సబ్‌మెరైన్ ప్రమాదంలో ఇద్దరువిశాఖ వాసులు గల్లంతు
Published Thu, Aug 15 2013 2:10 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
సాక్షి, విశాఖపట్నం: ఆ కొడుకంటే తల్లిదండ్రులకు ప్రాణం. కనిష్ట పుత్రుడు కావడంతో అల్లారుముద్దుగా పెంచారు. కంటికిరెప్పలా కాపాడుకున్నారు. ఆశల ప్రతిరూపంగా తీర్చిదిద్దారు. దేశమాత సేవ కోసం దూరం వెళ్తానంటే కన్నకొడుకు ఆనందం కోసమరి సర్దిచెప్పుకున్నారు. కానీ తమ ఆరోప్రాణమైన వాడు ఇక ఏనాటికీ కనబడడేమోనన్న దుర్భర వాస్తవం పిడుగుపాటులా మీదపడేసరికి విలవిలలాడుతూ నేలకూలిపోయారు. విధి వికృత క్రీడను తలచుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు. ముంబయి డాక్‌యార్డులో సబ్‌మెరైన్ పేలిపోయిన ఘోర సంఘటనలో కొడుకు రాజేష్ గల్లంతయ్యాడనే సమాచారంతో అమ్మానాన్నలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గల్లంతవడానికి కొన్ని గంటలముందు ఫోన్‌లో మాట్లాడిన బిడ్డ మాటలు ఇంకా తమ చెవుల్లో మార్మోగుతూ ఉంటే విలవిలలాడుతున్నారు. చేతికి అందివచ్చి పేగుబంధం కొండంత అండగా నిలుస్తుందనుకుంటే... ఇంతలో మృత్యువు తన దగ్గరకు చేర్చుకుంటుందేమోననే భయంతో విలపిస్తున్నారు... ఇదీ ముంబై డాక్‌యార్డ్ ఘటనలో గల్లంతైన నావికుడు తూతిక రాజేష్ కుటుంబ కన్నీటి గాథ.
విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు గ్రామానికి చెందిన తూతిక రాజేష్(29) సైలర్‌గా పదేళ్ల క్రితం ముంబై నేవల్ డాక్‌యార్డులో చేరారు. ఆరేళ్లపాటు అక్కడ పనిచేసిన అతను బదిలీపై విశాఖపట్నం డాక్‌యార్డుకు వచ్చారు. దూరవిద్యలో బీటెక్ పూర్తి చేయడంతో సబ్‌మెరైన్ ఇంజినీర్‌గా పదోన్నతి పొందారు. రాజేష్‌కు శ్రీకాకుళం జిల్లా బత్తిలి గ్రామానికి చెందిన దంతం జ్యోతితో 2011 జూన్‌లో వివాహమైంది. రాజేష్‌కు ముంబై డాక్‌యార్డుకు బదిలీ కావడంతో రెండు నెలలుగా భార్యతో కలిసి ముంబై క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. సింధు రక్షక్ సబ్‌మెరైన్‌లో ప్రమాదంలో రాజేష్ గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన విషయాన్ని అతని భార్య జ్యోతి సోదరులు దయానంద్, సింహాచలంలకు నేవల్ అధికారులు తెలియజేయడంతో వారు రాజేష్ తల్లిదండ్రులకు ఫోన్‌లో ఈ విషాద వార్తను తెలిపారు. దీంతో రాజేష్ తల్లిదండ్రులైన అప్పలనాయుడు, కృష్ణవేణి శోకసముద్రంలో మునిగిపోయారు.
ముంబై డాక్‌యార్డులోని నేవీ సబ్‌మెరైన్ ఐఎన్‌ఎస్ సింధురక్షక్ అగ్ని ప్రమాద ఘటనలో విశాఖనగరానికి చెందిన ఇద్దరు నావికులు గల్లంతయ్యారు. వీరి జాడ ఇంకా తెలియకపోవడంతో కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఈ ఘటనలో 18మంది మృత్యువాత పడ్డారని ప్రకటించడంతో ఇక్కడి కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. మృతుల్లో తమ వారు ఉన్నారేమోనన్న భయంతో సతమతమవుతున్నాయి. ముంబై డాక్‌యార్డులో నావికులుగా నగరానికి చెందిన తూతిక రాజేష్(29), దాసరి ప్రసాద్(35) పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో వీరు చిక్కుకోకూడదని శతకోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నాయి.
తూతిక రాజేష్‌ది పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు గ్రామం. సబ్‌మెరైన్ మెకానికల్ ఇంజినీర్‌గా సైలర్‌హోదాలో పదేళ్ల క్రితం ముంబై నేవల్ డాక్‌యార్డులో చేరారు. అక్కడ ఆరేళ్లు పనిచేసిన తర్వాత బదిలీపై విశాఖపట్నం డాక్ యార్డుకు వచ్చాడు. మంచిపనితీరు కనబర్చడంతో సబ్‌మెరైన్ ఇంజనీరింగ్‌గా పదోన్నతి సాధించారు. ఈనేపథ్యంలో పదోన్నతి కారణంగా రాజేష్‌కు ముంబైడాక్‌యార్డుకు రెండునెలలకిందట బదిలీ అయింది.దీంతో భార్య దంతం జ్యోతిని తీసుకువెళ్లి అక్కడ క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు.అయితే విధినిర్వహణలో భాగంగా సింధురక్షక్ సబ్‌మెరైన్‌లో ప్రమాదం సంభవించే సమయంలో రాజేష్ అక్కడే ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం చేరడంతో ఇప్పుడు వారంతా గుండెలవిసేలా రోదిస్తున్నారు.
Advertisement
Advertisement