భీకర బాంబుల వర్షంలో ఉక్రెయిన్ నగరాలు తడిసి ముద్దవుతున్న తరుణంలో ఇప్పుడిప్పుడే ఈ యుద్ధం ముగిసేలా కనిపించడం లేదు. వందల మంది ప్రాణాలు పోగొట్టుకొని, లక్షల మంది నిరాశ్రయులవుతున్న వర్తమాన మానవీయ సంక్షోభం ఇది. పరిస్థితులు, పరిణామాలు చూస్తుంటే, ప్రపంచ దేశాలకు పెద్దరికం వహించాల్సిన ఐక్యరాజ్య సమితి (ఐరాస) చేష్టలుడిగి, చేవ చచ్చిన భావన కలుగుతోంది. తాజా ఉక్రెయిన్ సంక్షోభం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని భయపడుతున్న నేపథ్యంలో ఆలోచింపజేస్తున్న అంశం ఇది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధ నివారణ కోసం 1920లో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థ ‘నానాజాతి సమితి’ రెండో ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో విఫలమైంది. ప్రత్యామ్నాయంగా 1950లో ఏర్పాటైన ‘ఐరాస’ సైతం ఇప్పుడదే బాటలో నడుస్తోందా?
193 సభ్యదేశాల ఐరాస నిజానికి బలమైన అంతర్జాతీయ సంస్థగా ఉండాల్సింది. కొన్నేళ్ళు అలాగే కనిపించింది కూడా! కానీ, గడచిన ఏడు దశాబ్దాల్లో ఏ ప్రధాన యుద్ధాన్నీ అది ఆపలేకపోయింది. అమెరికా లాంటి అగ్రరాజ్యాల నిధుల మీద ఆధారపడే అంతర్గత బలహీనత ఐరాసది. దాంతో, నిత్యం అది ఏ గూటి పలుకు పలకాల్సి వస్తుందన్నది ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. పలు ప్రధాన అంగాలున్న ఐరాసలో శక్తిమంతమైన భద్రతా మండలి యుద్ధాలను ఆపాలి. శాంతి నెలకొనేలా చూడాలి. ఆచరణలో మాత్రం ‘పీ–5’ దేశాలుగా అభివర్ణించే దానిలోని అయిదు వీటో అధికార దేశాలే (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా) ఇవాళ మిగతా ప్రపంచానికి ఆయుధాలను అందించే సైనిక – పారిశ్రామిక వర్గం కావడం విడ్డూరం. కంచే చేను మేసినట్టు, ఈ 5 దేశాలే దురాక్రమణకు దిగితే ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి? ఎలా ఆపాలి? వీటో అధికారమున్న ఈ దేశాలను ఐరాస ఆంక్షలూ ఏమీ చేయలేవన్నది చరిత్ర.
1999లో చెచెన్యాలో, 2008లో జార్జియాలో, 2014లో క్రిమియాలో రష్యా సైనిక చర్యలప్పుడు అదే జరిగింది. భద్రతామండలి ఆమోదం లేకపోయినా, ప్రపంచమంతా యుద్ధ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తినా అమెరికా, బ్రిటన్లు 2003లో ఇరాక్ మీద యుద్ధానికి దిగినప్పుడూ అదే పరిస్థితి. పొరుగున ఉన్న బలహీనుడిపై, ఏ బలవంతుడు దాడి చేసినా అది నేరమే అనేది ప్రాథమిక న్యాయం. కానీ, అప్పట్లో సద్దామ్ హుస్సేన్ గురించి నానా అబద్ధాలు చెబుతూ యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్, బ్రిటీషు ప్రధాని టోనీ బ్లెయిర్లను పల్లెత్తు మాట అనని పాశ్చాత్య దేశాలు ఇప్పుడు రష్యా అధినేత పుతిన్‌ను మాత్రం ‘యుద్ధోన్మాది’గా పేర్కొనడం విడ్డూరమే. అప్పుడు ఆంక్షలే పెట్టని దేశాలు ఈసారి రష్యాపై ఆంక్షల అస్త్రప్రయోగం చేయడం విచిత్రమే. అయితే, ఉక్రెయిన్ పరిణామాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అతి పెద్ద మానవీయ సంక్షోభంగా పరిణమిస్తున్నాయి. లక్షల మంది నిరాశ్రయులై, శరణార్థులుగా తరలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లోనూ ఐరాస మాటలకే పరిమితమవుతోంది. యుద్ధాన్ని ఆరంభించిన సౌదీ అరేబియాను అనలేక, ఆపలేక చివరకు యెమెన్ లాంటి దేశాల్లో, అంతర్గత నిరాశ్రయులెందరో వచ్చిన ప్రాంతాల్లో మానవత్వ సహాయానికి అభ్యర్థించిన ధోరణినే ఈసారీ ఆశ్రయించేలా ఉంది.
భద్రతా మండలిలోని ఫ్రాన్స్ లాంటివి అభ్యంతరాలు వ్యక్తం చేసినా, అప్పట్లో మూర్ఖంగా ఇరాక్‌పై దాడి జరిగింది. సాక్షాత్తూ ఐరాస ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ ఆ యుద్ధాన్ని ‘చట్టవిరుద్ధం’ అని ప్రకటించినా, ఆగలేదన్నది వాస్తవం. అప్పుడైనా, ఇప్పుడైనా సైనిక వ్యవహారాల్లో ఐరాస ప్రధాన కార్యదర్శి పాత్ర ఎంత పరిమితమో అర్థం చేసుకోవచ్చు. ఆ మాటకొస్తే కొన్నేళ్ళుగా ఐరాస మొత్తం పని తీరే ప్రశంసనీయంగా లేదు. కోవిడ్ సంక్షోభంలోనూ ఐరాస, దానిలో భాగమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రభావశీలంగా పని చేయలేదు. రోజుకో రకం పరస్పర విరుద్ధ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకటనలు, ప్రమాద హెచ్చరికలకే ప్రధానంగా పరిమితమయ్యాయి. కనీసం బీద దేశాలకు సత్వర టీకాల సరఫరాలోనూ సఫలం కాలేదు. ఇప్పుడు ప్రపంచ శాంతి పరిరక్షణలో అంతకన్నా ఎక్కువగా ఐరాస విఫలమైంది. ఐరాస నియమావళి కింద 40 ఏళ్ళలో తొలిసారి అత్యవసర సర్వప్రతినిధి సభ పెట్టి, రష్యాను తప్పుబట్టడం మాత్రం చేయగలిగింది.
ఐరాసలో భాగమైన అంతర్జాతీయ న్యాయస్థానం తలుపు తట్టిన ఉక్రెయిన్‌కు ఏం ఒరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. అంతర్జాతీయ యవనికపై వట్టి డమ్మీగా మారిపోతున్నదనే భావం బలపడుతున్న వేళ, ఇప్పటికైనా ప్రపంచ దేశాలన్నీ కలసి ఐరాస పునఃపటిష్ఠ ప్రక్రియపై దృష్టి పెట్టాలి. కొత్త సభ్యులతో భద్రతామండలి పునర్నిర్మించాలి. అణుబాంబుల క్రీనీడలో ప్రపంచ అగ్రాసనం కోసం అగ్రరాజ్యాల మధ్య తెర వెనుక తాపత్రయాలు పెరుగుతున్న వేళ అవసరమైతే నిలువరించే అంతర్జాతీయ వేదిక ఇప్పుడే ఎక్కువ అవసరం. లేదంటే రానున్న రోజుల్లో మరీ కష్టం. ఇటు శరణార్థులుగా వలస పోతున్న లక్షలాది ఉక్రెయినియన్లు, అటు పాశ్చాత్య ఆంక్షలతో దెబ్బతింటున్న సామాన్య రష్యన్లు... వెరసి ప్రపంచ దేశాల వేదిక విఫలమైంది. పర్యవసానాలు తెలిసినా సరే పొరుగు దేశాల భయాలను పోగొట్టి, యుద్ధాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరూ విఫలమయ్యారు. శాంతి చర్చలకు బాటలు వేయడంలో మనుషుల్లోని మానవత్వమైనా సఫలమవుతుందా? 6 లక్షల మంది పౌరుల్ని బలిగొన్న ఇరాక్ యుద్ధ బీభత్సమే ఉక్రెయిన్‌లో పునరావృతమైతే ఆ పాపం ఒక్క పుతిన్‌దే కాదు... అమెరికాది, దాని చేతిబొమ్మ నాటోది, ఆచరణకు దిగని ఐరాసది, మొత్తం ప్రపంచానిది!
అశక్త అనైక్య సమితి!
Published Tue, Mar 8 2022 12:17 AM | Last Updated on Tue, Mar 8 2022 12:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment