యుద్ధం కన్న అనాథలు | WORLD DAY OF WAR ORPHANS On January 6 2024 | Sakshi
Sakshi News home page

యుద్ధం కన్న అనాథలు

Published Sat, Jan 6 2024 3:13 AM | Last Updated on Sat, Jan 6 2024 3:14 AM

WORLD DAY OF WAR ORPHANS On January 6 2024 - Sakshi

ప్రపంచంలో ఎంతో మంది ఒక పూట తిండి కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో మరెంతో మంది కన్న ప్రేమను కోల్పోయి తల్లడిల్లుతున్నారు.   – మదర్‌ థెరెసా

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు. ఇరువైపులా ఎంతో మంది మరణించారు. రష్యా దాడులు తట్టుకోలేక ఉక్రెయిన్‌ నుంచి లక్షలాది మంది వలసపోయారు. అటు పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ దాడులతోనూ లక్షలాది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. అంతా యుద్ధ నష్టం గురించి, ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుకుంటుంటే.. అభంశుభం ఎరుగని ఎందరో చిన్నారులు యుద్ధం మిగిల్చిన అనాథలుగా భవిష్యత్తు ఏమిటో తెలియని దుస్థితిలో పడిపోయారు. జనవరి 6న (శనివారం) ప్రపంచ యుద్ధ సంక్షుభిత అనాథ పిల్లల దినోత్సవం (వరల్డ్‌ డే ఆఫ్‌ వార్‌ ఆర్ఫాన్స్‌) నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక కథనం..

నేను ఎందుకిలా అయ్యానో తెలియదు
ఈ చిత్రంలోని అమ్మాయి పేరు మసిక. వయసు పన్నెండేళ్లు. డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో (డీఆర్‌సీ)లో జరుగుతున్న అంతర్యుద్ధంలో తిరుగుబాటుదారులు ఆమె కళ్ల ముందే తల్లిదండ్రులను కాల్చి చంపేశారు. ఎవరూ దిక్కులేక తన స్నేహితురాలి తల్లితో కలసి జీవిస్తోంది. నాటి ఘటనను తలచుకుని కుమిలిపోతూ.. తినేందుకు తిండి, సరైన రక్షణ లేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ‘‘అసలు వాళ్లెవరో, ఎందుకోసం ఇలా చేస్తున్నారో, మా అమ్మానాన్నను ఎందుకు చంపేశారో, నేను ఎందుకిలా బతకాల్సి వస్తోందో నాకు తెలియదు..’’ అంటూ మసిక ఆవేదన వ్యక్తం చేస్తోంది.


అమ్మానాన్నను కోల్పోయి..
ఈ చిన్నారి పేరు కరీనా. వయసు ఏడేళ్లు. ఉక్రెయిన్‌లోని చెర్నిగివ్‌ ప్రాంతంలోని ఓ గ్రామం. రష్యా యుద్ధం మొదలుపెట్టాక తమ ఊరిని విడిచిపోతున్న సమయంలో.. జరిగిన బాంబు దాడిలో కరీనా తల్లిదండ్రులు చనిపోయారు. ఇప్పుడు ఉక్రెయిన్‌లోని కీవ్‌ నగరంలో తమ బంధువుల ఇంట్లో ఉంటోంది. తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ, బాంబు దాడిలో అయిన గాయాలతో బాధపడుతూ గడుపుతోంది.

ప్రపంచ యుద్ధాలతో ముమ్మరమై..
► రెండు ప్రపంచ యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అనాథ చిన్నారులను మిగిల్చాయి. అధికారిక అంచనాల ప్రకారమే.. అప్పట్లో పోలాండ్‌లో 3 లక్షలు, యుగోస్లే్లవియాలో 2 లక్షల మంది పిల్లలు అనాథలయ్యారు. 

► ‘యూనిసెఫ్‌ (ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి)’ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సంక్షుభిత ప్రాంతాల్లో 25 కోట్ల మందికిపైగా చిన్నారులు కనీస అవసరాలైన ఆహారం, మంచినీరు, నిలువనీడ లేక అవస్థ పడుతున్నారు. ఇందులో సుమారు 14 కోట్ల మంది తండ్రినిగానీ, తల్లిదండ్రులు ఇద్దరినీగానీ కోల్పోయి అనాథలుగా బతుకీడుస్తున్నారు.

► అనాథలుగా మారినవారిలో సుమారు 6 కోట్ల మంది ఆసియా దేశాల్లో, 5 కోట్లకుపైగా ఆఫ్రికా, మరో కోటిన్నర మందికిపైగా లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ ప్రాంత దేశాల్లో ఉన్నారు. 

► యుద్ధాలు, తిరుగుబాట్లతో అట్టుడుకుతున్న మధ్య ప్రాచ్యం, ఆసియా, దక్షిణ అమెరికా దేశాల్లో.. ముఖ్యంగా సిరియా, ఇరాక్, అఫ్గానిస్తాన్‌ వంటి దేశాల్లో.. ఆఫ్రికా ఖండంలోని సూడాన్, కాంగో, ఉగాండా, సోమాలియా వంటి దేశాల్లో అనాథ పిల్లల సమస్య పెరుగుతోంది. ఇలాంటి చోట్ల చాలా మంది చిన్నారులు తిరుగుబాటు దళాల్లో సైనికులుగా తుపాకులు చేతబట్టాల్సి వస్తోంది.

► సూడాన్‌లో అయితే ప్రతి వంద మంది చిన్నారుల్లో పది మంది అనాథాశ్రమాల్లో, వీధుల్లో బతుకు వెళ్లదీస్తున్నారు.

► ఇటీవల ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్‌ దాడికి ప్రతిగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ విరుచుకుపడటంతో.. వేల మంది మరణించారు. లక్షలాది మంది వలసపోయారు. ఈ యుద్ధంలో నూ పెద్ద సంఖ్యలో చిన్నారులు అనాథలయ్యారు.

ఏనాటి యుద్ధమైనా.. పిల్లలూ సమిధలే..  
ఏ పిల్లలకైనా తల్లిదండ్రులే అన్నీ. చదువు కోసమో.. ఉద్యోగం కోసమో దూరంగా ఉంటున్నా..తల్లడిల్లేది వారి గురించే. అమ్మ ఒడికి, నాన్న చెంతకు చేరితేనే సాంత్వన. అలాంటి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోతే.. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోతే.. ఆ బాధ వర్ణనాతీతం. అలాంటిది అస్తిత్వం కోసమో, అన్నం కోసమో, ఆక్రమణ కోసమో.. మానవ నాగరికత మొదలైన నాటి నుంచీ జరుగుతున్న యుద్ధాల్లో ఎందరో పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తమ వారంటూ ఉన్న బంధువుల మధ్య పెరుగుతున్నవారు కొందరు.. ఏతోడూ లేకుండా కునారిల్లిపోతున్నవారు మరికొందరు. సరైనదారిలో పడ్డవారు మంచి జీవితం గడపగలిగితే..‘దారి తప్పిన’వారి బతుకులు ఆగమైపోతున్నాయి.

ఉక్రెయిన్‌లో రెండేళ్లుగా పిల్లల గోస
రష్యా–ఉక్రెయిన్‌ ఒకప్పుడు ఒకే సోవియట్‌ యూనియన్‌లో భాగం. అందుకే ఇరు దేశాల మధ్య రాకపోకలూ, సంబంధ బాంధవ్యాలూ సాధారణమే. కానీ ఇరు దేశాల మధ్య పొరపొచ్చాలు, యుద్ధంతో ఇరువైపులా ఉండిపోయిన మరోదేశపు కుటుంబాలు ఆగమైపోయాయి. మరణించిన, వలస వెళ్లినవారి పిల్లలు, సైనికులు బలవంతంగా తల్లిదండ్రుల నుంచి విడదీసినవారు.. ఇలా ఎందరో చిన్నారులు అనాథలుగా మారారు. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన ‘కిడ్‌సేవ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ తమ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్‌కు మిలటరీ సాయమేకాదు.. యుద్ధంతో అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరింది.

బలవంతంగా క్యాంపులకు చిన్నారులు
2022 ఫిబ్రవరి చివరివారం నాటికి ఉక్రెయిన్‌లో అనాథ పిల్లల సంఖ్య లక్ష వరకు ఉండగా.. ఆ తర్వాత ఈ సంఖ్య మరింతగా పెరిగింది. కానీ సంక్షుభిత పరిస్థితుల్లో లెక్కలు తేల్చేదెలాగని, వేల మంది చిన్నారులు క్యాంపుల్లో మగ్గుతున్నారని అమెరికాకు చెందిన కాన్‌ఫ్లిక్ట్‌ అబ్జర్వేటరీ సంస్థ గతంలోనే పేర్కొంది. మరోవైపు రష్యా తమ దేశంలోని సుమారు 14 వేల ఉక్రెయిన్‌ కుటుంబాల పిల్లలను తల్లిదండ్రుల నుంచి బలవంతంగా విడదీసి క్యాంపులకు తరలించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

మొదటి ప్రపంచ యుద్ధంలో యూరప్‌లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన యూదు చిన్నారులు వీరు. వారికి కొత్త జీవితం అందించడం కోసం 1921లో అమెరికాలోని న్యూయార్క్‌కు తరలించినప్పుడు హార్బర్‌లో తీసిన ఫొటో ఇది.

ఫ్రెంచ్‌ ఆర్గనైజేషన్‌ చొరవతో..ప్రత్యేక రోజుగా..
ఫ్రాన్స్‌కు చెందిన ‘ఎస్‌ఓఎస్‌ ఎన్‌ఫాంట్స్‌ ఎన్‌ డెట్రెసెస్‌’ స్వచ్ఛంద సంస్థ చొరవతో యూనిసెఫ్‌ ఏటా జనవరి 6న ‘వరల్డ్‌ డే ఆఫ్‌ వార్‌ ఆర్ఫాన్స్‌ డే’గా నిర్వహిస్తోంది.యుద్ధాలు, తిరుగుబాట్ల కారణంగా అనాథలుగా మారుతున్న చిన్నారులు.. వారు శారీరకంగా, మానసికంగా తీవ్ర దుస్థితిని ఎదుర్కొంటున్న అంశంపై అవగాహన కల్పించడం, వారిని ఆదుకోవడం లక్ష్యంగా చర్యలు చేపట్టడమే దీని లక్ష్యం. అనాథలను ఆశ్రమాల్లో చేర్చడంతోపాటు చదువుకోవడానికి, సాధారణ జీవితం గడపడానికి తోడ్పడాలని స్వచ్ఛంద సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement