జలాంతర్గామి ప్రమాదం: కావాలంటే సాయం చేస్తామన్న అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ
పేలిపోయి మునిగిపోయిన ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి నుంచి మృతదేహాలను వెలికి తీయడానికి అవసరమైతే తాము సాయం అందిస్తామంటూ పలు దేశాలు ముందుకొస్తున్నాయి. ప్రమాద విషయం తెలియగానే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు సహాయ కార్యకలాపాలలో అవసరమైతే సాయం చేస్తామని భారత నావికాదళ అధికారులకు తెలిపాయి.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో పేలుడు, భారీ అగ్నిప్రమాదం సంభవించడం, దానిలో ఉన్న దాదాపు 18 మందీ మరణించి ఉంటారని భావించడం తెలిసిందే. ఇప్పటికి కేవలం నలుగురి మృతదేహాలను మాత్రమే వెలికితీయగలిగారు.
అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు జలాంతర్గాముల నిర్మాణంతో పాటు ఆపత్సమయాల్లో ఎలా వ్యవహరించాలనే విషయంలో కూడా నైపుణ్యం ఉంది.
ప్రస్తుతం భారత నౌకాదళ వర్గాలు కూడా యుద్ధనౌకల విషయంలో రక్షణచర్యలు చేపట్టే అంతర్జాతీయ కంపెనీలతో సంప్రదింపుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం ఐఎన్ఎస్ విద్యగిరి అనే నౌక ముంబై హార్బర్లో ప్రవేశించేటప్పుడు ఓ వాణిజ్య నౌకను ఢీకొనడంతో.. ఇటీవలే నౌకాదళం ఇటీవలే ఓ డచ్చి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
జలాంతర్గామిని పైకి తీసుకురాగలిగితే, దానికి ఎంతమేర నష్టం జరిగింది, పేలుడు కారణంగా దానిలోని ఏయే భాగాలు ఎంతవరకు పాడయ్యాయనే విషయాలు కూడా తెలుస్తాయి. దాంతోపాటు పేలుడుకు గల కారణాలేంటో కూడా తెలిసే అవకాశం ఉంది. ముంబైలో జరుగుతున్న సహాయ కార్యకలాపాలను నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ డీకే జోషి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన రక్షణ మంత్రి ఏకే ఆంటోనీకి, రక్షణ శాఖ కార్యదర్శి ఆర్కే మాథుర్కు కూడా ఎప్పటికప్పుడు వివరాలు చెబుతున్నారు.