సింధురక్షక్ నుంచి నాలుగు మృతదేహాలు వెలికితీత
ముంబయి : ఐఎన్ఎస్ సింధురక్షక్ నుంచి నాలుగు మృతదేహాలను నేవీ అధికారులు శుక్రవారం వెలికి తీశారు. మిగతా మృతదేహాల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ముంబై నేవీ డాక్‌యార్డ్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 18 మంది దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురయిన జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధురక్షక్ లోపలకి నేవీ డైవర్లు వెళ్లలేకపోతున్నారు.
సబ్‌మెరైన్ చీకటిగా ఉండడం, నీళ్లతో పూర్తిగా నిండిపోవడంతో లోపలికి వెళ్లేందుకు తీవ్ర అడ్డంకి ఏర్పడుతోంది. దీనికి తోడు భారీ విస్ఫోటంతో లోపలి భాగాలన్నీ వేడితో కరిగిపోయాయి. దీంతో కంపార్ట్‌మెంట్లలోకి వెళ్లే దారులు మూసుకుపోయాయి. భారీ పంపులతో నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.
గాలింపు చర్యలకు అంతరాయం కలుగుతోందని మాత్రమే నేవీ చెబుతోంది. మరోవైపు తమ వారి కోసం నావికుల కుటుంబీకులు మాత్రం ఆశగా ఎదురుచూస్తున్నారు. సింధు రక్షక్‌లో ప్రమాదం జరగడం రెండేళ్లలో ఇది రెండోసారి. గతంలో జరిగిన పేలుడులో ఓ నావికుడు చనిపోగా, ఇద్దరు గాయపడ్డారు.