‘సింధురక్షక్’ ఘటనపై రాజ్యసభకు రక్షణ మంత్రి ఆంటోనీ వెల్లడి
న్యూఢిల్లీ/ముంబై: ఐఎన్‌ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదానికి అందులోని యుద్ధసామగ్రి మండటమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సోమవారం రాజ్యసభ లో వెల్లడించారు. ముంబై డాక్‌యార్డ్‌లో మంగళవారం అర్ధరాత్రి సింధురక్షక్ జలాంతర్గామిలో భారీ పేలుళ్లు సంభవించడంతో అది మునిగిపోవడం తెలిసిందే. జలాంతర్గామిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురితో సహా 18 మంది నేవీ సిబ్బంది చిక్కుకోవడం కూడా విదితమే. అయితే సింధురక్షక్‌లో యుద్ధసామగ్రి జ్వలించడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని మంత్రి తెలిపారు.
‘ప్రాథమిక అంచనాల ప్రకారం.. జలాంతర్గామిలో యుద్ధసామగ్రి భద్రపర్చిన ముందు కంపార్ట్‌మెంట్‌లో తొలుత అంతర్గత పేలుడు చోటుచేసుకుంది. ఫలితంగా ఇతర కంపార్ట్‌మెంట్‌లలోనూ పేలుళ్లు జరిగి జలాంతర్గామి క్షణాల్లోనే అగ్నికీలల్లో చిక్కుకుంది. దీంతో సిబ్బంది బయటికి రాలేకపోయారు’ అని ఆంటోనీ వివరించారు. నౌకలను వెలికితీయడంలో పేరుపొందిన అంతర్జాతీయ కంపెనీలను సంప్రదించామని, వారు జలాంతర్గామిని బయటికి తీసేందుకు సర్వేలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకుగాను నిపుణులతో ఒక బోర్డును ఏర్పాటుచేసినట్లు తెలిపారు.
మృతులకు పార్లమెంటు నివాళి...
సింధురక్షక్ ప్రమాదంలో అసువులుబాసిన నేవీ సిబ్బందికి సోమవారం పార్లమెంటు ఉభయసభలు ఘనంగా నివాళులు అర్పించాయి. ఉభయసభలు వేర్వేరుగా సమావేశమైన అనంతరం సంతాప సందేశాన్ని చదవడంతోపాటు విషాదంపై తీవ్ర విచారం వ్యక్తంచేశాయి. అమరులైన నేవీ సిబ్బందికి నివాళిగా ఉభయసభలూ కొన్ని నిమిషాలు మౌనం పాటించాయి.
ఏడో మృతదేహం లభ్యం
సాక్షి, ముంబై: సింధురక్షక్ జలాంతర్గామి నుంచి సోమవారం మరో మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో ఇప్పటిదాకా లభించిన మృతదేహాల సంఖ్య ఏడుకు చేరింది. ఇంకా మరో 11 మంది నేవీ సిబ్బంది ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు గాలింపు కొనసాగిస్తున్నారు. జలాంతర్గామిలో చమురు కలిసిన నీరు, చీకటి, బురద, లోపలి భాగం ధ్వంసమై చిందరవందర కావడంతో నేవీ గజ ఈతగాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే గాలింపు కొనసాగిస్తున్నారు. మృతదేహాలు కాలిపోవడం వల్ల గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో డీఎన్‌ఏ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే మృతులను గుర్తించేందుకు వీలుకానుంది.
యుద్ధసామగ్రి వల్లే పేలుళ్లు: ఆంటోనీ
Published Tue, Aug 20 2013 2:34 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM
Advertisement