సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: ముంబై డాక్‌యార్డ్‌లో ప్రమాదానికి గుైరె న ఐఎన్‌ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి నుంచి శనివారం రాత్రి మరో మృతదేహాన్ని వెలికితీశారు. మిగతా మృతదేహాల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. నేవీ గజ ఈతగాళ్లు శుక్రవారం ఐదుగురి మృతదేహాలను వెలికితీయగా.. శనివారం నాలుగో రోజు గాలింపుల్లో ఒక శవాన్ని బయటికి తీశారు. మరో 12 మంది నావికుల ఆచూకీ తెలియాల్సి ఉంది. జలాంతర్గామి లోపలికి వెళ్లేందుకు గజ ఈతగాళ్లు వెనకవైపున గల మరో మార్గాన్ని తెరవగలిగారని, వేడికి కరిగిపోయి బిగుసుకుపోయిన ముందువైపు మార్గాన్నీ తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారని శనివారం రక్షణ శాఖ పీఆర్‌ఓ నరేంద్రకుమార్ విస్‌పుతే తెలిపారు. చమురు కలిసిన నీరు, బురద, చిమ్మ చీకటి కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అయినా.. గజ ఈతగాళ్లు అణువణువూ తడుముతూ గాలిస్తున్నారన్నారు.
కాలినగాయాలతో మునగడం వల్లే మృతి...
కాలినగాయాలు కావడం, పొగను పీల్చడంతోపాటు నీటిలో మునగడం వల్లే ఐదుగురు నేవీ సిబ్బంది మరణించారని ఇక్కడి జేజే హాస్పిటల్ వైద్యులు శవపరీక్షలో నిర్ధారించారు. వారి శరీరంలోకి మేకుల్లాంటి ఎలాంటి వస్తువులూ చొచ్చుకుపోలేదని ఎక్స్‌రేల్లో తేలిందని వారు తెలిపారు. ఐదుగురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందని, డీఎన్‌ఏ పరీక్షల ఫలితాలు వచ్చాకే అవి ఎవరివన్న విషయం తేలనుందని అధికారులు పేర్కొన్నారు.
ఉక్కు కరిగించే వేడికి భస్మమయ్యారా..?
మూడు పేలుళ్లతోపాటు భారీ అగ్నిప్రమాదం కారణంగా జలాంతర్గామిలోని ఉక్కు నిర్మాణమే కరిగిపోయి రూపుమారిపోయింది. అంత వేడిని మానవ శరీరాలు త ట్టుకోవడం అసాధ్యమని, సిబ్బంది మృతదేహాలు భస్మమైపోయి కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. లభించిన మృతదేహాలు గుర్తుపట్టలేని రీతిలో ఉండటంతో మిగతావారూ బతికే అవకాశం లేదని అంటున్నారు. కాగా, జలాంతర్గామిలో బ్యాటరీలను చార్జింగ్ చేసే చోటే తొలుత పేలుడు జరగడాన్ని బట్టి.. కీలకమైన ఆ కంపార్ట్‌మెంట్‌లో భద్రతాపరమైన నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదానికి దారితీసి ఉండొచ్చని రష్యా ఉపప్రధాని దిమిత్రీ రోగోజిన్ అన్నారు. జలాంతర్గామి పరికరాల తయారీలో లోపం కన్నా.. భద్రత పాటించకపోవడమే కారణమై ఉంటుందని పేర్కొన్నారు.