రివాజు తప్పనీయరాదని పాకిస్థాన్ సైన్యం కంకణం కట్టుకున్నట్టుంది. సార్క్ సమావేశాల సందర్భంగా నేపాల్ రాజధాని కఠ్మాండూలో ప్రధాని నరేంద్రమోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు కరచాలనం చేసుకున్న కొన్ని గంటలకే జమ్మూలోని అర్నియా సెక్టార్ వద్ద నెత్తురు చిందింది. అధీన రేఖ ఆవలివైపునుంచి వచ్చిన ఉగ్రవాదులు ముగ్గురు జవాన్లు, అయిదుగురు పౌరులను పొట్టనబెట్టుకున్నారు. జవాన్ల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు చనిపోయారు. గురువారం ఉదయం మొదలైన ఈ ఎన్‌కౌంటర్ శుక్రవారం మధ్యాహ్నానికి పూర్తయింది. అదే సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని బీఎస్‌ఎఫ్ ప్రతినిధి చెబుతున్నారు. సార్క్ శిఖరాగ్ర సదస్సులో తొలి రోజు ఎడమొహం, పెడమొహంగా ఉన్న ప్రధానులు మరుసటిరోజుకల్లా చిరునవ్వులు చిందించుకోవడంతోపాటు కరచాలనం చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. అంతేకాదు... తమ దేశంలో నిర్బంధంలో ఉన్న 40మంది భారత జాలర్లను సుహృద్భావ సూచకంగా విడుదలచేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. మరోపక్క శుక్రవారం జమ్మూలోని పూంచ్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొనబోతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకునే పాక్ సైన్యం సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించిందని సులభంగానే అర్థమవుతుంది. అధీన రేఖ వద్ద ఈ పరిస్థితి మన జవాన్లకు కొత్తేమీ కాదు. 1998తో మొదలుపెట్టి 2003 వరకూ పాక్ సైన్యం ఈ ప్రాంతంలో కాల్పులకు పాల్పడుతూనే ఉన్నది. భారత్‌లోకి చొరబాటుదార్లను ప్రవేశపెట్టడమే ఈ కాల్పుల వెనకున్న ఉద్దేశం.
ఆ అయిదేళ్లూ పూంచ్, యూరి, కార్గిల్ సెక్టార్లలో ఇరు దేశాల సైనికుల కాల్పులతో రెండు పక్కలా ఉన్న గ్రామాల్లోని పౌరులు కంటి మీద కునుకు లేకుండా గడిపారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. అధీనరేఖ వద్ద 1998లో 4,117 ఘర్షణలు చోటు చేసుకుంటే అందులో 78మంది జవాన్లు, 78మంది పౌరులు చనిపోయారు. 2002నాటికి ఘర్షణలు 5,767కు చేరుకుంటే మరణించిన జవాన్ల సంఖ్య 81కి పెరిగింది. సరిగ్గా ఆ సమయంలో కశ్మీర్ లోయలో వివిధ ప్రాంతాల్లో మన జవాన్లపై ఉగ్రవాదులు దాడులు కూడా పెరిగాయి. అలాంటి దాడులు 1997లో 1,115 సార్లు జరిగితే 2002కల్లా వాటి సంఖ్య 1,211కు చేరుకుంది. ఆ ఏడాది చివరిలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక సరిహద్దులు దాదాపు ప్రశాంతంగా ఉండటమే కాదు...కశ్మీర్ లోయలో ఉగ్రవాద దాడుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాదులకు ఇస్తున్న అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ గణాంకాలే చెబుతాయి.
2003లో ఇరు దేశాలమధ్యా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక అధీన రేఖ వద్ద కాల్పులు ఏనాడూ ఆగిపోలేదుగానీ వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే, ఏళ్లు గడుస్తున్నకొద్దీ మళ్లీ క్రమేణా ఆ ఉల్లంఘనలు పెరుగుతున్నాయి. 2012లో 114సార్లు ఉల్లంఘనలు చోటుచేసుకుంటే గత ఏడాది అవి 347కు చేరుకున్నాయి. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లోనే 400 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయంటే వీటి వెనకున్న ఉద్దేశమేమిటో సులభంగానే అంచనావేసుకోవచ్చు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి నవాజ్ షరీఫ్ రావడంతో మొదలుపెట్టి ఇరు దేశాలమధ్యా సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాకే ఇవి ఒక్కసారిగా పెరిగాయి. జమ్మూ-కశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న ప్రస్తుత సమయంలో మిలిటెంట్లను ప్రవేశపెట్టి విధ్వంసం సృష్టించడానికి పాక్ సైన్యం పథకం పన్నింది. తొలి దశ ఎన్నికలు స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగియడంతో ఇప్పుడు అర్నియా సెక్టార్‌లో మిలిటెంట్లను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది.
ఇలాంటి పోకడలను గమనించినా నోరెత్తలేని అశక్తత వల్ల కావొచ్చు...నవాజ్ షరీఫ్ తమ దేశ పరువు ప్రతిష్టలనూ, ఆత్మగౌరవాన్నీ పణంగా పెట్టి భారత్‌తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని స్వదేశం చేరుకున్నాక ప్రకటించారు. పాకిస్థాన్ భౌగోళికంగా ఒక ప్రాంతమే అయినా...దానికొక రాజ్యవ్యవస్థ ఉన్నా దానిలోని విభాగాల మధ్య పొంతన లేదు. పౌర ప్రభుత్వం అధీనంలో ఉండి పనిచేయడానికీ, దాని విధానాలకు అనుగుణంగా వ్యవహరించడానికీ అక్కడి సైన్యానికి నామోషీ! పాక్ ఆవిర్భావంనుంచీ దాని తీరు ఇదే. గత ఆరేళ్లుగా ఈ విషయంలో కాస్త తగ్గినట్టు కనబడుతున్నా తన ధోరణిని విడనాడలేదని తరచుగా సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న ఘర్షణలే చెబుతున్నాయి. భారత్ లక్ష్యంగా సాగుతున్న ఉగ్రవాద దాడులకు తమ భూభాగం వేదిక కానీయబోమని నవాజ్ షరీఫ్ నిరుడు అధికారంలోకి రాగానే ప్రకటించివున్నారు.
ఇప్పుడు అర్నియా సెక్టార్‌లో చొరబాటుకు ప్రయత్నించిన మిలిటెంట్లు పాక్ గడ్డవైపు నుంచి వచ్చినవారే. వారికి భారత జవాన్లనుంచి ఎలాంటి ఆటంకమూ లేకుండా చూడటం కోసం కాల్పులకు తెగబడింది పాక్ సైన్యమే. ఇలాంటి ఉదంతాలు దేశ పరువుప్రతిష్టలనూ, ఆత్మగౌరవాన్నీ మంటగలుపుతాయి తప్ప చర్చలు కాదని షరీఫ్ గుర్తించవలసి ఉన్నది. భారత సైన్యం ఆధిక్యతను దెబ్బతీయడానికి ఉగ్రవాదుల ద్వారా పాకిస్థాన్ పరోక్ష యుద్ధానికి దిగుతున్నదని ఇటీవలే అమెరికా రక్షణ శాఖ నివేదిక స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యం పోకడలనూ, దాన్నేమీ అనలేని అక్కడి ప్రభుత్వ నిస్సహాయస్థితినీ మన దేశం అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకొచ్చి పాక్‌పై మరింతగా ఒత్తిడి పెంచాలి. ఇలా చేయడంద్వారానే 2003లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి దిగివచ్చింది. మరోసారి అదే తరహాలో ప్రయత్నించి, పాక్ పన్నాగాలను ప్రపంచానికి వెల్లడించినప్పుడు మాత్రమే అక్కడి సైన్యం ఆగడాలను అడ్డుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
అధీనరేఖ మళ్లీ రక్తసిక్తం
Published Sat, Nov 29 2014 1:23 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement