ఉక్రెయిన్‌పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది రష్యా. పవర్ ప్లాంట్‌లే లక్ష్యంగా దాడులు ముమ్మరం చేసింది. దీంతో ఉక్రెయిన్ వ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం నెలకొంది. అనేక ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా నిరంతర దాడులను కొనసాగిస్తూనే ఉంది. క్షిపణి దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేసింది మాస్కో సైన్యం. తూర్పు డొనెట్స్క్ ప్రావిన్స్‌లోని పలు పవర్ ప్లాంట్లను ధ్వంసం చేసింది. దీంతో ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
దీనిపై ఉక్రెయిన్ ప్రభుత్వ విద్యుత్ గ్రిడ్ ఆపరేటర్ స్పందించారు. రష్యా దాడులతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం వచ్చిందని చెప్పారు. పారిశ్రామిక, గృహ వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారంటూ వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ పవర్ గ్రిడ్‌పై రష్యా చేస్తున్న దాడులు దేశవ్యాప్తంగా బ్లాక్‌అవుట్‌ను విధించేలా చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక.. రష్యా దాడుల్లో 19 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
గత ఏప్రిల్‌లోనూ పవర్ ప్లాంట్‌పై దాడి చేసింది రష్యా. కీవ్‌లోని భారీ థర్మల్ పవర్ ప్లాంట్‌పై అటాక్ చేసింది. మే 8న మరో పవర్ ప్లాంట్‌ను టార్గెట్ చేసి దాడి చేసింది. రష్యా దాడులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. మరోవైపు డొనెట్స్క్ ప్రాంతంలోని ఉమాన్స్కే గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యా ఇప్పుడు ఉత్తర సుమీ, చెర్నిహివ్ ప్రాంతాలలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని ఉక్రెయిన్ అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చైనాపై తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటి వరకు పరోక్షంగా చైనాపై ఆరోపణలు చేసిన జెలెన్‌స్కీ.. ఇప్పడు డైరెక్ట్‌గానే అటాక్ చేశారు. రష్యాకు చైనా సాయం చేస్తోందంటూ మండిపడ్డారు. పుతిన్ చేతిలో డ్రాగన్ ఓ ఆయుధంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్‌లో జరగనున్న శాంతి సదస్సులో ఇతర దేశాలు హాజరుకాకుండా చైనా తన పరపతిని వినియోగిస్తోందని ఫైరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment