సాక్షి, ముంబై: ఐఎన్‌ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదానికి కారణాలతోపాటు అనేక వివరాలు ఇంత వరకు తెలియరాలేదు. దీంతో జలాంతర్గామిని నీటిలో నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 14న నేవల్ డాక్‌యార్డ్‌లో నిర్మితమైన ఐఎన్‌ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో భారీ పేలుళ్లతోపాటు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో జలాంతర్గామిలోని 18 మంది సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన దేశవిదేశాల్లోనూ సంచలనం సృష్టించింది. ప్రమాదం అనంతరం సుమారు 30 అడుగుల సముద్రం లోతున జలాంతర్గామి మునిగిపోయింది. ప్రమాదంలో ఇంకా కొందరి శవాలు లభించలేదని తెలిసింది. మరోవైపు వెలికితీసిన శవాలు కూడా గుర్తుపట్టరానంతగా కాలిపోయాయి. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా కొన్ని మృతదేహాల వివరాలు గుర్తించారు.
అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది..? వీరంతా ఎలా ప్రాణాలు కోల్పోయారు..? తదితర విషయాలను తెలుసుకునేందుకు జలాంతర్గామిని బయటికి తీయాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని బయటికి తీస్తే అనేక వివరాలు అందుతాయని నేవీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 2,300 టన్నుల బరువున్న ఈ జలాంతర్గామిని బయటికి తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మొదట్లో భారీ యంత్రాలతో దీనిని వెలికితీసేందుకు నేవీ సిబ్బంది శ్రమించినా పెద్దగా ఫలితాలు కనిపించలేదని రక్షణరంగ నిపుణుడు ఒకరు తెలిపారు. మనదేశ కంపెనీలకు ఈ భారీ జలాంతర్గామిని నీటి నుంచి బయటికి తీసే సామర్థ్యం లేదని తెలిసింది. అందుకే ఈ రంగంలో అనుభవం ఉన్న అంతర్జాతీయ కంపెనీలను నేవీ ఆహ్వానించింది. ఈ మేరకు ఐదు అంతర్జాతీయ కంపెనీలు జలాంతర్గామిని బయటికి తీసేందుకు ముందుకువచ్చాయి. అయితే వీటిలో ఏదో ఒక కంపెనీతో తొందర్లోనే ఒప్పందం కుదుర్చుకుని సింధురక్షక్‌కు బయటికి తీసే పనులు ప్రారంభిస్తామని నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే జోషీ మీడియాకు చెప్పారు.
ముందుకు సాగనున్న విచారణ
సింధురక్షక్‌కు బయటికి తీయగలిగితే విచారణకు అవసరమైన కీలక ఆధారాలు లభించడంతోపాటు అన్ని రహస్యాలూ బయటపడనున్నాయి. ఈ ఘటనపై కేంద్ర రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ ఆదేశాల మేరకు ‘బోర్డ్ ఆఫ్ ఎంక్వయిరీ’ విచారణ చేపట్టింది. అయితే మూడు నెలలు పూర్తవుతున్నప్పటికీ దీని సభ్యులు ఎలాంటి నివేదికనూ అందించలేదు. సింధురక్షక్‌ను బయటికి తీయగలిగినట్టయితే ఈ సంస్థ కూడా త్వరగా విచారణను ముగించే అవకాశం ఉంది. ఫోరెన్సిక్ నిపుణులకు కూడా మరిన్ని ఆధారాలు లభిస్తాయని చెబుతున్నారు.
అనేక కోణాల్లో విచారణ....
ఈ ఘటన ప్రమాదమా ఉగ్రవాద చర్యా అనే కోణంలో కూడా విచారణ సాగినప్పటికీ ఉగ్రవాద చర్యగా పేర్కొనేందుకు ఎలాంటి ఆధారాలూ లబించలేదు. రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ సైతం ఇదే విషయాన్ని ప్రకటించారు. ప్రమాదానికి కారణమేమిటనే విషయంపై కూడా పక్కాగా ఆధారాలు లభించలేదని తెలిసింది. ఓ వైపు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి హెచ్చరికలు మరోవైపు స్వాతంత్య్రదినోత్సవాలకు ఒకరోజు ముందు ఈ ఘటన జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే నావల్ డాక్‌యార్డ్‌లో ఈ ప్రమాదం జరగడంతో రూ.500 కోట్ల విలువైన జలాంతర్గామి ధ్వంసమయింది. ఇందులోని పేలుడు పదార్థాలు, ఇంధనం, ఆక్సిజన్ బాటిళ్ల కారణంగా పేలుళ్లు సంభవించి ఉంటాయని ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ఈ విషయంపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. మరమ్మతులు కూడా కారణం కావొచ్చునే కోణంలోనూ విచారణ సాగినా తగిన ఆధారాలు దొరకలేదు. సింధురక్షక్ జలాంతర్గామికి రష్యాలో మరమ్మతులు పూర్తి అయిన అనంతరం 2013 జనవరిలోనే మనదేశానికి వచ్చింది. స్వదేశానికి వచ్చిన అనంతరం కూడా అన్ని విధాలా పరీక్షించారు. సాంకేతికంగా ఎలాంటి దోషాలూ లేవని నిర్ధారించుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన అనంతరం మరోసారి అనుమానాలు తలెత్తాయి. ఇదిలాఉంటే సింధురక్షక్ జలాంతర్గామికి గతంలో కూడా ప్రమాదం చోటుచేసుకుంది. 2010లో విశాఖపట్టణంలో ఉండగా అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలోనూ నేవీ ఉద్యోగి ఒకరు మరణించాడు.
భువిపైకి సింధు!
Published Sat, Nov 9 2013 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement