దేశమాత సేవలో.. అమరుడైన రాజేష్
(కేవీపీ రామగుప్తా)
పెదగంట్యాడ: మృత్యువు అతడిని వెంటాడింది. దేశమాత సేవలో పునీతుడు అవుదామని కుటుంబంలో చిన్న కుమారుడైనా సరే.. నౌకాదళంలో చేరాడు. తొలుత సెయిలర్గానే జీవితం ఆరంభించినా, పట్టుదలతో కరస్పాండెన్స్ పద్ధతిలో బీటెక్ పూర్తిచేసి, జలాంతర్గామిలో మెకానికల్ ఇంజనీర్గా పదోన్నతి పొందాడు. రెండు నెలల క్రితం వరకు కూడా విశాఖపట్నంలోనే పని చేసినా.. ఇటీవలే బదిలీపై ముంబై వెళ్లి, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. విశాఖజిల్లా పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు గ్రామానికి చెందిన తూతిక రాజేష్ (29), గోపాలపట్నానికి చెందిన దాసరి ప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు.
వీరిలో రాజేష్కు రెండేళ్ల క్రితమే పెళ్లయింది. 2011 జూన్ 23వ తేదీన శ్రీకాకుళం జిల్లా బత్తిలి ప్రాంతానికి చెందిన జ్యోతిని ఆయన పెళ్లి చేసుకున్నారు. నెల్లిముప్పు గ్రామానికి చెందిన అప్పలనాయుడు, కృష్ణవేణి దంపతులకు మొత్తం ముగ్గురు పిల్లలు. వారిలో రాజేష్ అందరికంటే చిన్నవాడు. ఆయనకు రవికుమార్ అనే అన్నయ్య, రోజా అనే అక్క ఉన్నారు. పదేళ్ల క్రితం నౌకాదళంలో సెయిలర్గా చేరారు. ముంబైలో మొదటి పోస్టింగ్ లభించింది. ఐదారేళ్ల తర్వాత అతడికి విశాఖ పట్నానికి బదిలీ అయ్యింది.
అప్పటినుంచి విశాఖలోనే ఉంటూ... దూరవిద్య పద్ధతిలో బీటెక్ చదివాడు. ఆ తర్వాత పదోన్నతి పొంది మెకానికల్ ఇంజనీర్ అయ్యాడు. రెండు నెలల క్రితం ముంబై బదిలీ కావడంతో భార్యతో సహా అక్కడకు వెళ్లాడు. ముంబైలోని నౌకాదళ క్వార్టర్స్లోనే నివాసం ఉంటున్నాడు. ఎంతో నిబద్ధతతో పనిచేసే రాజేష్.. బుధవారం తెల్లవారుజామున జరిగిన జలంతర్గామి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులతో పాటు ఈ ప్రాంత వాసులు కూడా కన్నీరు మున్నీరయ్యారు.