మరో మెరుపు దాడి | Indian Army kills 3 Pakistani soldiers in cross border ops in J&K | Sakshi
Sakshi News home page

మరో మెరుపు దాడి

Published Wed, Dec 27 2017 1:48 AM | Last Updated on Wed, Jul 25 2018 1:49 PM

Indian Army kills 3 Pakistani soldiers in cross border ops in J&K - Sakshi

భారతీయ ఆర్మీ మరోసారి ప్రతాపం చూపింది. దాయాది దేశం పాకిస్తాన్‌ కవ్వింపులకు కళ్లు చెదిరే సమాధానం ఇచ్చింది. సరిహద్దులు దాటివెళ్లి శత్రుసైన్య శిబిరంపై విరుచుకుపడింది. గతేడాది జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ను గుర్తుకు తెచ్చేలా.. నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) దాటి వెళ్లిన భారత ‘ఘాతక్‌’ కమాండోలు ముగ్గురు శత్రు సైనికులను హతమార్చి, ఓ జవానును గాయపర్చి వీరోచితంగా తిరిగొచ్చారు. అలా.. శనివారం పాక్‌ కాల్పుల్లో చనిపోయిన భారత మేజర్‌ ప్రఫుల్ల అంబదాస్‌ సహా నలుగురు సహచరులకు తమదైన శైలిలో ఘన నివాళుర్పించారు. పూంచ్‌ సెక్టార్‌ దగ్గర్లో సోమవారం సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభమైన ఈ ఆపరేషన్‌.. 45 నిమిషాల్లో ముగిసింది.

న్యూఢిల్లీ: భారత సైన్యం మరో సాహసవంతమైన ఆపరేషన్‌ను చేపట్టింది. ఐదుగురు భారత సైనికులు నియంత్రణ రేఖను దాటి వెళ్లి పాక్‌ సైన్యానికి చెందిన తాత్కాలిక శిబిరాన్ని కూల్చి, అందులోని ముగ్గురు సైనికులను హతమార్చి వీరోచితంగా తిరిగొచ్చారు. కశ్మీర్‌లో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాక్‌ సైన్యం మేజర్‌ ప్రఫుల్ల సహా నలుగురు భారత సైనికులను పొట్టనబెట్టుకున్న చర్యకు ప్రతీకారంగానే తాజా ఆపరేషన్‌ జరిగినట్లు భావిస్తున్నారు. భారత జవాన్లందరూ సురక్షితంగా తిరిగొచ్చారని ఆర్మీ వర్గాలు చెప్పాయి.

మినీ సర్జికల్‌ స్ట్రైక్స్‌!
గతేడాది సెప్టెంబరు 28 రాత్రి భారత సైన్యం హెలికాప్టర్లను ఉపయోగించి భారీ ఆపరేషన్‌ను చేపట్టి నియంత్రణ రేఖకు దగ్గర్లో పాక్‌ సైన్యం మద్దతుతోనే ఏర్పాటైన ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసి రావడం తెలిసిందే. సోమవారం జరిగిన ఆపరేషన్‌లోనూ భారత సైనికులు పూంచ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖను దాటి అవతలకు వెళ్లి పాక్‌ సైనికుల భరతం పట్టారు. అయితే ఈ ఆపరేషన్‌ను సర్జికల్‌ స్ట్రైక్స్‌తో పోల్చలేమనీ, ఇది చాలా చిన్న లక్ష్యంతో, స్వల్ప కాలంలోనే పూర్తయిన దాడి అని ఆర్మీ వర్గాలు చెప్పాయి. కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా కేరీ సెక్టార్‌లో ఓ మేజర్‌ సహ నలుగురు భారత సైనికులను శనివారం పాకిస్తాన్‌ సైన్యం బలిగొంది. దీనికి ప్రతీకారంగానే తాజా దాడి జరిగిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

నియంత్రణ రేఖకు 200 నుంచి 300 మీటర్ల దూరంలో ఉన్న పాక్‌ శిబిరాన్ని భారత సైన్యం వ్యూహాత్మకంగా ఎంచుకుని, ఘాతక్‌ అనే చిన్న బృందంలోని ఐదుగురు కమాండోలు అక్కడకు వెళ్లి విజయవంతంగా ఆపరేషన్‌ పూర్తి చేశారు. మొత్తం నలుగురు పాక్‌ సైనికులు చనిపోయారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అది నిజం కాదనీ, ముగ్గురు సైనికులు చనిపోగా, ఒకరు గాయపడ్డారని ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రతీకార దాడికి వెళ్లేముందు పాక్‌ శిబిరంపై స్థానిక కమాండర్‌ ఆదేశం మేరకు గట్టి నిఘా పెట్టారు. ఆపరేషన్‌లో చనిపోయిన సైనికులు పాక్‌ బలూచ్‌ పటాలంకు చెందిన వారనీ, దాడి జరిగిన ప్రాంతం రావల్‌కోట్‌లోని కఖ్‌చక్రీ సెక్టార్‌ అని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

కిందిస్థాయి అధికారుల ఆదేశాలతోనే!
సాధారణంగా ఇలాంటి ఆపరేషన్లను భారత సైన్యం చేపట్టడం చాలా అరుదు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ తర్వాత మళ్లీ భారత సైన్యం నియంత్రణ రేఖను దాటి వెళ్లి చేపట్టిన (బహిరంగంగా ప్రకటించిన) ఆపరేషన్‌ ఇదే. ఇలాంటి ఆపరేషన్లు సాధారణంగా పై స్థాయిలోని ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంటాయి. కానీ ఈ ఆపరేషన్‌కు కింది స్థాయి అధికారులే ఆదేశాలు ఇచ్చారని రక్షణ శాఖ వర్గాలు చెప్పాయి. పదాతి దళం నుంచి కొందరు సైనికులను ఎంపిక చేసి వారికి ఈ తరహా ఆపరేషన్స్‌ చేయడానికి అవసరమైన ప్రత్యేక శిక్షణనిచ్చి ఘాతక్‌ అనే చిన్న బృందంలో చేరుస్తారు. ఈ బృందంలోని ఐదుగురు కమాండోలతోనే తాజా ఆపరేషన్‌ జరిగింది.

అవి కట్టుకథలు: పాక్‌
తమ ముగ్గురు సైనికులు చనిపోయింది నిజమే కానీ భారత సైనికులు ఎల్వోసీని దాటి రాలేదని పాక్‌ పేర్కొంది. నియంత్రణ రేఖ వద్ద అశాంతిని రగిలించేందుకు భారత్‌ కట్టుకథలు చెబుతోందని ఆరోపించింది. ఎలాంటి కవ్వింపు చర్యలూ లేకుండానే ఎల్‌ఓసీ అవతలి నుంచే భారత సైన్యం కాల్పు ల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ముగ్గు రు జవాన్లను హతమార్చిందని పాక్‌ ఆరోపించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పాక్‌ సైన్యం కూడా దీటుగా బదులిచ్చిందనీ, కొద్దిసేపటికి భారత్‌ వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయని పాక్‌ అందులో పేర్కొంది. భారత తాత్కాలిక హై కమిషనర్‌కు సమన్లు జారీ చేసి, భారత చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement