ఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య పోరు కారణంగా పలువురు మృత్యువాత పడుతున్నారు. తాజాగా రష్యా తరఫున యుద్దంలో పాల్గొన్న భారతీయుడు మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ క్రమంలో భారతీయుడి మృతిని దేశ విదేశాంగశాఖ తీవ్రంగా పరిగణించింది. దీంతో, రష్యా యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రష్యాకు మద్దతుగా యుద్ధం చేస్తున్న కేరళకు చెందిన బినిల్ బాబు(32) మృతిచెందాడు. అలాగే, అతడి సమీప బంధువు టీకే జైన్ (27)కు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో బినిల్ చనిపోయిన విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసిందని అతడి బంధువులు మీడియాతో చెప్పారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ క్రమంలో భారతీయుడి మృతిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.
రష్యాకు మద్దతుగా యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. ఈ విషయాన్ని మాస్కోలోని రష్యన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపింది. అలాగే, ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయం అధికారులతోనూ మాట్లాడినట్టు స్పష్టం చేసింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మిగిలిన భారతీయులను అక్కడి నుంచి పంపించాలని కోరినట్టు ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు.. ఈ ఘటనపై కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. ‘మాస్కోలోని భారత రాయబార కార్యాలయం మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోంది. మృతదేహాన్ని త్వరగా భారత్‌కు రప్పించేందుకు రష్యన్ అధికారులతో మాట్లాడుతున్నాం. గాయపడిన జైన్‌ను కూడా విడుదల చేసి, ఇండియాకు పంపించాలని కోరాం’ అని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment