పుతిన్‌కు మరోసారి స్పష్టం చేసిన మోదీ
నేడు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ
కజాన్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తక్షణం శాంతియుత పరిష్కారం కనుగొనాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఎలాంటి సాయమైనా చేసేందుకు భారత్ సదా సిద్ధమని ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఈ మేరకు హామీ ఇచ్చారు. 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మంగళవారం రష్యాలోని కజాన్ నగరం చేరుకున్నారు. గత మూడు నెలల్లో మోదీ రష్యా వెళ్లడం ఇది రెండోసారి. కజాన్ చేరిన కాసేపటికే ఆయన పుతిన్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పలు అంశాలపై నేతలిద్దరూ లోతుగా చర్చించుకున్నారు.
‘‘ఉక్రెయిన్ సంక్షోభానికి తెర దించే విషయమై మీతో నేను నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నా. నేను ముందునుంచీ చెబుతున్నట్టుగా ఏ సమస్యకైనా శాంతియుత పరిష్కారమే ఏకైక మార్గం’’ అని ఈ సందర్భంగా పుతిన్‌కు మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఆయనతో అన్ని విషయాలపైనా అర్థవంతమైన చర్చ జరిగినట్టు అనంతరం ప్రధాని వెల్లడించారు.
ఉక్రెయిన్‌పై రెండేళ్లకు పైగా జరుపుతున్న యుద్ధాన్ని విరమించేలా పుతిన్‌ను ఒప్పించి సంక్షోభానికి తెర దించగలిగింది మోదీ ఒక్కరేనని ప్రపంచ దేశాధినేతలంతా అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి భేటీకి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. రెండు రోజుల పాటు జరగనున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో కూడా మోదీ సమావేశమయ్యారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఆయన బుధవారం భేటీ కానున్నారు. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ మేరకు వెల్లడించారు.
నాకు, మోదీకి మధ్య అనువాదం అవసరమే లేదు
నవ్వులు పూయించిన పుతిన్ వ్యాఖ్యలు
మోదీతో భేటీ సందర్భంగా పుతిన్ చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. ‘‘భారత్‌తో రష్యా బంధం ఎంత బలంగా ఉందంటే నా మాటలను అర్థం చేసుకోవడానికి బహుశా మీకు అనువాదం కూడా అవసరం లేదేమో!’’ అని మోదీని ఉద్దేశించి పుతిన్ అన్నారు. దాంతో ప్రధానితో సహా భేటీలో పాల్గొన్న ఇరు దేశాల ఉన్నతాధికారులు తదితరులంతా చిరునవ్వులు చిందించారు. భారత్‌తో రష్యా బంధం అత్యంత ప్రత్యేకమైనది. ఎంతో దృఢమైనది. అది నానాటికీ మరింతగా బలపడుతోంది’’ అని ఈ సందర్భంగా పుతిన్ అన్నారు.
బ్రిక్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం
అంతర్జాతీయంగా బ్రిక్స్ కూటమి ప్రాధా న్యం నానాటికీ పెరుగుతోందని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘కీలకమైన అంతర్జాతీయ అంశాలపై చర్చలకు బ్రిక్స్ ప్రధాన వేదికగా మారుతోంది. అభివృద్ధి, పరస్పర సహకారం, వాతావరణ మార్పులు, ఆర్థిక సహకారం, దేశాల మధ్య పలు రకాలైన కీలక సరఫరా వ్యవస్థల నిర్మాణం వంటివాటిపై నూతన ఆలోచనల కలబోతకు కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. గతేడాది పలు కొత్త దేశాలు బ్రిక్స్ సభ్యులుగా చేరాయి. మరెన్నో దేశాలు చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతి, ప్రగతికి సంబంధించిన పలు కీలక అంశాలపై బ్రిక్స్ దేశాధినేతలతో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఈ కూటమి 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలతో బ్రిక్ పేరిట ఏర్పాటైంది. 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్‌గా మారింది. గతేడాది ఈజిప్‌్ట, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ కూడా కూటమిలో చేరాయి.
కాల పరీక్షకు నిలిచిన బంధం: మోదీ
గత మూడు నెలల్లోనే రష్యాలో ఇది తన రెండో పర్యటన అని మోదీ గుర్తు చేసుకున్నారు. ‘‘ఇరు దేశాల మధ్య నానాటికీ బలపడుతున్న ప్రగాఢ బంధానికి, స్నేహానికి, సమన్వయానికి ఇది సూచిక. రష్యా, భారత మైత్రి కాలపరీక్షకు నిలిచిన బంధం. భారత ఆర్థికాభివృద్ధిలో, భద్రతలో రష్యాది కీలక పాత్ర’’ అంటూ ప్రస్తుతించారు. చరిత్రాత్మక కజాన్ నగరంలో భారత్ నూతన కాన్సులేట్‌ను తెరవడం పట్ల ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. గత జూలైలో కూడా ఆయన రష్యాలో పర్యటించడం తెలిసిందే. ఆ సందర్భంగా పుతిన్‌తో జరిగిన శిఖరాగ్ర భేటీలో పలు విషయాలపై లోతుగా చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment