submarine accident
-
తాను వేసిన ఉచ్చులో..
లండన్: చైనాకు సమీపంలోని ఎల్లో సముద్రంలో పశ్చిమ దేశాల జలాంతర్గాములను నిరోధించడానికి తాను వేసిన ఉచ్చులో డ్రాగన్ దేశానికి చెందిన అణు జలాంతర్గామి చిక్కుకుంది. ఈ ప్రమాదంలో చైనాకు చెందిన 55 మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి యూకే ఇంటెలిజెన్స్ రహస్య నివేదిక తమ దగ్గర ఉందని డెయిలీ మెయిల్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆగస్టులో ఎల్లో సముద్రంలో చైనా షాన్డాంగ్ ప్రావిన్స్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతానికి సమీపంలో క్వింగ్డావ్ నౌకాదళ స్థావరం ఉంది. ఆక్కడికి అమెరికా, బ్రిటన్ల జలంతర్గాములు రాకుండా చైనా ఏర్పాటు చేసిన యాంకర్ ఉచ్చులో దాని సబ్‌మెరైన్ చిక్కుకుందని డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ప్రమాదం ఎలా జరిగిందంటే.. ! ఈ సబ్‌మెరైన్ ప్రమాదానికి సంబంధించి యూకే ఇంటెలిజెన్స్ సవివరమైన నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఉన్న వివరాల ప్రకారం ఎల్లో సముద్రంలో ఆగస్టు 21 ఉదయం 8.12 గంటల సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీకి చెందిన అణు జలంతర్గామి 093 చిక్కుకుపోయింది. అమెరికా, దాని మిత్రపక్షాల జలాంతర్గాముల్ని అడ్డుకోవడానికి వేసిన యాంకర్ చైన్‌ను డ్రాగన్ జలంతర్గామి ఢీ కొట్టడంతో అందులో ఎయిర్ ఫ్యూరిఫయర్, ఎయిర్ ట్రీట్మెంట్ వ్యవస్థలు ఆగిపోయి ఉండవచ్చు. సబ్‌మెరైన్‌లో ప్రయాణిస్తున్న సిబ్బంది ఆరుగంటల సేపు శ్రమించి ప్రత్యామ్నాయ వ్యవస్థకు మార్చినా ఫలితం లేకుండా పోయింది. జలాంతర్గామిలో ఉన్న ఆక్సిజన్ విషతుల్యమై హైపాక్సియా అనే పరిస్థితి ఏర్పడి అందులో ప్రయాణిస్తున్న 55 మంది ఉసురు తీసింది. మృతి చెందిన వారిలో జలాంతర్గామి కెప్టెన్ కల్నల్ జీ యాంగ్పెంగ్ సహా 22 మంది అధికారులు, ఏడుగురు ఆఫీసర్ కేడెట్స్, 9 మంది పెట్టీ ఆఫీసర్స్, 17 మంది సిబ్బంది ఉన్నారు. ఆగస్టులో ఈ ప్రమాదం గురించి కొన్ని అంతర్జాతీయ పత్రికలు రాసినా అప్పట్లో చైనా, తైవాన్లు దీనిని తోసిపుచ్చాయి. జలంతర్గాముల్లో హైడ్రోజన్ నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థలు ఉంటాయి. బహుశా చైనా జలాంతర్గామిలో ఆ వ్యవస్థ లేకపోయి ఉండవచ్చునని బ్రిటన్ నిపుణులు చెబుతున్నట్టుగా డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో సబ్మెరైన్నుంచి ఎన్క్రిప్టెడ్ ఆటోమేటిక్ సిగ్నల్ పొరుగు దేశాలకు అందాయని బ్రిటన్ నిపుణులు వెల్లడించారు. అదే సమయంలో బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రసంగం మధ్యలో వెళ్లిపోయారు. అధ్యక్షుడు ప్రసంగ పాఠాన్ని ఆ దేశ వాణిజ్య మంత్రి కొనసాగించారని, ఈ ప్రమాదమే దానికి కారణమన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. -
ఒడ్డుకు చేరిన టైటాన్, కుళ్లిన స్థితిలో అవశేషాలు?
న్యూయార్క్: అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ పడవ సందర్శనం కోసం వెళ్లి.. ఐదుగురు దుర్మరణం పాలైన ఉదంతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ ఐదుగురిని నీటి అడుగునకు మోసుకెళ్లిన టైటాన్ సబ్ మెర్సిబుల్.. వాళ్ల పాలిట మృత్యు శకటంగా మారింది. అయితే ఎట్టకేలకు ఆ శకలాలను అధికారులు బయటకు తీసుకొచ్చారు!. జూన్ 18వ తేదీ ప్రారంభమైన టైటాన్ ప్రయాణం.. కాసేపటికే విషాదంగా ముగిసింది. తీవ్ర ఒత్తిడితో ఈ మినీ జలంతర్గామి పేలిపోగా.. అందులోని ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. కానీ, నాలుగు రోజుల తర్వాత టైటాన్ ప్రమాదంపై యూఎస్ కోస్ట్‌గార్డ్ అధికారికంగా ప్రకటన చేసింది. ఇక అట్లాంటిక్‌లో నీటమునిగిన టైటానిక్ పడవ ముందుభాగంలో 1,600 అడుగుల వద్ద.. దాదాపు 6.5 మీటర్ల పొడవు, 10,431 కిలోల దాకా బరువున్న టైటాన్ కూరుకుపోయినట్లు గుర్తించినట్లు ఇంతకు ముందు అధికారులు ప్రకటించారు. అతికష్టం మీద ఆ శకలాలను బయటకు తెచ్చినట్లు అమెరికా తీర రక్షణ దళం అధికారికంగా బుధవారం ఉదయం ప్రకటించింది. ఎస్యూవీ కారు సైజులో ఉండే టైటాన్ సబ్‌ను అతికష్టం మీద బయటకు తెచ్చారట. న్యూయార్క్‌కు చెందిన పెలాజిగ్ రీసెర్చ్ కంపెనీ తన ఒడీస్సెస్ రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్‌ను సబ్మెర్సిబుల్ వెతుకలాట కోసం ఉపయోగించింది. శకలాలను బయటకు తీయగానే.. అది తన ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటించింది. అతిజాగ్రత్తగా బయటకు తీసిన శకలాల నుంచి మానవ అవశేషాలను బయటకు తీస్తారని, వాటిని వైద్య పరిశోధకులు పరిశీలిస్తారని యూఎస్ కోస్ట్‌గార్డ్ ప్రకటించింది. తద్వారా ప్రమాదం జరిగిన తీరు.. వాళ్లెలా చనిపోయారనేదానిపై ఓ అంచనానికి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే కెనడా అధికారులు మాత్రం శకలాల వెలికితీత అంశంపై స్పందిచకపోవడం గమనార్హం. బ్రిటిష్ సాహసికుడు హమీష్ హర్దింగ్, ఫ్రెంచ్ సబ్‌మెరిన్ ఎక్స్పర్ట్ పాల్ హెన్రీ, పాక్-బ్రిటిష్ బిలియనీర్ షాహ్జాదా దావూద్.. అతని థనయుడు సులేమాన్, ఈ మొత్తం ప్రయాణానికి కారణమైన ఓషన్‌గేట్ సీఈవో స్టాక్టన్ రష్‌లు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై యూఎస్కోస్ట్ గార్డు హయ్యెస్ట్ లెవల్ దర్యాప్తు ‘‘ మెరైన్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’’కు ఆదేశించింది కూడా. The US Coast Guard said on Wednesday that it has recovered "presumed human remains" from the wreckage of the #Titan submersible. https://t.co/I9Hh5U8iku pic.twitter.com/9eCWdaMOFj — China Daily (@ChinaDaily) June 29, 2023 ఇదీ చదవండి: అట్లాంటిక్‌లో టైటాన్ ప్రమాదం.. అసలు జరిగింది ఇదే -
అందులో అలా... ఇప్పుడు ఇలా
సముద్రగర్భంలో టైటానిక్ శిథిలాలను చూడడానికి ‘టైటాన్’ అనే జలాంతర్గామిలో వెళ్లిన అయిదుగురు సాహసికుల ప్రయాణం విషాదాంతం అయిన నేపథ్యంలో యానిమేటెడ్ సిట్కాం ‘ది సింప్సన్’ లోని చిత్రాలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం... 2006లో వచ్చిన ‘ది సింప్సన్’ సీజన్ 17లోని పదో ఎపిసోడ్లో హీరో హోమర్ సింప్సన్ తన తండ్రి మాసన్‌తో కలిసి జలాంతర్గామిలో సముద్రగర్భంలోకి వెళతాడు. ఒకచోట నిధులతో కూడిన శిథిలమైన నావ కనిపిస్తుంది. ఆ తరువాత వీరి జలాంతర్గామి పగడపు దిబ్బల మధ్యలో చిక్కుకు పోతుంది. మరోవైపు జలాంతర్గామిలో ‘లో ఆక్సిజన్’ సైన్ ఫ్లాష్ అవుతుంటుంది. ఈ ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు తండ్రీకొడుకులు బయటపడతారు. ‘ది సింప్సన్స్’లోని తండ్రీకొడుకులు మాసన్, హోమర్ సింప్సన్లను, టైటాన్లో ప్రయాణించిన తండ్రీకొడుకులు షెహ్జాదా దావూద్, సులేమాన్ దావూద్లతో పోల్చి నెటిజనులు పోస్ట్‌లు పెడుతున్నారు. ‘ది సింప్సన్’ రచయిత మైక్ రీస్ టైటానిక్ శిథిలాలను చూడడానికి గత సంవత్సరం భార్యతో కలిసి సముద్ర గర్భంలోకి వెళ్లివచ్చాడు. వారు ప్రయాణించిన జలాంతర్గామిలో కొద్ది సమయం పాటు కమ్యూనికేషన్ సమస్యలు వచ్చినా ఆ తరువాత సర్దుకుంది. -
ప్రయాణం.. విషాదాంతం
బోస్టన్: ఒకరు ‘టైటానిక్’ నిపుణుడు.. మరొకరు సాహసి..ఇంకొకరు సీఈవో..ఇంకా ప్రముఖ వ్యాపారవేత్త, ఆయన కొడుకు..! వీరంతా ‘టైటాన్’అనే మినీ సబ్‌మెరైన్‌లో టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్తూ అట్లాంటిక్ సముద్రంలో గల్లంతయ్యారు. ఈ అయిదుగురూ మృతి చెందినట్లు భావిస్తున్నామని అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. న్యూఫౌండ్‌ల్యాండ్ రాష్ట్రం సెంట్ జాన్స్‌కు సుమారు700 కిలోమీటర్ల దూరంలో ఆదివారం ఉదయం ‘టైటాన్’సముద్రాంతర యాత్రకు బయలుదేరింది. టైటానిక్ వైపుగా నీటి అడుగుకు ప్రయాణం ప్రారంభించిన 1.45 గంటలకే ప్రధాన నౌక పోలార్ ప్రిన్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. అందులోని ఆక్సిజన్ నిల్వలు గురువారం ఉదయం 6 గంటల వరకు మాత్రమే సరిపోతాయి. దీంతో, అమెరికా, కెనడా విమానాలు, నౌకలు, రోబోల సాయంతో టైటాన్ జాడ కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. చివరికి, టైటాన్ శకలాలను తమ రోబో టైటాన్ శకలాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్‌గార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఉన్న ఓషన్ గేట్ సంస్థ చీఫ్ పైలట్, సీఈవో స్టాక్టన్ రష్, సాహసి హామిష్ హార్డింగ్,, పాక్ జాతీయుడైన వాణిజ్యవేత్త షహ్జాదా దావూద్, ఆయన కొడుకు సులేమాన్, టైటానిక్ నిపుణుడు నర్గియెలెట్ మృతి చెందారని తెలిపింది. అయితే, అది ఎందుకు? ఎలా? ఎప్పుడు? ప్రమాదం బారిన పడి ఉంటుందనే విషయం తెలుసుకునేందుకు అన్వేషణ కొనసాగిస్తామన్నారు. -
జలాంతర్గామిలో వరుస పేలుళ్లు: 18 మంది మృతి!
* ముంబై డాక్ యార్డ్‌లో అర్ధరాత్రి దుర్ఘటన * పేలుళ్లతో సగం వరకు మునిగిపోయిన ‘ఐఎన్ఎస్ సింధు రక్షక్’ * రెండు కిలోమీటర్ల వరకు వినిపించిన పేలుడు శబ్దాలు * పక్కనున్న మరో సబ్మెరైన్కూ వ్యాపించిన మంటలు * అగ్నిమాపక దళ తక్షణ స్పందనతో తప్పిన ముప్పు * సంఘటనా స్థలాన్ని సందర్శించిన రక్షణ మంత్రి ఆంటోనీ, నౌకా దళ ప్రధానాధికారి అడ్మిరల్ జోషి * 18 మంది బతికే అవకాశం తక్కువేనని వ్యాఖ్య * జలాంతర్గామిలో టోర్పెడోలు, క్షిపణులు పూర్తి స్థాయిలో ఆయుధాలు * 2010లోనూ ‘సింధు రక్షక్’లో పేలుడు జరిగిన వైనం ముంబై: భారత నౌకాదళ చర్రితలో ముందెన్నడూ ఎరుగని ఘోర దుర్ఘటన ఇది. ముంబై కొలాబా డాక్‌యార్డులో నిలిచి ఉన్న ‘ఐఎన్ఎస్ సింధు రక్షక్’ జలాంతర్గామిలో మంగళవారం అర్ధరాత్రి వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ముగ్గురు అధికారులు సహా 18 మంది సిబ్బందీ కూడా మరణించి ఉంటారని భావిస్తున్నారు. పేలుళ్లతో చాలా భాగం దెబ్బతిన్న జలాంతర్గామి సముద్రంలో సగం వరకు మునిగిపోయింది. దుర్ఘటన జరిగిన సమయంలో సబ్‌మెరైన్‌లో టోర్పెడోలు, క్షిపణులు సహా పూర్తిస్థాయిలో ఆయుధాలు ఉన్నాయి. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి రక్షణ మంత్రి ఆంటోనీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేస్తూ.. వారికి అన్ని విధాలా తోడుగా ఉంటామని అన్నారు. అంతకుమించి మాట్లాడ్డానికి ఆయన నిరాకరించారు. వీరితోపాటు సంఘటనా స్థలానికి వచ్చిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ కూడా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రెండు కిలోమీటర్ల వరకు వినిపించిన పేలుడు శబ్దాలు అర్ధరాత్రి సబ్‌మెరైన్‌లో చోటుచేసుకున్న పేలుడు తాలూకు శబ్దాలు రెండు కిలోమీటర్ల వరకు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. ఈ పేలుళ్లను కొందరు సెల్ఫోన్లతో వీడియో తీశారు. డాక్‌యార్డులో పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలు ఆకాశాన్ని తాకుతున్నట్లు ఆ వీడియోలు స్పష్టంచేస్తున్నాయి. రష్యాలో తయారైన ఈ జలాంతర్గామిలో యాంటీ షిప్ క్లబ్ క్షిపణులు సహా పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నట్లు నౌకా దళ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది పూర్తి స్థాయి భద్రతను కలిగి ఉందని ఇటీవలే నిపుణులు ధ్రువీకరించినట్లు నౌకా దళ ప్రధానాధికారి చెబుతున్నారు. మరో జలాంతర్గామికీ మంటలు సింధు రక్షక్‌లో పేలుళ్లు జరిగినప్పుడు సమీపంలో 10-15 అడుగుల దూరంలో మరో జలాంతర్గామి సింధురత్న ఉందని, దానికి మంటలు వ్యాపించినప్పటికీ, అదృష్టవశాత్తూ దానికి ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని ముంబై అగ్నిమాపక దళ సిబ్బంది తెలిపారు. తాము సంఘటనా స్థలానికి చేరుకోగానే మంటలను ఆర్పేందుకు యత్నించామని, రెండో జలాంతర్గామికి అంటుకున్న మంటలను ఆర్పగానే దాన్ని మరో ప్రాంతానికి తరలించారని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ పి.ఎస్.రహందలె తెలిపారు. రెండు జలాంతర్గాముల మంటలను ఆర్పడానికి డజన్లకొద్దీ అగ్నిమాపక వాహనాలు ఉపయోగించినట్లు చెప్పారు. 18 మందీ బతికే అవకాశం తక్కువే: నేవీ అడ్మిరల్ జోషి జలాంతర్గామిలో మొదట చిన్న స్థాయి పేలుడు సంభవించిందని, తర్వాత రెండు భారీ పేలుళ్లు సంభవించినట్లు తెలిసిందని నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ డి.కె.జోషి విలేకరులతో చెప్పారు. దీన్ని ఒక విపత్తుగా అభివర్ణించిన ఆయన.. ఈ దుర్ఘటనలో విద్రోహ శక్తుల పాత్ర ఉండే అవకాశమూ లేకపోలేదని, అయితే ప్రస్తుతానికి అలా ఉన్నట్లు సమాచారం ఏదీ అందలేదని అన్నారు. మంగళవారం అర్ధరాత్రి పేలుళ్లు సంభవించగా.. బుధవారం సాయంత్రానికి కూడా అందులోని 18 మంది బతికి ఉన్నారా లేదా అన్నది తెలియరాలేదు. దీనిపై జోషి మాట్లాడుతూ..‘‘అంతా మంచే జరగాలని కోరుకుందాం. కానీ ఎలాంటి పరిస్థితికైనా మనం సిద్ధంగా ఉండాలి. అద్భుతాలు జరగొచ్చు. జలాంతర్గామిలో ఆక్సిజన్ బ్యాగులుండే అవకాశముంది. వాటిని ఉపయోగించుకుని బతికి బయటపడొచ్చు. అయితే ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది’’ అని వ్యాఖ్యానించారు. పేలుళ్లకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయడానికి ఎంక్వైరీ బోర్డును నియమించామన్నారు. గతంలోనూ సింధు రక్షక్‌లో పేలుడు నౌకాదళంలో క్రమేణా జలాంతర్గాముల సంఖ్య తగ్గిపోతున్న సమయంలో ఈ పేలుడు జరిగింది. 2010లో ఇలాగే సింధు రక్షక్‌లో పేలుడు సంభవించి ఒక నావికుడు మరణించారు. ఇద్దరికి గాయాలయ్యాయి. బ్యాటరీ కంపార్ట్మెంట్లో జరిగిన పేలుడు వల్లే దుర్ఘటన జరిగినట్లు నాడు దర్యాప్తులో తేలింది. నౌకా దళానికి ఎదురుదెబ్బ న్యూఢిల్లీ: జలాంతర్గాములు అసలే పరిమితంగా ఉన్న భారత నావికా దళానికి, అగ్నిప్రమాదానికి గురైన ‘సింధు రక్షక్’ జలంతర్గామి మునకతో పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. మరో నాలుగు జలాంతర్గాములతో పాటు ‘సింధు రక్షక్’ను రష్యాలో ఆధునీకీకరించారు. నావికాదళం కార్యకలాపాల్లో ఇవి కీలక పాత్ర పోషించాల్సి ఉన్న దశలో ‘సింధు రక్షక్’ ప్రమాదానికి గురై, మునిగిపోవడం పెద్ద నష్టమేనని, ఈ ప్రమాదంతో కార్యాచరణ సంసిద్ధతకు సంబంధించి తాము కొత్త ప్రణాళికలను రూపొం దించుకోవాల్సి ఉంటుందని సీనియర్ నేవీ అధికారి ఒకరు చెప్పారు. భారత నౌకా దళంలో అణు సామర్థ్యం గల ‘ఐఎన్ఎన్ చక్ర’ సహా 15 జలాంతర్గాములు మాత్రమే ఉన్నాయి. కొద్ది రోజుల్లోనే వేరే కార్యక్రమం కోసం ప్రయాణించాల్సి ఉన్న ‘సింధురక్షక్’ ఈలోగా ప్రమాదానికి గురైంది. ఇది పెద్ద నష్టమే అయినా, భారత నావికాదళం తిరిగి త్వరలోనే పరిస్థితిని చక్కదిద్దగలదని నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ సుశీల్‌కుమార్ ఆశాభావం వ్యక్తంచేశారు. అంతర్గత పేలుడు వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని రిటైర్డ్ వైస్ అడ్మిరల్ ఏకే సింగ్ అన్నారు. ‘సింధు రక్షక్’ ప్రస్థానం 1980ల తొలినాళ్లలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రష్యా నుంచి ఈ జలాంతర్గామిని భారత్ కొనుగోలు చేసింది. డీజిల్ జనరేటర్లు-ఎలక్ట్రికల్ బ్యాటరీ శక్తితో పనిచేసే ఈ సబ్‌మెరైన్‌ను 1997లో భారత నౌకాదళంలో మోహరించారు. దీనికి రూ.400 కోట్లు ఖర్చయింది. దీని ఆధునీకీకరణ కోసం రష్యాకు చెందిన జెవ్దొచ్ఛాక్కా షిప్‌యార్డుతో భారత రక్షణ మంత్రి 2010 జూన్ 4న ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకు కొద్దినెలల ముందే, 2010 ఫిబ్రవరిలో విశాఖపట్నం తీరం వద్ద ‘సింధురక్షక్’ అగ్నిప్రమాదానికి గురైంది. హైడ్రోజన్ లీకేజీ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు దర్యాప్తులో తేలింది. మరమ్మతులు, ఆధునికీకరణ కోసం రూ.450 కోట్లు వెచ్చించి దీనిని 2010 ఆగస్టులో రష్యాకు అప్పగించారు. క్లబ్-ఎస్ రకం క్షిపణులు, రేడియో లొకేటింగ్ రాడార్ సహా ఇతర పరికరాలతో రష్యా దీనిని మరింతగా ఆధునికీకరించి, 2013 జనవరి 27న భారత్‌కు అప్పగించింది. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 29న మళ్లీ నౌకాదళంలో మోహరించారు. భారత్‌కు మొత్తం 15 జలాంతర్గాములు ఉండగా.. అందులో 10 ఈ సింధుఘోష్ రకానివే. వాటిలో ఇప్పుడు ధ్వంసమైనది తొమ్మిదోది. -
సబ్‌మెరైన్ ప్రమాదంలో ఇద్దరువిశాఖ వాసులు గల్లంతు
సాక్షి, విశాఖపట్నం: ఆ కొడుకంటే తల్లిదండ్రులకు ప్రాణం. కనిష్ట పుత్రుడు కావడంతో అల్లారుముద్దుగా పెంచారు. కంటికిరెప్పలా కాపాడుకున్నారు. ఆశల ప్రతిరూపంగా తీర్చిదిద్దారు. దేశమాత సేవ కోసం దూరం వెళ్తానంటే కన్నకొడుకు ఆనందం కోసమరి సర్దిచెప్పుకున్నారు. కానీ తమ ఆరోప్రాణమైన వాడు ఇక ఏనాటికీ కనబడడేమోనన్న దుర్భర వాస్తవం పిడుగుపాటులా మీదపడేసరికి విలవిలలాడుతూ నేలకూలిపోయారు. విధి వికృత క్రీడను తలచుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు. ముంబయి డాక్‌యార్డులో సబ్‌మెరైన్ పేలిపోయిన ఘోర సంఘటనలో కొడుకు రాజేష్ గల్లంతయ్యాడనే సమాచారంతో అమ్మానాన్నలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతవడానికి కొన్ని గంటలముందు ఫోన్లో మాట్లాడిన బిడ్డ మాటలు ఇంకా తమ చెవుల్లో మార్మోగుతూ ఉంటే విలవిలలాడుతున్నారు. చేతికి అందివచ్చి పేగుబంధం కొండంత అండగా నిలుస్తుందనుకుంటే... ఇంతలో మృత్యువు తన దగ్గరకు చేర్చుకుంటుందేమోననే భయంతో విలపిస్తున్నారు... ఇదీ ముంబై డాక్‌యార్డ్ ఘటనలో గల్లంతైన నావికుడు తూతిక రాజేష్ కుటుంబ కన్నీటి గాథ. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు గ్రామానికి చెందిన తూతిక రాజేష్(29) సైలర్‌గా పదేళ్ల క్రితం ముంబై నేవల్ డాక్‌యార్డులో చేరారు. ఆరేళ్లపాటు అక్కడ పనిచేసిన అతను బదిలీపై విశాఖపట్నం డాక్‌యార్డుకు వచ్చారు. దూరవిద్యలో బీటెక్ పూర్తి చేయడంతో సబ్‌మెరైన్ ఇంజినీర్‌గా పదోన్నతి పొందారు. రాజేష్‌కు శ్రీకాకుళం జిల్లా బత్తిలి గ్రామానికి చెందిన దంతం జ్యోతితో 2011 జూన్‌లో వివాహమైంది. రాజేష్‌కు ముంబై డాక్‌యార్డుకు బదిలీ కావడంతో రెండు నెలలుగా భార్యతో కలిసి ముంబై క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. సింధు రక్షక్ సబ్‌మెరైన్‌లో ప్రమాదంలో రాజేష్ గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన విషయాన్ని అతని భార్య జ్యోతి సోదరులు దయానంద్, సింహాచలంలకు నేవల్ అధికారులు తెలియజేయడంతో వారు రాజేష్ తల్లిదండ్రులకు ఫోన్లో ఈ విషాద వార్తను తెలిపారు. దీంతో రాజేష్ తల్లిదండ్రులైన అప్పలనాయుడు, కృష్ణవేణి శోకసముద్రంలో మునిగిపోయారు. ముంబై డాక్యార్డులోని నేవీ సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ సింధురక్షక్ అగ్ని ప్రమాద ఘటనలో విశాఖనగరానికి చెందిన ఇద్దరు నావికులు గల్లంతయ్యారు. వీరి జాడ ఇంకా తెలియకపోవడంతో కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఈ ఘటనలో 18మంది మృత్యువాత పడ్డారని ప్రకటించడంతో ఇక్కడి కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. మృతుల్లో తమ వారు ఉన్నారేమోనన్న భయంతో సతమతమవుతున్నాయి. ముంబై డాక్‌యార్డులో నావికులుగా నగరానికి చెందిన తూతిక రాజేష్(29), దాసరి ప్రసాద్(35) పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో వీరు చిక్కుకోకూడదని శతకోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నాయి. తూతిక రాజేష్‌ది పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు గ్రామం. సబ్‌మెరైన్ మెకానికల్ ఇంజినీర్‌గా సైలర్హోదాలో పదేళ్ల క్రితం ముంబై నేవల్ డాక్‌యార్డులో చేరారు. అక్కడ ఆరేళ్లు పనిచేసిన తర్వాత బదిలీపై విశాఖపట్నం డాక్ యార్డుకు వచ్చాడు. మంచిపనితీరు కనబర్చడంతో సబ్‌మెరైన్ ఇంజనీరింగ్‌గా పదోన్నతి సాధించారు. ఈనేపథ్యంలో పదోన్నతి కారణంగా రాజేష్‌కు ముంబైడాక్యార్డుకు రెండునెలలకిందట బదిలీ అయింది.దీంతో భార్య దంతం జ్యోతిని తీసుకువెళ్లి అక్కడ క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు.అయితే విధినిర్వహణలో భాగంగా సింధురక్షక్ సబ్‌మెరైన్‌లో ప్రమాదం సంభవించే సమయంలో రాజేష్ అక్కడే ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం చేరడంతో ఇప్పుడు వారంతా గుండెలవిసేలా రోదిస్తున్నారు.