
చండీగఢ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మరో భారతీయుడు బలయ్యారు. రవాణా విధులకని తీసుకున్న రష్యా యుద్ధంలోకి పంపి తన సోదరుడిని పొట్టనబెట్టుకుందని హరియాణాకు చెందిన అజయ్ మౌన్ అనే వ్యక్తి సోమవారం ప్రకటించారు. బాధితుడు రవి మౌన్ జనవరి 13న రష్యా వెళ్లారు. కందకాలు తవ్వడంలో శిక్షణ ఇప్పించి నేరుగా యుద్ధక్షేత్రంలోకి పంపారని అజయ్ ఆరోపించారు.
రవిని రష్యాకు పంపేందుకు ఎకరం భూమి అమ్మడంతోపాటు రూ.11.50 లక్షలు ఖర్చుపెట్టామని వాపోయారు. రవి మరణవార్తను మాస్కోలోని భారతీయ ఎంబసీ ధ్రువీకరించింది. యుద్ధంలో ఉన్న భారతీయులను వెనక్కి పంపేస్తామంటూ ప్రధాని మోదీ పర్యటన వేళ రష్యా ప్రకటించిన కొద్దిరోజులకే ఈ విషాదం వెలుగుచూడటం గమనార్హం.
యుద్ధంలో పనిచేయడం రవికి సుతరామూ ఇష్టంలేదని, ఫోన్‌లో ముభావంగా మాట్లాడేవారని మార్చి 12వ తేదీ దాకా అతనితో టచ్‌లోనే ఉన్నామని సోదరుడు అజయ్ చెప్పారు. మృతదేహం గుర్తింపు కోసం డీఎన్‌ఏ నమూనాలను పంపాలని డిమాండ్ చేస్తున్నారని, అంత సొమ్ము తమ వద్ద లేదని, మృతదేహం రప్పించేందుకు భారత సర్కార్ సాయం చేయాలని ఆయన వేడుకున్నారు.