retribution
-
చెల్లి హత్యకు ప్రతీకారంగానే బావను హత్య
సాక్షి, వికారాబాద్: వారం రోజుల క్రితం వికారాబాద్ పట్టణంలో జరిగిన ఓ వ్యక్తి దారుణ హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పట్టుకున్న పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాస్‌రావు హత్య వివరాలను వెల్లడించారు. రామయ్యగూడకు చెందిన మృతుడు బసిరెడ్డిపల్లి సత్యనారాయణ (49) 2008లో పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన తన మేన మరదలైన దివ్యను వివాహం చేసుకున్నాడు. ఐతే వివాహం చేసుకున్న 45రోజుల్లోపే దివ్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ హత్య అప్పట్లో పట్టణంలో సంచలనం రేపింది. హత్య జరిగిన సమయంలో దివ్య అన్న పుట్ట వెంకటేశ్ అలియాస్ జాంబ (17) చిన్న వయసులో ఉన్నాడు. అప్పటి (2008) నుంచి సత్యనారాయణపై కక్ష పెంచుకున్నాడు. కొంత కాలంగా అవకాశం కోసం ఎదురుచూసిన వెంకటేష్ ఈ నెల 14న సత్యనారాయణను స్నేహితులతో కలిసి హత్య చేశాడు. చెల్లిని గుర్తు చేసుకొని... సత్యనారాయణను హత్య చేసేందుకు చాలారోజులుగా ఎదురుచూస్తున్న పుట్ట వెంకటేశ్ అలియాస్ జాంబ అందుకు తన ముగ్గురు స్నేహితుల సహకారం తీసుకున్నాడు. 14వ తేదీ సాయంత్రం వెంకటేశ్ తన మిత్రులు నర్సింలు, ఆనందం, శ్రీకాంత్ కలిసి ఓ వైన్స్షాపులో మద్యం సేవించారు. 15వ తేదీన రాఖీ పండుగ ఉండటంతో వెంకటేశ్ తన చెల్లెలు దివ్యను గుర్తుచేసుకొని తన మిత్రుల ముందు కన్నీరు పెట్టుకున్నాడు. తన చెల్లెలు చావుకు కారణమైన బావను హత్య చేస్తానని అందుకు మీ సహకారం కావాలని స్నేహితులను కోరాడు. దీంతో నర్సింలు, ఆనందం, శ్రీకాంత్‌లు సరేనని అంగీకరించారు. ఎదురుపడ్డ సత్యనారాయణ.. సత్యనారాయణను హత్య చేయాలని అనుకున్న ఆ నలుగురు ఇందిరానగర్ చౌరస్తాకు వెళ్లి ఓ హోటల్ ఎదుట నిల్చున్నారు. ఇదే సమయంలో సత్యనారాయణ ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చి సిగరేట్ తీసుకొని తాగుతుండగా ఈ నలుగురికి కనిపించాడు. దీంతో సత్యనారాయణ వద్దకు వచ్చిన వెంకటేశ్ తనకు మద్యం తాగించాలని సత్యనారాయణను అడిగాడు. బావమర్ది అయిన వెంకటేశ్ అడగటంతో సత్యనారాయణ కాదనలేక పట్టణంలోకి వచ్చి మద్యం తీసుకొచ్చాడు. బావ బావమర్దులు కలిసి ఇందిరానగర్‌లోని కల్లు దుకాణం వద్ద తమతోటి తెచ్చుకున్న మద్యం తాగారు. కొంతసేపటి తరువాత సత్యనారాయణ పక్కనే ఉన్న ఓ పాన్ డబ్బా వద్దకు వెళ్లి సిగరేట్ తాగుతున్నాడు. ముందే పథకం వేసుకున్న వెంకటేష్ ఇంటికి వెళ్లి పదునైన కత్తిని తెచ్చుకున్నాడు. అనంతరం వెంకటేశ్, నర్సింలు, ఆనందంలు కలిసి సత్యనారాయణపై దాడి చేశారు. స్థానికులు గొడవను అడ్డుకొని గాయపడ్డ సత్యనారాయణను ఓ ఆటోలో ఎక్కించి ఆస్పత్రికి పంపించారు. అప్పటికే కత్తితో వచ్చిన వెంకటేశ్ అదే ఆటోలో ఎక్కి ఆటో నడుస్తుండగానే సత్యనారాయణ విచక్షణా రహితంగా దాడిచేశాడు. అప్పటికే నర్సింలు, ఆనంద్‌లు ద్విచక్ర వాహనంపై ఆటో వెనకాల వచ్చారు. శివరాంనగర్ సమీపంలోకి రాగానే సత్యనారాయణను ఆటోలో నుంచి కిందికితోసేశారు. అప్పటికే స్పృహకోల్పోయిన సత్యనారాయణను వెంకటేష్ అతడి స్నేహితులు విక్షణా రహితంగా పొడిచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. సత్యనారాయణ హత్యలో వెంకటేష్, నర్సింలు ప్రత్యక్షంగా పాల్గొన్నారని, ఆనంద్, శ్రీకాంత్‌లు వారికి సహకరించినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరరం తప్పించుకొని తిరుగుతున్న నిందితులు వెంకటేశ్, ఆనందం సోమవారం బీదర్‌కు వెళ్తుండగా కొత్తగడి సమీపంలో పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. పరారిలో ఉన్న శ్రీకాంత్, నర్సింలు కోసంగాలిస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు. -
ప్రతీకారంతోనే హత్య
సాక్షి, తిరుపతి: సంచలనం కలిగించిన విద్యార్థి హత్య కేసును అలిపిరి పోలీసులు ఛేదించారు. శనివారం తిరుపతిలోని అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లా అండ్ ఆర్డర్ ఏఎస్పీ అనిల్ బాబు తెలిపిన వివరాలు.. వైఎస్సార్ జిల్లా కోడూరు మండలంఓబులవారిపల్లె చెందిన పి. ద్వారకనాథ్(21) చదలవాడ కళాశాలలో బీబీఏ ఆఖరు సంవత్సరం చదువుతున్నాడు. ఇతను స్థానిక శెట్టిపల్లెలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అతనికి సమీప బంధువైన అశోక్ ఒకే గ్రామానికి చెందిన వారు. వీరితోపాటు అదే గ్రామానికి చెందిన కార్తీక్(19) ఎం.ఆర్. పల్లెలోనిఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ వెస్ట్ చర్చ్ సమీపంలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. గతనెల 25న అశోక్ తన గ్రామానికి చెందిన నాగబ్రహ్మయ్య అలియాస్ బబ్లూకు ఫోన్ చేసి తన తండ్రికి షుగర్ మాత్రలు తీసుకోవాలని ఫోన్ చేశాడు. అయితే ఆ ఫోన్ కాల్‌ను కార్తీక్ రిసీవ్ చేసుకున్నాడు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న కార్తీక్‌కు, అశోక్‌కు మధ్య ఫోన్లో వాగ్వాదం చోటుచేసుకోవడంతో కార్తీక్, అశోక్‌ను తీవ్రంగా దూషించాడు. దీంతో అశోక్ తన బంధువైన ద్వారకనాథ్‌కు ఫోన్ చేసి జరిగిన ఉదంతాన్ని తెలిపాడు. వెంటనే అతను కార్తీక్ గదికి వెళ్లి అతన్ని మందలించాడు. దీంతో అతనిపై కార్తీక్ కక్ష పెంచుకున్నాడు. ద్వారకనాథ్‌ను హతమార్చాలని స్కెచ్ వేశాడు. ఈనెల 5వ తేదీ రాత్రి శెట్టిపల్లె రైల్వే క్రాసింగ్ లైన్ సమీపంలోని బస్టాండ్ వద్దకు వచ్చి మాట్లాడాలని ద్వారకనాథ్‌ను పిలిపించా డు. ఓ హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న నాగరాజుతో పాటు తిరుపతికి చెందిన అఖిల్, భరత్ కుమార్ తన గ్రామానికి చెందిన విద్యార్థులు రోహిత్, జగదీష్, నాగబ్రహ్మయ్య అలియాస్ బబ్లూ, చెంగయ్య, శివకృష్ణారెడ్డితో కలిసి బీరు బాటిళ్లతో ద్వారకానాథ్‌పై దాడి చేశారు. అతడి తలపై మోది వాటితోనే పొడిచి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. దీనిపై హతుడి బావ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన అలిపిరి సీఐ సుబ్బారెడ్డి నిందితులను మంగళం కూడలి వద్ద శనివారం అరెస్టు చేశారు. వారిలో నాగరాజు, అఖిల్ ప్రస్తుతం పరా రీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. కేసును ఛేదించడంలో ఎస్ఐలు షేక్షావలి, వినోద్‌కుమార్, హెచ్‌సీలు కామరాజు, చిరంజీవులు, వసంతకుమార్, పీసీలు నాగరాజు, కుమార్‌రాజా, రాజశేఖర్ ప్రత్యేక చొరవ చూపారని, వీరందరికీ రివార్డులు వచ్చేలా ఎస్పీకి సిఫారసు చేస్తామన్నారు. -
హత్యాయత్నానికి దారి తీసిన విగ్రహ తయారీ
సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : ప్రతీకారంతోనే ఆటో డ్రైవర్ కాయల ఈశ్వర్ (38)పై ప్రత్యర్థులు హత్యాయత్నానికి పాల్పడ్డారని వన్ టౌన్ సీఐ తమీమ్ అహమ్మద్ బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ నెల 8 రాత్రి బుగ్గకాలువలోని యాహల్లి లేఔట్ సమీపంలో కాయల ఈశ్వర్‌పై బుగ్గకాలువలో ఉంటున్న మల్లెల ఆనంద్ కుమార్ వర్గీయులు ఏడుగురు వేట కొడవళ్లతో దాడిచేసి హతమార్చేందుకు యత్నించారని, అనంతరం పారిపోయిన ఏడుగురు నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు చెప్పారు. మరొకరిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఇరువర్గాల నడుమ ఆధిపత్య పోరే హత్యాయత్నానికి దారితీసిందని పేర్కొన్నారు. గత ఏడాది వీధిలో వినాయకుని విగ్రహం ఏర్పాటుచేసే విషయమై ఈశ్వర్ వర్గానికి, మల్లెల ఆనంద్ కుమార్ వర్గానికి ఘర్షణ చోటుచేసుకుందని, అప్పటి నుంచి ఒకరిపై మరొకరు కక్ష పెంచుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక యాహల్లి లేఔట్ సమీపంలో ఈశ్వర్ ఒంటరిగా మద్యం తాగుతున్నాడని తెలుసుకుని ఆనంద్ కుమార్ అనుచరులు బుగ్గకాలువకు చెందిన వనపర్తి వినోద్ కుమార్, వనపర్తి మంజునాథ, గుర్రాల లోకేశ్వర్, ప్రకాశం వీధికి చెందిన మల్లెల సందీప్, కోసువారి పల్లెకు చెందిన మల్లెల శాంతరాజ్, రాంనగర్‌కు చెందిన కుందన రామకృష్ణ కర్రలు, వేటకొడవళ్లతో ఈశ్వర్‌పై దాడి చేశారన్నారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడి తప్పించుకుని జనావాసాల మధ్యకు వచ్చి పడిన బాధితుడిని గమనించిన అక్కడి ప్రజలు వెంటనే సమాచారం ఇవ్వడంతో తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని ప్రాణాపాయస్థితిలో ఉన్న ఈశ్వర్‌ను పోలీస్ వాహనంలోనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం డాక్టర్లు సూచన మేరకు అతన్ని స్విమ్స్‌కు తరలించగా ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలిపారు. హత్య కేసులో నిందితులను పట్టుకోవడానికి శ్రమించిన ఎస్ఐలు, సిబ్బందిని సీఐ అభినందించారు. -
ప్రతీకారం తీర్చుకున్న బలగాలు
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పోలీస్ కానిస్టేబుల్ మొహమ్మద్ సలీమ్ షాను కిరాతకంగా హత్యచేసిన ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు ఆదివారం మట్టుబెట్టాయి. దీంతో ఉగ్రమూకలపై ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. కుల్గామ్ జిల్లాలోని ముతల్హమాకు చెందిన కానిస్టేబుల్ సలీమ్ షా సెలవుపై శుక్రవారం ఇంటికి రాగా, అతన్ని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు తీవ్రంగా హింసించి చంపారు. మరుసటి రోజు రెడ్వానీ పయీన్ గ్రామంలోని ఓ నర్సరీ సమీపంలో సలీమ్ మృతదేహం లభ్యమైంది. ఉగ్రవాదుల ఆచూకీపై నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు రెడ్వానీ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చేపట్టాయి. ఈ కదలికల్ని గుర్తించిన ఉగ్రవాదులు వారిపై విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించగా, వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయమై జమ్మూకశ్మీర్ పోలీస్ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్‌లో భద్రతాబలగాలకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు. ఉగ్రవాదుల్ని పాకిస్తాన్‌కు చెందిన మువావియా, కుల్గామ్‌కు చెందిన సోహైల్ అహ్మద్ దార్, రెహాన్లుగా గుర్తించామన్నారు. వీరంతా లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు పోలీస్ రికార్డుల్లో ఉందన్నారు. ఘటనాస్థలంలో రెండు ఏకే–47 తుపాకులు, మందుగుండు సామగ్రి, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లోని హీరానగర్ సెక్టార్‌లోకి పాక్ నుంచి అక్రమంగా ప్రవేశించడానికి యత్నించిన ఓ పాకిస్తానీ పౌరుడి(24)ని బీఎస్ఎఫ్ ఆదివారం కాల్చిచంపింది. ఇతడు పాక్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదుల్ని కశ్మీర్లోకి తీసుకొచ్చేందుకు గైడ్‌గా పనిచేస్తున్నట్లు భావిస్తున్నారు. ఉగ్రదాడులు తగ్గుముఖం.. జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించినప్పటి నుంచి ఉగ్రదాడులు గణనీయంగా తగ్గాయని కేంద్ర హోంశాఖ విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడయింది. ఉగ్రదాడులు తగ్గినప్పటికీ రాళ్లు విసిరే ఘటనలు మాత్రం రాష్ట్రంలో స్వల్పంగా పెరిగాయి. -
మరో మెరుపు దాడి
భారతీయ ఆర్మీ మరోసారి ప్రతాపం చూపింది. దాయాది దేశం పాకిస్తాన్ కవ్వింపులకు కళ్లు చెదిరే సమాధానం ఇచ్చింది. సరిహద్దులు దాటివెళ్లి శత్రుసైన్య శిబిరంపై విరుచుకుపడింది. గతేడాది జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను గుర్తుకు తెచ్చేలా.. నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) దాటి వెళ్లిన భారత ‘ఘాతక్’ కమాండోలు ముగ్గురు శత్రు సైనికులను హతమార్చి, ఓ జవానును గాయపర్చి వీరోచితంగా తిరిగొచ్చారు. అలా.. శనివారం పాక్ కాల్పుల్లో చనిపోయిన భారత మేజర్ ప్రఫుల్ల అంబదాస్ సహా నలుగురు సహచరులకు తమదైన శైలిలో ఘన నివాళుర్పించారు. పూంచ్ సెక్టార్ దగ్గర్లో సోమవారం సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభమైన ఈ ఆపరేషన్.. 45 నిమిషాల్లో ముగిసింది. న్యూఢిల్లీ: భారత సైన్యం మరో సాహసవంతమైన ఆపరేషన్‌ను చేపట్టింది. ఐదుగురు భారత సైనికులు నియంత్రణ రేఖను దాటి వెళ్లి పాక్ సైన్యానికి చెందిన తాత్కాలిక శిబిరాన్ని కూల్చి, అందులోని ముగ్గురు సైనికులను హతమార్చి వీరోచితంగా తిరిగొచ్చారు. కశ్మీర్లో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాక్ సైన్యం మేజర్ ప్రఫుల్ల సహా నలుగురు భారత సైనికులను పొట్టనబెట్టుకున్న చర్యకు ప్రతీకారంగానే తాజా ఆపరేషన్ జరిగినట్లు భావిస్తున్నారు. భారత జవాన్లందరూ సురక్షితంగా తిరిగొచ్చారని ఆర్మీ వర్గాలు చెప్పాయి. మినీ సర్జికల్ స్ట్రైక్స్! గతేడాది సెప్టెంబరు 28 రాత్రి భారత సైన్యం హెలికాప్టర్లను ఉపయోగించి భారీ ఆపరేషన్‌ను చేపట్టి నియంత్రణ రేఖకు దగ్గర్లో పాక్ సైన్యం మద్దతుతోనే ఏర్పాటైన ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసి రావడం తెలిసిందే. సోమవారం జరిగిన ఆపరేషన్‌లోనూ భారత సైనికులు పూంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖను దాటి అవతలకు వెళ్లి పాక్ సైనికుల భరతం పట్టారు. అయితే ఈ ఆపరేషన్‌ను సర్జికల్ స్ట్రైక్స్‌తో పోల్చలేమనీ, ఇది చాలా చిన్న లక్ష్యంతో, స్వల్ప కాలంలోనే పూర్తయిన దాడి అని ఆర్మీ వర్గాలు చెప్పాయి. కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా కేరీ సెక్టార్లో ఓ మేజర్ సహ నలుగురు భారత సైనికులను శనివారం పాకిస్తాన్ సైన్యం బలిగొంది. దీనికి ప్రతీకారంగానే తాజా దాడి జరిగిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. నియంత్రణ రేఖకు 200 నుంచి 300 మీటర్ల దూరంలో ఉన్న పాక్ శిబిరాన్ని భారత సైన్యం వ్యూహాత్మకంగా ఎంచుకుని, ఘాతక్ అనే చిన్న బృందంలోని ఐదుగురు కమాండోలు అక్కడకు వెళ్లి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. మొత్తం నలుగురు పాక్ సైనికులు చనిపోయారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అది నిజం కాదనీ, ముగ్గురు సైనికులు చనిపోగా, ఒకరు గాయపడ్డారని ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రతీకార దాడికి వెళ్లేముందు పాక్ శిబిరంపై స్థానిక కమాండర్ ఆదేశం మేరకు గట్టి నిఘా పెట్టారు. ఆపరేషన్‌లో చనిపోయిన సైనికులు పాక్ బలూచ్ పటాలంకు చెందిన వారనీ, దాడి జరిగిన ప్రాంతం రావల్కోట్లోని కఖ్చక్రీ సెక్టార్ అని ఆర్మీ వర్గాలు తెలిపాయి. కిందిస్థాయి అధికారుల ఆదేశాలతోనే! సాధారణంగా ఇలాంటి ఆపరేషన్లను భారత సైన్యం చేపట్టడం చాలా అరుదు. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత మళ్లీ భారత సైన్యం నియంత్రణ రేఖను దాటి వెళ్లి చేపట్టిన (బహిరంగంగా ప్రకటించిన) ఆపరేషన్ ఇదే. ఇలాంటి ఆపరేషన్లు సాధారణంగా పై స్థాయిలోని ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంటాయి. కానీ ఈ ఆపరేషన్‌కు కింది స్థాయి అధికారులే ఆదేశాలు ఇచ్చారని రక్షణ శాఖ వర్గాలు చెప్పాయి. పదాతి దళం నుంచి కొందరు సైనికులను ఎంపిక చేసి వారికి ఈ తరహా ఆపరేషన్స్ చేయడానికి అవసరమైన ప్రత్యేక శిక్షణనిచ్చి ఘాతక్ అనే చిన్న బృందంలో చేరుస్తారు. ఈ బృందంలోని ఐదుగురు కమాండోలతోనే తాజా ఆపరేషన్ జరిగింది. అవి కట్టుకథలు: పాక్ తమ ముగ్గురు సైనికులు చనిపోయింది నిజమే కానీ భారత సైనికులు ఎల్వోసీని దాటి రాలేదని పాక్ పేర్కొంది. నియంత్రణ రేఖ వద్ద అశాంతిని రగిలించేందుకు భారత్ కట్టుకథలు చెబుతోందని ఆరోపించింది. ఎలాంటి కవ్వింపు చర్యలూ లేకుండానే ఎల్ఓసీ అవతలి నుంచే భారత సైన్యం కాల్పు ల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ముగ్గు రు జవాన్లను హతమార్చిందని పాక్ ఆరోపించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పాక్ సైన్యం కూడా దీటుగా బదులిచ్చిందనీ, కొద్దిసేపటికి భారత్ వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయని పాక్ అందులో పేర్కొంది. భారత తాత్కాలిక హై కమిషనర్‌కు సమన్లు జారీ చేసి, భారత చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామంది. -
శిక్షలు, జరిమానాలు నామమాత్రమే
అందుకే జంతుహింస పెరుగుతోంది చట్ట సవరణలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తాం రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం హైకోర్టుకు నివేదించిన తెలంగాణ సర్కార్ సాక్షి, హైదరాబాద్: జంతుహింస నిరోధంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. శిక్షలు, జరిమానాలు నామమాత్రంగా ఉండడం వల్లే జంతుహింస ఆగడం లేదని ఉమ్మడి హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నివేదించింది. కఠిన శిక్ష, జరిమానాలకు వీలుగా చట్టాలను సవరించాల్సిన అవసరముందని, దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వివరించింది. జంతుహింసను విచారణకు స్వీకరించదగ్గ నేరం (కాగ్నిజబుల్)గా పరిగణించాలని కూడా కేంద్రాన్ని కోరనున్నామని నివేదించింది. రాష్ట్రస్థాయిలో జంతు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపింది. జంతుహింస నిరోధక చట్టాల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠినచర్యలు తప్పవని సంబంధిత అధికారులకు స్పష్టం చేసినట్లు పేర్కొంది. మార్కెట్ కమిటీల నిధులతో అన్ని పశు సంతల్లో ర్యాంపులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వివరించింది. పిఠాపురం మునిసిపాలిటీ పరిధిలోని పశువుల మార్కెట్లో జంతువులను తీవ్రంగా హింసిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, జంతుహింస నిరోధంపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేలా అధికారులను ఆదేశించాలంటూ జంతురక్షణ సంఘం, గో సంరక్షణ ఫెడరేషన్, మరొకరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం జంతుహింస వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీ కౌంటర్ దాఖలు చేసింది. కాగా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఇటీవల హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. జంతువులను అక్రమంగా తరలిస్తూ క్రూరంగా వ్యవహరిస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించేందుకు సమన్వయంతో పనిచేయాలని రవాణా, పోలీస్, పశు సంవర్థకశాఖలతో జరిగిన సమావేశంలో నిర్ణయించామని తెలిపారు. జంతు రవాణాపై ఫిర్యాదులు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని, జంతుహింస నిరోధక సొసైటీలు(ఎస్పీసీఏ)లను 8 జిల్లాల్లో ఏర్పాటు చేశామని, మిగిలినచోట్ల త్వరలోనే ఏర్పాటు చేస్తామని నివేదించారు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి... ‘చట్ట ప్రకారమే జంతు రవాణాకు అనుమతినిస్తాం. వెటర్నరీ డాక్టర్ జారీ చేసే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా జంతువుల తరలింపునకు అనుమతినివ్వబోం. జంతువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు పశుసంపద వ్యాపారులు తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలి. జంతు రవాణాకు జిల్లా అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. తెలంగాణలో ప్రస్తుతం 19 పశు సంతలున్నాయి. జంతు రవాణాలో నిర్లక్ష్యం వహిస్తే రూ.1000 జరిమానా విధించే అధికారం రవాణాశాఖ కమిషనర్‌కు ఉంది’ అని రాజీవ్‌శర్మ తన కౌంటర్లో పేర్కొన్నారు..