి దాని పర్యవసానమేనంటున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ జ్వాలలు త్వరలో కొరియా ద్వీపకల్పం దాకా విస్తరించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బైడెన్‌ మతిలేని విధానాలతో ట్రంప్‌ పగ్గాలు చేపట్టే నాటికే ప్రపంచాన్ని పెనుయుద్ధం ముంగిట నిలిపేలా ఉన్నారని ఆయన కుమారుడు జూనియర్‌ ట్రంప్‌ మండిపడటం తెలిసిందే.

నిత్యావసరాలు నిల్వ చేసుకోండి
తాజా పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కన్పిస్తుండటంతో యూరప్‌ దేశాలు భీతిల్లుతున్నాయి. అలాంటి పరిస్థితే తలెత్తితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ స్వీడన్, ఫిన్లండ్, నార్వే, డెన్మార్క్‌ తదితర నాటో సభ్య దేశాలు తమ పౌరులను హెచ్చరించడం విశేషం. ‘‘ఏ క్షణంలోనైనా అణు యుద్ధం ముంచుకు రావచ్చు. సిద్ధంగా ఉండండి’’ అంటూ స్వీడన్‌ ఏకంగా ఇంటింటికీ కరపత్రాలే పంచుతోంది. ‘సంక్షోభమో, యుద్ధమో వస్తే...’ అనే శీర్షికతో కూడిన 52 లక్షల కరపత్రాలను సోమవారం నుంచి వారం పాటు పంచనుంది! 

అది నిజానికి 32 పేజీలతో కూడిన డాక్యుమెంట్‌. ‘‘మనపై ఎవరైనా దాడికి తెగబడితే దేశ స్వాతంత్య్ర పరిరక్షణకు అందరమూ ఒక్కటవుదాం’’ అని అందులో పౌరులకు స్వీడన్‌ ప్రభుత్వం పిలుపునిచ్చింది. దాంతోపాటు, ‘‘పిల్లల డైపర్లు, బేబీ ఫుడ్, దీర్ఘకాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు, మంచినీరు తదితరాలన్నింటినీ వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’’ అని సూచించింది. అంతేగాక బాంబు దాడులు జరిగితే వాటిబారి నుంచి ఎలా తప్పించుకోవాలి, గాయపడితే రక్తస్రావాన్ని నిరోధించేందుకు, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి, యుద్ధ బీభత్సం చూసి భీతిల్లే చిన్నారులను ఎలా సముదాయించాలి వంటి వివరాలెన్నో పొందుపరిచింది.

‘‘పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వీడన్‌ ఇలాంటి చర్యకు దిగడం ఇది ఐదోసారి. నార్వే కూడా ఇలాంటి ‘యుద్ధ’ జాగ్రత్తలతో ప్రజలకు ఎమర్జెన్సీ పాంప్లెంట్లు పంచుతోంది. ‘పూర్తిస్థాయి యుద్ధంతో పాటు ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే వారం దాకా ఇల్లు కదలకుండా గడిపేందుకు సిద్ధపడండి’ అంటూ అప్రమత్తం చేస్తోంది. డెన్మార్క్‌ కూడా కనీసం మూడు రోజులకు పైగా సరిపడా సరుకులు, మంచినీరు, ఔషధాలు తదితరాలు నిల్వ ఉంచుకోవాలంటూ తన పౌరులందరికీ ఇప్పటికే ఈ–మెయిళ్లు పంపింది! ఫిన్లండ్‌ కూడా అదే బాట పట్టింది. ‘రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండండి. నిత్యావసరాలను వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’ అంటూ తన పౌరులకు ఆన్‌లైన్‌ బ్రోషర్లు పంపింది.

అపారంగా అణ్వాయుధాలు 
రష్యా వద్ద వేలాదిగా అణ్వాయుధాలు పోగు పడి ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో అణు వార్‌హెడ్లున్న దేశం రష్యానే. 1994లో సోవియట్‌ నుంచి విడిపోయేనాటికి ఉక్రెయిన్‌ వద్ద కూడా భారీగానే అణ్వాయుధాలుండేవి. ఆ జాబితాలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశంగా ఉక్రెయిన్‌ ఉండేది. కానీ రష్యాతో ఒప్పందంలో భాగంగా తన అణ్వాయుధాలన్నింటినీ నాశనం చేసింది. కాకపోతే అమెరికాతో పాటు అణు సంపత్తి ఉన్న పలు దేశాలు ఉక్రెయిన్‌కు దన్నుగా ఉన్నాయి.

క్షిపణులే మాట్లాడతాయి 
భారీ క్షిపణి దాడులకు మాకు అనుమతి లభించిందంటూ మీడియా ఏదేదో చెబుతోంది. కానీ దాడులు జరిగేది మాటలతో కాదు. వాటిని ముందుగా చెప్పి చేయరు. ఇక  మా తరఫున క్షిపణులే మాట్లాడతాయి. 
– ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ 
 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement