* ముంబై డాక్ యార్డ్‌లో అర్ధరాత్రి దుర్ఘటన
* పేలుళ్లతో సగం వరకు మునిగిపోయిన ‘ఐఎన్‌ఎస్ సింధు రక్షక్’
* రెండు కిలోమీటర్ల వరకు వినిపించిన పేలుడు శబ్దాలు
* పక్కనున్న మరో సబ్‌మెరైన్‌కూ వ్యాపించిన మంటలు
* అగ్నిమాపక దళ తక్షణ స్పందనతో తప్పిన ముప్పు
* సంఘటనా స్థలాన్ని సందర్శించిన రక్షణ మంత్రి ఆంటోనీ, నౌకా దళ ప్రధానాధికారి అడ్మిరల్ జోషి
* 18 మంది బతికే అవకాశం తక్కువేనని వ్యాఖ్య
* జలాంతర్గామిలో టోర్పెడోలు, క్షిపణులు పూర్తి స్థాయిలో ఆయుధాలు
* 2010లోనూ ‘సింధు రక్షక్’లో పేలుడు జరిగిన వైనం
ముంబై: భారత నౌకాదళ చర్రితలో ముందెన్నడూ ఎరుగని ఘోర దుర్ఘటన ఇది. ముంబై కొలాబా డాక్‌యార్డులో నిలిచి ఉన్న ‘ఐఎన్‌ఎస్ సింధు రక్షక్’ జలాంతర్గామిలో మంగళవారం అర్ధరాత్రి వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ముగ్గురు అధికారులు సహా 18 మంది సిబ్బందీ కూడా మరణించి ఉంటారని భావిస్తున్నారు. పేలుళ్లతో చాలా భాగం దెబ్బతిన్న జలాంతర్గామి సముద్రంలో సగం వరకు మునిగిపోయింది.
దుర్ఘటన జరిగిన సమయంలో సబ్‌మెరైన్‌లో టోర్పెడోలు, క్షిపణులు సహా పూర్తిస్థాయిలో ఆయుధాలు ఉన్నాయి. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి రక్షణ మంత్రి ఆంటోనీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేస్తూ.. వారికి అన్ని విధాలా తోడుగా ఉంటామని అన్నారు. అంతకుమించి మాట్లాడ్డానికి ఆయన నిరాకరించారు. వీరితోపాటు సంఘటనా స్థలానికి వచ్చిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ కూడా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
రెండు కిలోమీటర్ల వరకు వినిపించిన పేలుడు శబ్దాలు
అర్ధరాత్రి సబ్‌మెరైన్‌లో చోటుచేసుకున్న పేలుడు తాలూకు శబ్దాలు రెండు కిలోమీటర్ల వరకు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. ఈ పేలుళ్లను కొందరు సెల్‌ఫోన్లతో వీడియో తీశారు. డాక్‌యార్డులో పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలు ఆకాశాన్ని తాకుతున్నట్లు ఆ వీడియోలు స్పష్టంచేస్తున్నాయి. రష్యాలో తయారైన ఈ జలాంతర్గామిలో యాంటీ షిప్ క్లబ్ క్షిపణులు సహా పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నట్లు నౌకా దళ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది పూర్తి స్థాయి భద్రతను కలిగి ఉందని ఇటీవలే నిపుణులు ధ్రువీకరించినట్లు నౌకా దళ ప్రధానాధికారి చెబుతున్నారు.
మరో జలాంతర్గామికీ మంటలు
సింధు రక్షక్‌లో పేలుళ్లు జరిగినప్పుడు సమీపంలో 10-15 అడుగుల దూరంలో మరో జలాంతర్గామి సింధురత్న ఉందని, దానికి మంటలు వ్యాపించినప్పటికీ, అదృష్టవశాత్తూ దానికి ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని ముంబై అగ్నిమాపక దళ సిబ్బంది తెలిపారు. తాము సంఘటనా స్థలానికి చేరుకోగానే మంటలను ఆర్పేందుకు యత్నించామని, రెండో జలాంతర్గామికి అంటుకున్న మంటలను ఆర్పగానే దాన్ని మరో ప్రాంతానికి తరలించారని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ పి.ఎస్.రహందలె తెలిపారు. రెండు జలాంతర్గాముల మంటలను ఆర్పడానికి డజన్లకొద్దీ అగ్నిమాపక వాహనాలు ఉపయోగించినట్లు చెప్పారు.
18 మందీ బతికే అవకాశం తక్కువే: నేవీ అడ్మిరల్ జోషి
జలాంతర్గామిలో మొదట చిన్న స్థాయి పేలుడు సంభవించిందని, తర్వాత రెండు భారీ పేలుళ్లు సంభవించినట్లు తెలిసిందని నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ డి.కె.జోషి విలేకరులతో చెప్పారు.
దీన్ని ఒక విపత్తుగా అభివర్ణించిన ఆయన.. ఈ దుర్ఘటనలో విద్రోహ శక్తుల పాత్ర ఉండే అవకాశమూ లేకపోలేదని, అయితే ప్రస్తుతానికి అలా ఉన్నట్లు సమాచారం ఏదీ అందలేదని అన్నారు. మంగళవారం అర్ధరాత్రి పేలుళ్లు సంభవించగా.. బుధవారం సాయంత్రానికి కూడా అందులోని 18 మంది బతికి ఉన్నారా లేదా అన్నది తెలియరాలేదు.
దీనిపై జోషి మాట్లాడుతూ..‘‘అంతా మంచే జరగాలని కోరుకుందాం. కానీ ఎలాంటి పరిస్థితికైనా మనం సిద్ధంగా ఉండాలి. అద్భుతాలు జరగొచ్చు. జలాంతర్గామిలో ఆక్సిజన్ బ్యాగులుండే అవకాశముంది. వాటిని ఉపయోగించుకుని బతికి బయటపడొచ్చు. అయితే ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది’’ అని వ్యాఖ్యానించారు. పేలుళ్లకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయడానికి ఎంక్వైరీ బోర్డును నియమించామన్నారు.
గతంలోనూ సింధు రక్షక్‌లో పేలుడు
నౌకాదళంలో క్రమేణా జలాంతర్గాముల సంఖ్య తగ్గిపోతున్న సమయంలో ఈ పేలుడు జరిగింది. 2010లో ఇలాగే సింధు రక్షక్‌లో పేలుడు సంభవించి ఒక నావికుడు మరణించారు. ఇద్దరికి గాయాలయ్యాయి. బ్యాటరీ కంపార్ట్‌మెంట్‌లో జరిగిన పేలుడు వల్లే దుర్ఘటన జరిగినట్లు నాడు దర్యాప్తులో తేలింది.
నౌకా దళానికి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: జలాంతర్గాములు అసలే పరిమితంగా ఉన్న భారత నావికా దళానికి, అగ్నిప్రమాదానికి గురైన ‘సింధు రక్షక్’ జలంతర్గామి మునకతో పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. మరో నాలుగు జలాంతర్గాములతో పాటు ‘సింధు రక్షక్’ను రష్యాలో ఆధునీకీకరించారు. నావికాదళం కార్యకలాపాల్లో ఇవి కీలక పాత్ర పోషించాల్సి ఉన్న దశలో ‘సింధు రక్షక్’ ప్రమాదానికి గురై, మునిగిపోవడం పెద్ద నష్టమేనని, ఈ ప్రమాదంతో కార్యాచరణ సంసిద్ధతకు సంబంధించి తాము కొత్త ప్రణాళికలను రూపొం దించుకోవాల్సి ఉంటుందని సీనియర్ నేవీ అధికారి ఒకరు చెప్పారు.
భారత నౌకా దళంలో అణు సామర్థ్యం గల ‘ఐఎన్‌ఎన్ చక్ర’ సహా 15 జలాంతర్గాములు మాత్రమే ఉన్నాయి. కొద్ది రోజుల్లోనే వేరే కార్యక్రమం కోసం ప్రయాణించాల్సి ఉన్న ‘సింధురక్షక్’ ఈలోగా ప్రమాదానికి గురైంది. ఇది పెద్ద నష్టమే అయినా, భారత నావికాదళం తిరిగి త్వరలోనే పరిస్థితిని చక్కదిద్దగలదని నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ సుశీల్‌కుమార్ ఆశాభావం వ్యక్తంచేశారు. అంతర్గత పేలుడు వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని రిటైర్డ్ వైస్ అడ్మిరల్ ఏకే సింగ్ అన్నారు.
‘సింధు రక్షక్’ ప్రస్థానం
1980ల తొలినాళ్లలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రష్యా నుంచి ఈ జలాంతర్గామిని భారత్ కొనుగోలు చేసింది. డీజిల్ జనరేటర్లు-ఎలక్ట్రికల్ బ్యాటరీ శక్తితో పనిచేసే ఈ సబ్‌మెరైన్‌ను 1997లో భారత నౌకాదళంలో మోహరించారు. దీనికి రూ.400 కోట్లు ఖర్చయింది. దీని ఆధునీకీకరణ కోసం రష్యాకు చెందిన జెవ్‌దొచ్ఛాక్కా షిప్‌యార్డుతో భారత రక్షణ మంత్రి 2010 జూన్ 4న ఒప్పందం కుదుర్చుకున్నారు.
అంతకు కొద్దినెలల ముందే, 2010 ఫిబ్రవరిలో విశాఖపట్నం తీరం వద్ద ‘సింధురక్షక్’ అగ్నిప్రమాదానికి గురైంది. హైడ్రోజన్ లీకేజీ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు దర్యాప్తులో తేలింది. మరమ్మతులు, ఆధునికీకరణ కోసం రూ.450 కోట్లు వెచ్చించి దీనిని 2010 ఆగస్టులో రష్యాకు అప్పగించారు.
క్లబ్-ఎస్ రకం క్షిపణులు, రేడియో లొకేటింగ్ రాడార్ సహా ఇతర పరికరాలతో రష్యా దీనిని మరింతగా ఆధునికీకరించి, 2013 జనవరి 27న భారత్‌కు అప్పగించింది. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 29న మళ్లీ నౌకాదళంలో మోహరించారు. భారత్‌కు మొత్తం 15 జలాంతర్గాములు ఉండగా.. అందులో 10 ఈ సింధుఘోష్ రకానివే. వాటిలో ఇప్పుడు ధ్వంసమైనది తొమ్మిదోది.
జలాంతర్గామిలో వరుస పేలుళ్లు: 18 మంది మృతి!
Published Thu, Aug 15 2013 2:58 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
Advertisement
Advertisement