పాక్ సైన్యం దుశ్చర్యే : ఎ.కె.ఆంటోనీ
భారత జవాన్ల హత్యపై ఆంటోనీ
- తొలి ప్రకటనను సవరిస్తూ పార్లమెంటులో ప్రకటన
- భారత్-పాక్ సంబంధాలపై ప్రభావముంటుంది
- బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందే
- భారత్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయరాదు
- పాక్‌కు రక్షణ మంత్రి ఆంటోనీ హెచ్చరిక
- ఉగ్ర సంస్థలను నిర్మూలించాలని డిమాండ్
- స్వాగతించిన సుష్మ.. పెదవి విరిచిన శివసేన
మంగళవారం
కాశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద పలువురు ఉగ్రవాదులు పాకిస్థాన్ సైనికుల యూనిఫామ్ వేసుకున్న వ్యక్తులతో కలిసి భారత జవాన్లపై దాడిచేశారు. ...
నాకు అందిన సమాచారం మేరకు ఉగ్రవాదులు దాడి చేశారనే తెలుసు.
పూర్తి సమాచారం అందేవరకు ఒక నిర్ణయానికి రాకూడదు.
దౌత్యమార్గంలో పాక్‌కు భారత నిరసన తెలిపాం.
- లోక్‌సభలో రక్షణమంత్రి ఆంటోనీ
గురువారం
పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు నుంచి ఒక ముఠా నియంత్రణ రేఖను దాటివచ్చి మన వీర జవాన్లపై దాడిచేసి హత్యచేసిన ఘటనలో పాకిస్థాన్ సైన్యానికి చెందిన ప్రత్యేక బృందాల పాత్ర ఉందని స్పష్టమైంది. భారత్ సహనాన్ని అలసత్వంగా భావించరాదు. మా సాయుధ బలగాల సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయరాదు. ఈ విషాదానికి కారకులైన పాకిస్థాన్‌లోని వ్యక్తులు, ఇంతకుముందు ఇద్దరు సైనికులను కిరాతకంగా హత్యచేసిన వారిని శిక్షించకుండా వదలకూడదు.
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వద్ద మంగళవారం ఐదుగురు భారత జవాన్లను హతమార్చిన దురాగతంలో పాకిస్థాన్ సైన్యం పాత్ర ఉన్నట్టు స్పష్టమైందని రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ ప్రకటించారు. ఈ ఘటన పర్యవసానంగా నియంత్రణ రేఖపై భారత వైఖరిలో, పాకిస్థాన్‌తో సంబంధాల్లో ప్రభావం ఉంటుందని స్పష్టంచేశారు. పాకిస్థాన్‌పై కఠిన స్వరం వినిపిస్తూ.. భారత్ పాటిస్తున్న సంయమనాన్ని అలసత్వంగా పరిగణించరాదని, భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయరాదని హెచ్చరించారు.
కాశ్మీర్ సరిహద్దు వద్ద పూంచ్ సెక్టార్‌లో భారత జవాన్లను హతమార్చింది ఉగ్రవాదులు, పాక్ సైనిక దుస్తుల్లో ఉన్న దుండగులని మంగళవారం లోక్‌సభలో ఆంటోనీ చేసిన ప్రకటనపై ప్రతిపక్షాల నుంచి, ప్రత్యేకించి బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు, నిరసన వ్యక్తమవడం తెలిసిందే. పాక్ సైన్యానికి ఆయన క్లీన్‌చిట్ ఇచ్చారని ఆరోపిస్తూ రెండు రోజులుగా పార్లమెంటును అవి స్తంభింపచేశాయి. దాంతో తొలి ప్రకటనను సవరిస్తూ గురువారం పార్లమెంటులో ఆయన తాజాగా ప్రకటన చేశారు. తొలు త చేసిన ప్రకటన అప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు చేసిందని, అనంతరం సైనికదళాధిపతి ఘటనా ప్రాంతానికెళ్లి వివరాలు సేకరించారన్నారు.
ప్రభావముంటుంది...
‘‘నియంత్రణ రేఖకు అవతల పాకిస్థాన్ వైపు నుంచి.. పాక్ సైన్యం మద్దతు, సహాయం, తోడ్పాటు లేకుండా.. అప్పుడప్పుడూ పాక్ సైన్యం నేరుగా పాత్ర పోషించకుండా ఏమీ జరగదని మనకందరకూ తెలుసు’’ అని ఆంటోనీ వ్యాఖ్యానించారు. ‘‘పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు నుంచి ఒక ముఠా నియంత్రణ రేఖను దాటివచ్చి మన వీర జవాన్లను హత్యచేసిన దాడిలో పాకిస్థాన్ సైన్యానికి చెందిన ప్రత్యేక బృందాల పాత్ర ఉందని ఇప్పుడు స్పష్టమైంది’’ అని చెప్పారు. ఎలాంటి కవ్వింపూ లేకుండా జవాన్లపై జరిపిన కిరాతక దాడి భారతీయులందరినీ తీవ్ర ఆగ్రహానికి గురిచేసిందని పేర్కొన్నారు. ‘‘మా సహనాన్ని అలసత్వంగా భావించరాదు. మా సాయుధ బలగాల సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయరాదు. ఈ విషాదానికి కారకులైన పాకిస్థాన్‌లోని వ్యక్తులు, ఇంతకుముందు ఇద్దరు సైనికులను కిరాతకంగా హత్యచేసిన వారిని శిక్షించకుండా వదలకూడదు.
ఉగ్రవాద వ్యవస్థలను, సంస్థలను, వాటి సదుపాయాలను నిర్మూలించటంలో పాకిస్థాన్ నిబద్ధదతో కూడిన చర్యలు చూపాలి. 2008 నవంబర్ నాటి ముంబై ఉగ్రవాద దాడికి బాధ్యులైన వారిని సత్వరమే చట్టం ముందు నిలబెట్టటానికి ప్రత్యక్ష చర్యలు చేపట్టాలి’’ అని పాకిస్థాన్‌ను డిమాండ్ చేశారు. ఆంటోనీ ప్రకటనను లోక్‌సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్ వెంటనే స్వాగతించారు. రక్షణమంత్రి తన పొరపాటును అంగీకరించి, దానిని సరిదిద్దుకున్నారంటూ సంతోషం వ్యక్తంచేశారు. ఇలాంటి పొరపాటు పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. సుష్మా వ్యాఖ్యలను ఆంటోనీ ముకుళిత హస్తాలతో స్వాగతించారు. అయితే ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షమైన శివసేన మాత్రం ఆంటోనీ తాజా ప్రకటనపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌తో చర్చలు జరపరాదని ఆ పార్టీ నేత అనంత్ గీతె పేర్కొన్నారు. రాజ్యసభలోనూ ఆంటోనీ ఇదే ప్రకటన చదవబోగా గందరగోళం రేగడంతో సభ వాయిదా పడింది. రక్షణమంత్రి సోమవారం రాజ్యసభలో మళ్లీ ఈ ప్రకటన చేస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్‌శుక్లా చెప్పారు. భారత జవాన్ల హత్య ఉదంతం పూర్వాపరాలను సైనికాధిపతి జనరల్ బిక్రమ్‌సింగ్ ఆంటోనీకి వివరించారు.
లోక్‌సభ సోమవారానికి వాయిదా: భారత జవాన్ల హత్య, తెలంగాణ తదితరాలపై తీవ్ర గందరగోళం తలెత్తటంతో లోక్‌సభను సోమవారం వరకూ వాయి దా వేశారు. ఉదయం సభ సమావేశమైన వెంటనే కాంగ్రెస్, టీడీపీ సభ్యులు కొందరు ఆంధ్రప్రదేశ్‌ను సమైక్య రాష్ట్రంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. స్పీక ర్ మీరాకుమార్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ వారు ఆందోళన విరమించకపోవటంతో ఆమె తొలుత మధ్యాహ్నం వరకూ సభను వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత ఆంటోనీ ప్రకటన చేశారు. అనంతరం మళ్లీ గందరగోళం తలెత్తటంతో సభను 2 గంటల వరకూ వాయిదా వేశారు. ఆ తర్వాత సమావేశమైనా కూడా కొద్దిసేపటికే డిప్యూటీ స్పీకర్ కరియాముండా సభను సోమవారానికి వాయిదా వేశారు.