Sakshi Editorial On Ukraine Russia War - Sakshi
Sakshi News home page

చరిత్ర క్షమించని మహా నేరం

Published Thu, Jun 8 2023 2:16 AM | Last Updated on Thu, Jun 8 2023 11:26 AM

Sakshi Editorial On Ukraine Russia war

కొన్ని సంఘటనలు సమకాలీన చరిత్రను మలుపు తిప్పుతాయి. అనూహ్య పరిణామాలకు ఆరంభమవుతాయి. ఉక్రెయిన్‌లో సాగుతున్న సుదీర్ఘ యుద్ధంలో మంగళవారం నాటి ఘటన అలాంటిది. దక్షిణ ఉక్రెయిన్‌లో నిప్రో నదిపై ఉన్న కీలకమైన నోవా కఖోవ్కా ఆనకట్ట పాక్షికంగా పేల్చివేతకు గురై, ఆ పక్కనే ఉన్న అణువిద్యుత్కేంద్రం ముప్పులో పడ్డ ఘటనతో ప్రపంచం ఉలిక్కిపడింది. రష్యా సాగించిన జీవావరణ తీవ్రవాద చర్య ఇది అని ఉక్రెయిన్‌ నిందిస్తుంటే, ఇది పూర్తిగా ఉక్రెయిన్‌ విద్రోహచర్య అని రష్యా ఆరోపిస్తోంది.

ఈ నిందారోపణల్లో నిజానిజాలు ఏమైనా, ప్రపంచంలోనే అత్యధిక జలసామర్థ్యం ఉన్న డ్యామ్‌లలో ఒకటైన ఈ ఆనకట్టపై పడ్డ దెబ్బతో నీళ్ళు ఊళ్ళను ముంచెత్తి, వేల మంది ఇల్లూవాకిలి పోగొట్టుకున్నారు. లక్షలాది గొడ్డూగోదా సహా జనం తాగేందుకు గుక్కెడు నీరైనా లేక ఇక్కట్లలో పడ్డారు. అన్నిటికన్నా మించి ఉక్రెయిన్‌ ఇప్పుడు అణుప్రమాదం అంచున ఉందనే ఆందోళన కలుగుతోంది.

ఈ డ్యామ్‌ పరిసర ప్రాంతాలు రష్యా నియంత్రణలోనే ఉన్నాయి. కానీ, డ్యామ్‌ ధ్వంసంలో తన పాత్ర లేదనేది రష్యా మాట. అది అంత తేలిగ్గా నమ్మలేం. ఇటీవల సరిహద్దు ఆవల నుంచి రష్యా భూభాగంపై దాడులు చేస్తూ, డ్రోన్లతో దెబ్బ తీస్తూ ఉక్రెయిన్‌ వేడి పెంచింది. ప్రతిగా రష్యా ఇప్పుడు శత్రుదేశం దృష్టిని మరల్చి, సుస్థిరతను దెబ్బతీసే ఎత్తుగడ వేసిందని ఓ వాదన. ఉక్రెయిన్‌కూ, ఆ ప్రాంతంలో వ్యవసాయానికీ కీలకమైన 5 అతి పెద్ద ఆనకట్టల్లో ఒకదానికి భారీ గండి పడేలా చేయడం అందులో భాగమే కావచ్చు.

వ్యవసాయ, తాగునీటి అవసరాలకు కీలకమైన ఆనకట్టను ధ్వంసం చేసుకోవడం వల్ల ఉక్రెయిన్‌కు వచ్చే లాభమేమీ లేదు. నిజానికి, మునుపటి దాడుల్లో ఆనకట్ట నిర్మాణం బలహీనపడి ఉండవచ్చు. ఆ ప్రాంతాన్ని నియంత్రిస్తున్న రష్యా ఆక్రమణదారులు రిజర్వాయర్‌లో నీళ్ళు అసాధారణ స్థాయికి చేరినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి ఉండవచ్చు. ఆ నిర్లక్ష్యం ఫలితమే ఇప్పుడీ డ్యామ్‌ విధ్వంసమనేది ఒక కథనం.  

ఉక్రెయిన్‌ దళాలు దాడులు పెంచిన మర్నాడే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. శత్రువును వరదలతో ముంచెత్తడమూ తమ ఆయుధమేనంటూ గతంలో మాస్కో తన ఆలోచనను బయట పెట్టిన సంగతీ మర్చిపోలేం. దక్షిణ ఉక్రెయిన్‌లో రష్యా, ఉక్రెయిన్‌ సేనలను విడదీస్తున్న నిప్రో నదిపై ఈ ఆనకట్ట ఉంది. ఆహార ధాన్యాలు అధికంగా పండించే దక్షిణ మధ్య ఉక్రెయిన్‌లోని మెట్ట భూములకు సాగునీరు, రష్యా ఆక్రమిత క్రిమియా సహా అనేక భారీ నగరాలకు తాగునీరు ఈ రిజర్వాయరే అందిస్తుంది.

నది దాటి ఇవతలకు వచ్చేందుకు యుద్ధంలో వ్యూహాత్మకంగానూ ఇది కీలకమైనదే. అందుకే, ఈ విధ్వంసం మానసిక పోరుకు  మించినది. రిజర్వాయర్‌లో నీళ్ళన్నీ ఖాళీ అయితే పక్కనే జపొరీషియా అణువిద్యుత్కేంద్రానికి తగినంత నీటి సరఫరా జరగదు. ఇప్పటికే అందులో ఆరు రియాక్టర్లను మూసివేశారు కాబట్టి, చల్లబరిచేందుకు పొరుగునే ఉన్న కొలను నీరు సరిపోవచ్చు.

అయినా సరే, ఆ అణువిద్యుత్కేంద్రాన్ని యుద్ధంలో అస్త్రంగా వాడరని చెప్పలేం. మరమ్మతులకు కనీసం అయిదేళ్ళు పట్టే ఈ ఆనకట్ట విధ్వంసం వల్ల దీర్ఘకాలిక మానవ, పర్యావరణ సంక్షోభం, సైనిక పర్యవసానాలూ తప్పవు. నదీగర్భంలో మిగిలిన చెర్నోబిల్‌ ప్రమాదం నాటి అణు వ్యర్థాలు వరదలతో మళ్ళీ పైకొచ్చే ప్రమాదమూ పొంచి ఉంది. 

నిజానికి, ఈ డ్యామ్‌పై దాడికి దిగకుండా రష్యాను హెచ్చరించాలనీ, దాడి జరిగితే అది అతి పెద్ద విపత్తుగా పరిణమిస్తుందనీ గత అక్టోబర్‌లోనే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు అన్నారు. డ్యామ్‌లో రష్యా సేనలు పేలుడు పదార్థాలు ఉంచాయని అప్పట్లో ఆయన అనుమానించారు. ఇప్పుడు డ్యామ్‌ విధ్వంసంతో ఏడాది పైచిలుకుగా సాగుతున్న ఉక్రెయిన్‌ యుద్ధం మరింత సంక్లిష్టం కానుందని తేలిపోయింది. అలాగని ఉక్రెయిన్‌ సైతం తక్కువ తినలేదు.

రష్యా నుంచి జర్మనీకి వెళ్ళే కీలకమైన నార్డ్‌ స్ట్రీమ్‌ సహజవాయు పైప్‌లైన్లపై నీటిలో పేలుళ్ళ ద్వారా గత ఏడాది సెప్టెంబర్‌లో ఉక్రెయిన్‌ బృందం దాడులు చేసింది. ఆ సంగతి అంతకు మూడు నెలల ముందే అమెరికా గూఢచర్య సంస్థకు తెలుసని తాజాగా బయటపడింది. అప్పట్లో సహజవాయు పైప్‌లైన్లు, ఇప్పుడు భారీ ఆనకట్ట... పరస్పర విధ్వంసంలో పైచేయి కోసం తపిస్తున్న రష్యా, ఉక్రెయిన్‌లు ఇలా ఎంత దాకా వెళతాయో! 

యుద్ధం ఎవరిదైనా, అందులో ఎవరి చేయి పైనా కిందా అయినా – చివరకు నష్టపోయేది ప్రజలే. యుద్ధం సాకుతో సాధారణ పౌరుల పైన, కీలకమైన ప్రాథమిక వసతి సౌకర్యాల పైన దాడులు ఏ రకంగానూ సమర్థనీయం కావు. అంతర్జాతీయ మానవతావాద చట్ట ఉల్లంఘనలుగా ఇవన్నీ యుద్ధ నేరాల కిందకే వస్తాయి.

ఐరాస ప్రధాన కార్యదర్శి అభ్యర్థించినట్టు ఇలాంటి దాడులు ఆగాలి. అంతర్జాతీయ చట్టాన్ని అంతా గౌరవించాలి. ఇప్పటికైనా రష్యా, ఉక్రెయిన్‌లు రెండూ ఈ నియమాలు పాటించడం అవసరం. ఇక, ఆనకట్ట విధ్వంసంతో డ్యామ్‌ నుంచి కనీసం 150 మెట్రిక్‌ టన్నుల చమురు లీకైందని పర్యావరణ మంత్రి మాట. పర్యావరణ రీత్యా ఆ ప్రాంతం కోలు కోవడానికి కొన్ని దశాబ్దాలు పడుతుందని నిపుణుల విశ్లేషణ.

గత కొన్ని దశాబ్దాల్లో ఐరోపాలో అతి పెద్ద మానవ కల్పిత పర్యావరణ విపత్తు ఇదేనంటున్నది అందుకే! విషాదం ఏమిటంటే, 1986లో చెర్నోబిల్‌ అణుప్రమాదం బారిన పడ్డ గడ్డపైనే మళ్ళీ ఇలాంటి మహా విపత్తు సంభవించడం! అదీ మానవత మరిచిన యుద్ధంలో మనిషి చేజేతులా చేసింది కావడం! ఇది చరిత్ర క్షమించని మహా యుద్ధనేరం. మానవాళికి మరో శాపం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement